అంగన్‌వాడీల్లో.. నారాయణ మంత్రం

అంగన్‌వాడీల్లో..  నారాయణ మంత్రం - Sakshi


కార్పొరేట్‌ సంస్థ కోసం ఐసీడీఎస్‌ను నిర్వీర్యంచేసే కుట్ర

మోడల్‌ అంగన్‌వాడీల పేరిట పలు సెంటర్లు రద్దు

ఎంపికచేసిన వర్కర్లకు  నారాయణ వారితో ప్రత్యేక శిక్షణ

త్వరలో పూర్తిస్థాయిలో అమలుకు  సర్కారు సన్నాహాలు




దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారికి పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఐసీడీఎస్‌ ప్రాజెక్టు నిర్వీర్యం కానుందా..? మోడల్‌ అంగన్‌వాడీల పేరిట పలు సెంటర్లు రద్దు కానున్నాయా..? చిరుద్యోగుల బతుకులు వీధిన పడనున్నాయా..? అంటే అవుననే అంటున్నారు పలువురు విశ్లేషకులు. ఇంగ్లిష్‌ బోధన అంటూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ జపం చేస్తూ.. నారాయణ మంత్రాన్ని పఠించడం పలు విమర్శలకు తావిస్తోంది.  



పలమనేరు: ఐసీడీఎస్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇకపై నారాయణ మం త్రం జపించబోతున్నారు. మోడల్‌ అంగన్‌వాడీ సెంటర్ల పేరిట ప్రభుత్వం జిల్లాలోని పలు ప్రాజెక్టులను ఎంపికచేసింది. అంగన్‌ వాడీ సెంటర్లను పూర్తిస్థాయి ఇంగ్లిష్‌ కాన్వెంట్లుగా మార్చే కార్యక్రమం అంటూ మభ్యపెడుతోంది. ఇందుకోసం మూడేసి అంగన్‌వాడీ కేంద్రాలను ఒకటిగా కలిపి మోడల్‌ కాన్వెంట్లుగా తయారుచేస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లకు నారాయణ విద్యాసంస్థలకు చెందిన టీచర్లతో శిక్షణ ఇస్తున్నారు.



పలమనేరు ఐసీడీఎస్‌ పరిధిలో  335 అంగన్‌వాడీ సెంటర్లున్నాయి. ఇందులో మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 6,179 మంది ఉన్నారు. పలమనేరు మున్సిపాలిటీలో 8, మండల కేంద్రాల్లో కొన్నింటిని కలిపి మొత్తం 20 సెంటర్లను మోడల్‌ అంగన్‌వాడీలుగా ఎంపిక చేశారు. దీనికోసం ఇన్నాళ్లూ సాఫీగా కొనసాగుతున్న 20 సెంటర్లను రద్దుచేశారు. అంగన్‌వాడీ వర్కర్లకు ఈ మధ్యనే పలమనేరులోని నారాయణ స్కూల్‌లో బోధనపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంగన్‌వాడీ పిల్లలను 3 నుంచి 3.7 నెలల వయసు దాకా నర్సరీ, 3.8 నెలల నుంచి 4.8 నెలల దాకా ఎల్‌కేజీ, 4.9 నెలల నుంచి 5.8 నెలల దాకా యూకేజీగా జాబితాను తయారు చేశారు. ఈ పిల్లలకు నారాయణ పాఠశాలలో ఎదైతే సిలబస్‌ ఉందో అదే పుస్తకాలను పంపిణీ చేశారు. త్వరలో ఈ మోడల్‌ అంగన్‌వాడీలు ఇక్కడ ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఎంపికచేసిన ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.



దీనివల్ల ఒరిగేదేమీ లేదు

మామూలుగా ఐసీడీఎస్‌ ద్వారా పిల్లలకు బోధన బా గానే ఉంది. ప్రత్యేకంగా పిల్లల కోసం ప్రత్యేక సిలబ స్‌ను రూపొందించి తద్వారా పాఠాలు చెబుతున్నారు. బోధన కోసం బొమ్మలను కూడా ప్రభుత్వం అన్ని సెంటర్లకు పంపిణీ చేసింది. ప్రస్తుతం ఉన్న బోధనా పరికరాలు, పుస్తకాలు వృథా కావాల్సిందే. పదో తరగతి చదువుకున్న అంగన్‌వాడీలు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు పదిరోజులు శిక్షణ తీసుకున్నంత మాత్రాన కార్పొరేట్‌ శైలిలో కాన్వెంట్‌ పాఠాలు చెప్పడం కుదిరేపనేనా అని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థలకు అంగన్‌వాడీ పిల్లలకు ప్రమోట్‌ చేసేందుకు ప్రభుత్వమే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.



జిల్లాలో 160 సెంటర్ల దాకా రద్దు..

ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్‌ ఏరియాల్లో అన్ని సెంటర్లు, మండలానికి రెండు కేంద్రాలను మోడల్‌ అంగన్‌వాడీలుగా మార్చారు. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో 120 కేంద్రాలను మూడింటికి ఒకటి చొప్పున 40కి కుదించారు. 60 మండలాల్లో రెండేసి చొప్పున 120 సెంటర్లను 40కి తగ్గించారు. మొత్తం జిల్లాలో 80 అంగన్‌వాడీలను మోడల్‌ అంగన్‌వాడీలుగా మార్చారు. ఈ నేపథ్యంలో 160 సెంటర్లు మూతబడినట్టే. రద్దు చేసిన వర్కర్లు మోడల్‌ సెంటర్లలో పనిచేసేలా ఆదేశాలిచ్చారు. అంటే ఒక్కో సెంటర్‌లో ముగ్గురు వర్కర్లు మూడు తరగతులు బోధించాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top