హోదా ఇవ్వాలన్న ఆలోచన మోదీకి లేదు

హోదా ఇవ్వాలన్న ఆలోచన మోదీకి లేదు - Sakshi


సాధించే సంకల్పం బాబుకు లేదు: భూమన ధ్వజం

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంత మాత్రం లేదని, కేంద్రంపై పోరాడి సాధించాలన్న సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేనేలేదని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామిపాద సన్నిధైన తిరుపతిలో వాగ్దానం చేసిన మోదీ.. ఇప్పుడు ఇవ్వకపోతే కచ్చితంగా నేర స్తుడవుతారన్నారు.



పదిహేనేళ్లు కావాలని చెప్పి ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబుకు.. ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అర్హత లేదన్నారు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ శవమై పోయిందని, హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయనని, పోరాడనని చంద్రబాబు చెప్పడం వల్ల టీడీపీ జీవచ్ఛవంలా మారిందని భూమన అన్నారు. బీజేపీ, టీడీపీ  మాటలతో మోసపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు రగిలి పోతున్నారన్నారు.



ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు దానిని నీరు గార్చేందుకు ప్రయత్నించారని, ప్రజల్లో ఉద్యమిస్తున్నపుడు మాత్రం హోదా సాధనే లక్ష్యమంటున్నారని ధ్వజమెత్తారు. ఇపుడు రాజ్యసభలో చర్చ పేరుతో కాంగ్రెస్, టీడీపీ నాటకానికి తెరలేపాయన్నారు. అసలు రాజ్యసభలో చర్చ గాని, బిల్లుగాని అవసరం లేదనే విషయం తెలిసి కూడా చంద్రబాబు చర్చకు రెడీ అన్నారని, పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశం ఓటింగ్‌లో నెగ్గక పోతే దానిని సాకుగా చూపి ఇక ఆ అంశాన్ని ముగించాలనే కుట్రతో టీడీపీ ఉందన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఇదంతా అవసరం లేకుండా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే సరిపోతుందన్నారు. దానికోసం చంద్రబాబు ఒత్తిడి చేయక పోవడం దారుణమన్నారు.

Election 2024

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top