తకరారు!

తకరారు! - Sakshi


కొత్త కలెక్టరేట్‌కు తొలగని గ్రహణం

ఇప్పట్లో పునాదిరాయి పడడం కష్టమే

ప్రజాప్రతినిధుల మధ్య కుదరని సయోధ్య

స్థల ఖరారుపై చేతులెత్తేసిన యంత్రాంగం

సీఎం నిర్ణయంతోనే భూమి పూజకు అవకాశం

మరిన్ని స్థలాలతో ప్రభుత్వానికి తాజా జాబితా




శ్రీశైలం జాతీయ రహదారి లేదా ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిసరాల్లో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయడం రవాణా పరంగా సముచితంగా ఉంటుందని.. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎంచుకుంటే గ్రామీణ నియోజకవర్గాలైన కల్వకుర్తి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వాదిస్తున్నారు.      



సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గతేడాది విజయ దశమి రోజున పురుడు పోసుకున్న కొత్త జిల్లాలన్నింటికీ (దాదాపుగా) కలెక్టరేట్‌ స్థలాలను ఖరారు చేసిన రాష్ట్ర సర్కారు.. నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే మన జిల్లాకు కూడా న్యూ కలెక్టర్‌ కాంపెక్స్‌ను జిల్లా భూభాగంలోనే నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.



అందుకనుగుణంగా అనువైన స్థలాల ప్రతిపాదనలను పంపమని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే, ఈ జాబితాపై ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం.. ఎవరికివారు తకు అనువైన ప్రాంతంలోనే కలెక్టరేట్‌ రావాలని పట్టుబట్టారు. దీంతో ఈ వ్యవహారం తమ పరిధిలో తేలేది కాదని భావించిన కలెక్టర్‌ రఘునందన్‌రావు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.



ఈ క్రమంలోనే స్థలాల పరిశీలన బాధ్యతను సీఎస్‌కు అప్పగిస్తానని, ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఆదేశాల మేరకు రెండు నెలల క్రితం రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం మండలాల్లో ప్రతిపాదిత స్థలాలను సందర్శించిన ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, రెవెన్యూ కార్యదర్శి బీఆర్‌ మీనా బృందం.. రాజేంద్రనగర్‌ యూనివర్సిటీలోని ఓ స్థలంపై ఆసక్తిని ప్రదర్శించింది.


జిల్లాల పునర్విభజనలో మొదట శంషాబాద్‌ ప్రాంతం పేరు పరిశీలించినందున జిల్లా కేంద్రాన్ని తన సెగ్మెంట్‌లోనే ఏర్పాటు చేయాలనే వాదనను తెరపైకి తెచ్చిన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌.. తన వాదనకు అనుకూలంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్య, అరికెపూడి గాంధీ మద్దతు కూడగట్టారు. ఈ మేరకు సీఎస్‌ను కలిసి కలెక్టరేట్‌ ఆవశ్యకతపై వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కలెక్టరేట్‌ ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని స్పష్టం చేశారు.



పట్టుబట్టి మరి..

కలెక్టరేట్‌ను రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా ఎగరేసుకుపోతున్నారని గమనించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి పెంచారు. శ్రీశైలం జాతీయ రహదారి లేదా ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిసరాల్లో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయడం రవాణా పరంగా సముచితంగా ఉంటుందని.. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎంచుకుంటే గ్రామీణ నియోజకవర్గాలైన కల్వకుర్తి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని వాదించారు.

 

దీంతో వర్సిటీలో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని దాదాపుగా నిర్ణయించిన ప్రభుత్వ పెద్దలు పునరాలోచనలో పడ్డారు. ఈ వ్యవహారంలో ముందుకెళితే ప్రజాప్రతినిధుల నుంచి తలనొప్పులు ఎదురవుతాయని భావించి.. బంతిని ముఖ్యమంత్రి కోర్టులోకి నెట్టారు. అదే సమయంలో అందరి ఎమ్మెల్యేలలో సంప్రదింపులు జరిపి కలెక్టరేట్‌ స్థలాన్ని ఖరారు చేసే బాధ్యతను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి అప్పగించారు.



దీంతో ఆయన మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో అనువైన టీఎస్‌ఐఐసీకి బదలాయించిన స్థలాలను ప్రజాప్రతినిధులకు చూపారు. వీటిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇదిలావుండగా, జిల్లా యంత్రాంగం మాత్రం మొదట్లో పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా మరికొన్ని స్థలాల జాబితాను జోడించి ప్రభుత్వానికి నివేదించింది. వీటిపై వారం, పది రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నా.. ప్రజాప్రతినిధుల్లో ఏకాభిప్రాయం కుదిరితే తప్ప కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. లేదా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తే కలెక్టరేట్‌కు పునాదిరాయి పడే అవకాశం ఉంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top