అక్రమాల అధిపతి.. రాజధాని కరోడ్‌పతి!

అక్రమాల అధిపతి.. రాజధాని కరోడ్‌పతి!


రాజధానిలో ఆ అధికారి చేయని అక్రమాలు లేవు. రికార్డులు తారుమారు చేయటం నుంచి ఒకరి భూములను మరొకరి పేరున మార్చటం. పట్టా భూములను ప్రభుత్వ భూములుగా చూపటం. రిజిస్ట్రేషన్‌కు వీల్లేని భూములను సైతం అమ్మి డాక్యుమెంట్లు సృష్టించటం. ఒకటేంటి ఆయన తలచుకుంటే కానిదంటూ ఉండదంటారు. అలాంటి అధికారికి ఇప్పుడు భయం పట్టుకుంది. బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.



సాక్షి, అమరావతి బ్యూరో : అక్రమాల అధిపతికి  కొద్దిరోజులుగా భయం పట్టుకుంది. తన అక్రమాలు బయటపడితే పరిస్థితేంటని ఆందోళన మొదలైంది. అందుకే రాజధాని ప్రాంతం నుంచి బదిలీపై వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ప్రయత్నాలను ముమ్మరం చేశారు.  అయితే ‘ముఖ్య’ నేత అడ్డు చక్రం వేశారు. రాజధానిలో పనులన్నీ పూర్తయ్యే వరకు వెళ్లటానికి వీల్లేదని తేల్చిచెప్పారు. రాజధాని పరిధిలో అతి ముఖ్యమైన మండలంలో రెవెన్యూ అధికారి ఆయన. గతంలో మూడేళ్లపాటు ఇదే మండలంలో రెవెన్యూ అధికారిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మండల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, మిగులు, గ్రామ కంఠాలు, దేవాదాయ, అటవీ భూములు ఎక్కడెక్కడ? ఎంతెంత? ఉన్నాయనే విషయం బాగా తెలిసిన అధికారి. అలానే రెవెన్యూ చట్టాలు, అందులో లొసుగులూ తెలుసు. ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియలోనూ చక్రం తిప్పారు.



అక్రమాలకు సూత్రధారి ...

రాజధాని ప్రకటన తరువాత అధికార పార్టీ నేతలకు పట్టా, ప్రభుత్వ భూములను కొనుగోలు చేయింటంలో రెవెన్యూ అధికారి ప్రధానపాత్ర పోషించారు. ప్రభుత్వ భూములను సైతం రిజిస్ట్రేషన్లు చేయించిన ఘనుడు.  పట్టా భూములను సైతం ప్రభుత్వ భూములుగా రికార్డులు తయారు చేసినట్లు సమాచారం. రాజధాని గ్రామాల్లో సెంట్లు రూపంలో భూములు మాయం చేసి అధికారపార్టీ నేతలకు కట్టబెట్టటంలో ఆయన ప్రధాన పాత్ర పోషించినట్లు చెప్పుకుంటారు. టీడీపీ నాయకులతో పాటు ఆయన కూడా బినామీ పేర్లతో భూములు కొట్టేసినట్లు రాజధానిలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులను బదిలీపై వెళ్లిన ఓ ఆర్డీఓ, ఈ అధికారి కలిసి తీవ్రస్థాయిలో బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.



అంతేకాక, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి.. వాటిని సరి చేయటానికి ఖర్చు అవుతుందని చెప్పి భారీ ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ప్రతి సంతకానికి ఓ రేటు నిర్ణయించి లక్షల రూపాయలు వసూలు చేసి కోట్లకు పడగలెత్తినట్లు రాజధానిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అవినీతి అక్రమాల ద్వారా దాదాపు రూ.100కోట్లకు పైగా కూడబెట్టినట్లు తెలిసింది. ఇటీవల పెద్దనోట్ల రద్దు సమయంలో ఈ అధికారి తన కింది స్థాయిలో పనిచేసే వారి ద్వారా సుమారు రూ.27 కోట్ల మార్చినట్లు ఓ వీఆర్వో తెలిపారు.



బదిలీ కోసం తీవ్ర ప్రయత్నాలు ...

రాజధానిలో భారీగా కూడబెట్టిన సొమ్ము, అక్రమాలు బయటపడితే ప్రమాదమని భావించిన రెవెన్యూ అధికారి  ఐదు నెలల కిందట ఇక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ప్లాట్ల కేటాయింపు పూర్తయ్యాక వెళ్లొచ్చని ‘ముఖ్యనేత’ అనటంతో ఆగిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్లాట్ల కేటాయింపు  పూర్తి కావడంతో బదిలీ చేయాలని తన ప్రయత్నాలకు పదును పెట్టారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. దీనికి బలం చేకూర్చే క్రమంలో ఇటీవల కొద్దిరోజులు సెలవు కూడా పెట్టారు. అయినా ఆయన బదిలీకి మళ్లీ బ్రేక్‌ పడింది. రాజధాని పరిధిలో ప్రస్తుతం భూ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాకే బదిలీ అని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయినా ఆ అధికారి ఉన్నతాధికారుల వద్ద పైరవీలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top