సినిమా కష్టమే!

సినిమా కష్టమే! - Sakshi

- జీఎస్టీతో 28 శాతం దాకా పెరగనున్న వినోదపన్ను

భారీగా పెరగనున్న సినిమా టిక్కెట్ల ధర

జులై 1 నుంచి అమల్లోకి రానున్న వైనం

 

సాక్షి ప్రతినిధి, కడప: పండగొచ్చినా.. సెలవొచ్చినా.. కొంచెం సమయం దొరికినా సామాన్య, మధ్యతరగతి వర్గాలు వినోదం కోసం సినిమాకు వెళతారు. ఇటీవల కాలంలో సినిమా థియేటర్ల నిర్వహణ ఖర్చు భారీగా పెరిగింది. ఆధునిక హంగులు సమకూర్చిన థియేటర్ల వైపే ప్రేక్షకులు పరుగులు పెడుతుండటంతో సినిమా థియేటర్ల నిర్వహణలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీ తట్టుకోలేక ఇప్పటికే అనేక థియేటర్లు కల్యాణ మండపాలుగా మారిపోయాయి. మార్కెట్‌లో పోటీ కారణంగా ఏ సెంటర్లలో టిక్కెట్టు ధర రూ.50 నుంచి రూ.120 దాకా పెరిగింది. టిక్కెట్టుతో పాటు తినుబండారాల ధరలు కూడా మోత మోగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి జనం కుటుంబసమేతంగా సినిమాకు వెళ్లాలంటే హడలిపోతున్నారు.



పెద్ద సినిమాల రిలీజు రోజు మినహా మిగిలిన రోజుల్లో అంతంత మాత్రం కలెక్షన్లతో థియేటర్లు ఇబ్బందిపడుతున్న తరుణంలో జులై 1వ తేదీ నుంచి జీఎస్‌టీ అమలులోకి రాబోతోంది. దీని ప్రకారం ప్రస్తుతం  15 నుంచి 18 శాతం దాకా ఉన్న వినోదపు పన్ను ఏకంగా 28 శాతానికి పెరగనుంది. థియేటర్‌ యాజమాన్యాలు ఈ భారం ప్రేక్షకులపై వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వినోదం మరింత ఖరీదు కాబోతోంది.

 

ఏడాదికి రూ 4 కోట్ల భారం

ప్రొద్దుటూరులోని మల్టీఫ్లెక్స్‌తో కలుపుకొని జిల్లాలో ఏ, బీ, సీ సెంటర్లలో మొత్తం 54 సినిమా థియేటర్లు ఉన్నాయి. ఏ సెంటర్‌లైన కడప, ప్రొద్దుటూరులో రూ.50 నుంచి టిక్కెట్టు ప్రారంభ ధర ఉంది. బీ, సీ సెంటర్లలో రూ.20 నుంచి టిక్కెట్టు ప్రారంభ ధర ఉంది. నూతన జీఎస్‌టీ విధానం అమలైతే జిల్లావ్యాప్తంగా సినిమా టిక్కెట్ల ధరలు, అందులో విక్రయించే చిరుతిండ్లు, కూల్‌డ్రింక్‌ల రూపంలో ప్రేక్షకుల మీద ఏడాదికి రూ.4 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అనధికారిక అంచనా.

 

టిక్కెట్టు ధరను బట్టి పన్ను విధింపు

ఇప్పటివరకు డబ్బింగ్‌ సినిమాలకు 20 శాతం, తెలుగు సినిమాలకు 15 శాతం వినోదపు పన్ను వసూలు చేస్తున్నారు. కొత్తగా అమల్లోకి రానున్న జీఎస్టీ ప్రకారం రూ.100లోపు టిక్కెట్టు ధర ఉంటే 18 శాతం, రూ.100 పైన టిక్కెట్టు ధర ఉంటే 28 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా అన్ని సెంటర్లలో టిక్కెట్ల ధరలు పెరగడం అనివార్యమవుతుంది. జీఎస్‌టీ ద్వారా ఒక్కసారిగా 28శాతం దాకా పన్ను పెరగనుండటంతో థియేటర్ల  యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. టిక్కెట్ల ధరలు పెంచితే ప్రేక్షకుల సంఖ్య తగ్గి తమ వ్యాపారం దెబ్బతింటుందనీ, ధర పెంచకపోతే ఆ మేరకు తామే అదనపు భారం భరించాల్సి వస్తుందనీ ఆందోళన చెందుతున్నారు.

 

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారం యాజమాన్యాలు భరించే పరిస్థితి లేదని వారు చెబుతున్నారు. మొత్తం మీద జీఎస్‌టీ పుణ్యమా అని సామాన్య, మధ్యతరగతి జనం సినిమా లాంటి చిన్న వినోదానికి కూడా దూరమయ్యే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top