ఆపరేషన్లే మార్గమా?


పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు సౌకర్యాలు

అధికారుల తీరుతోనే బిల్లుల ఆలస్యం

కేజీబీవీల్లో అవాంఛనీయ ఘటనలకుపోలీసు, రెవెన్యూ ఉద్యోగులదే బాధ్యత

సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం శ్రీహరి




హన్మకొండ : సాధారణ ప్రసవాలు చేసేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నప్పటికీ వైద్యులు ఇష్టం వచ్చినట్లు సిజేరియన్లు చేస్తుండడం దారుణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశా రు. గర్భిణులు ప్రసవం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తే సిజేరియన్‌ చేసి రూ.20వేల నుంచి రూ.30వేల బిల్లులు తీసుకోవడమే కాకుండా గర్భసంచి తొలగిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రభుత్వ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని శ్రీహరి సూచించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌  అధ్యక్షతన హన్మకొండలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయా విభాగాల అధికారులతో కడియం సుదీర్ఘంగా సమీక్షించారు.



పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు

నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు పాఠశాలల్లో ఫర్నీచర్, నీరు, మరుగుదొడ్లు తదితర మౌళిక సౌకర్యాల కల్పనకు అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇక కేజీబీవీలు, ఇతర బాలికల పాఠశాలల్లో అవాంఛనీయ ఘటనలు జరిగితే స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులదే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన బిల్లులు, వలంటీర్ల వేతనాలకు సంబంధించి ట్రెజరీ నియంత్రణ లేనందున ఎప్పటికప్పుడు చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే అధికారుల లోపమేనని శ్రీహరి స్పష్టంంంం చేశారు.



కాపీ లేకుండా ఉత్తీర్ణత పెంచాలి

పదో తరగతి పరీక్షల సందర్భంగా చూచి రాతలు జరగకుండా చూస్తూనే గతంలో ఉన్న ఉత్తీర్ణత శాతం రికార్డులను నిలబెట్టాలని విద్యాశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచించారు. పాఠశాలల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలకు సంబంధించి వివరాలు సమర్పిస్తే కొత్తవి మంజూరు చేస్తామన్నారు. పాఠశాలల గోడలపై విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే సూక్తులు రాయాలే తప్ప ఇతర ఎలాంటి రాతలున్నా సహించేది లేదన్నారు. కేజీ టూ పీజీలో భాగంగా ఆంగ్ల మాధ్యమం పాఠశాలల పెంపు, అంగన్‌వాడీలను పాఠశాలల్లోనే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు సూచించగా, ఇది విధాన నిర్ణయం కనక ప్రభుత్వంతో మాట్లాడతానని కడియం తెలిపారు. కాగా, ఆసరా పింఛన్లు మొదటివారంలోనే ఇచ్చేలా చూడాలని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద ఇచ్చే చెక్కులను పెళ్లికి రెండురోజుల ముందే ఇవ్వాలని సూచించిన కడియం.. చలివాగు ప్రాజెక్టు వద్ద మిషన్‌ భగీరథ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసి మార్చి 31లోగా ట్రయల్‌ రన్‌ చేయాలని ఆదేశించారు. ఇంకా యాసంగికి సంబంధించి ఇరిగేషన్‌ శాఖ తైబందీ ఖరారు చేయాలని కడియం సూచించారు.



బయోమెట్రిక్‌ తప్పనిసరి..

పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని తెలుస్తున్నందున బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరిగా అమలుచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌ అధికారులను ఆదేశించారు. తద్వారా పాఠశాలల్లో బోధన మెరుగుపడుతుందన్నారు. మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ మాట్లాడుతూ కేజీబీవీలు, బాలికల వసతిగృహాల విద్యార్థులను తల్లిదండ్రులు వస్తేనే పంపించాలని సూచించారు. బయోమెట్రిక్‌ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, అరూరి రమేష్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జాయింట్‌ కలెక్టర్‌ హరిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top