కాళేశ్వరంలో కదలిక..!

కాళేశ్వరంలో కదలిక..!


భూ సేకరణకు రంగం సిద్ధం

ఆగస్టు 22 లేదా 23న ప్రజాభిప్రాయ సేకరణ

రిజర్వాయర్ల వారీగా వివరాలు రెడీ

జిల్లాలో 15,16 ప్యాకేజీల్లో ప్రాజెక్ట్‌ పనులు


రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రాజెక్ట్‌ భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం  అప్రమత్తమైంది. ఆగస్టు 22 లేదా 23 తేదీల్లో ప్రజాభిప్రాయసేకరణకురంగం సిద్ధం చేస్తోంది.



సాక్షి, యాదాద్రి : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు నీరందించడంతో పాటు హైదరాబాద్‌ నగరానికి తాగు నీరు సరఫరా చేసేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు ఈ మేరకు ప్రాజెక్ట్‌ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 22 లేదా 23వ తేదీల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచిండంతో రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం  ఏయే గ్రామాల్లో ఎంత మంది రైతుల నుంచి భూసేకరణ చేయాలనే వివరాలను సర్వే నెంబర్ల వారీగా ఇప్పటికే గుర్తించారు. భూములు కోల్పోతున్న వారికి నోటీసులు జారీ చేయనున్నారు.



2,43,500 ఎకరాలకు సాగు నీరు..

జిల్లాలో  2,43,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. రీడిజైన్‌లో భాగంగా ప్యాకేజీ15, ప్యాకేజీ16లో జిల్లాలో కాళేశ్వరం పనులు చేపడుతున్నారు. ప్రాజెక్ట్‌ పరిధిలో బస్వాపురం, గంధమల్ల చెరువులను రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. అయితే తొలుత నిర్ణయించిన ప్రకారం కాకుండా వీటిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచింది. బస్వాపురం రిజర్వాయర్‌ 11.39 టీఎంసీలు కాగా, గంధమల్ల రిజర్వాయర్‌ 9.86టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తారు.



గంధమల్ల రిజర్వాయర్‌..

ప్యాకేజీ 15లో భాగంగా గంధమల్ల రిజర్వాయర్‌ను చేపడుతున్నారు. ఈరిజర్వాయర్‌ పరిధిలో 63,300 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. దీని పరిధిలోకి తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, యాదగిరిగుట్ట మండలాలు వస్తాయి. సిద్ధిపేట జిల్లా తిప్పారం నుంచి నల్లగొండ జిల్లా చిట్యాల వరకు కాల్వల భూసేకరణ చేయాల్సి ఉంది.



గంధమల్ల రిజర్వాయర్‌ ఇలా..

గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణానికి 643 ఎకరాల భూమి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 106ఎకరాలు సేకరించారు. మరో 287ఎకరాలు సేకరించాల్సింది. ఎల్‌పీ షెడ్యూల్‌ సమర్పించింది 393 ఎకరాలకు. అదే విధంగా కాల్వల కోసం 2,274ఎకరాలు సేకరించాలి. రిజర్వాయర్‌లో 4,027ఎకరాలు భూమి ముంపునకు గురి కానుంది.



ముంపునకు గురయ్యే గ్రామాలివే..

గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయితే తుర్కపల్లి మండలంలోని  గంధమల్ల, వీరారెడ్డిపల్లి, ఇందిరానగర్‌తండా, తెట్టకుంట తండాలు ముంపునకు గురవుతాయి.



బస్వాపురం రిజర్వాయర్‌ ఇలా..

బస్వాపురం రిజర్వాయర్‌ ద్వారా ఆలేరు, ఆత్మకూరు(ఎం), ఎం.తుర్కపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, రామన్నపేట, నారాయణపురం మండలాలకు సాగు నీరు అందనుంది. ప్రధాన కాల్వకు 1,679 ఎకరాలు అవసరం ఉండగా ఎల్‌పీ 1,679 ఎకరాలకు షెడ్యూల్‌ సమర్పించింది. ఇప్పటి వరకు 539 ఎకరాలు సేకరించారు. ఇంకా 1,140ఎకరాలు సేకరించాల్సి ఉంది. అదే విధంగా రిజర్వాయర్‌ నిర్మాణం కోసం 485 ఎకరాలు సేకరించారు. కాల్వల కోసం 3,500ఎకరాలు సేకరించాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top