ముగ్గురి ఉసురు తీసిన అతివేగం

accident - Sakshi


మద్దిపాడు:


- ఆగి ఉన్న కాలేజీ బస్సును ఢీకొన్న కారు

-అందులో ఉన్న ముగ్గురు యువకుల దుర్మరణం

-తీవ్ర గాయాలతో బయటపడిన మరో యువకుడు

-వెంకట్రాజుపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన

-మృతులు, క్షతగాత్రులది కందుకూరు సమీపంలోని గ్రామాలు

-వారంతా స్నేహితులు.. కన్నీటిపర్యంతమైన కుటుంబ సభ్యులు


 

కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలను క్షణాల్లో తీసుకెళ్లింది. ఉన్నత భవిష్యత్తు ఉన్న యువకులు సరదాగా హైదరాబాద్‌ వెళ్లి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. గంటలో ఇంటికి చేరుతామనుకుంటుండగా మృత్యువు వచ్చి అమాంతంగా స్నేహితులైన ముగ్గురినీ కౌగిలించుకుంది. మరో యువకుడు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన మద్దిపాడు మండలం వెంకట్రాజుపాలెం జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగింది. 


మద్దిపాడు మండలం వెంకట్రాజుపాలెం జాతీయ రహదారిపై ముందు ఆగి ఉన్న కాలేజీ బస్సును కారు ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అందిన వివరాల ప్రకారం.. కందుకూరు సమీపంలోని ఆనందపురం పంచాయతీ పరిధి శ్యామీరపాలేనికి చెందిన పువ్వాడ యోహాన్‌బాబు(27) ఒంగోలులోని రావు అండ్‌ నాయుడు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. ఇతనికి హైదరాబాద్‌లో ఓ పని ఉంది. అతను కారులో హైదరాబాద్‌ వెళ్తూ.. వెళ్తూ.. తన స్నేహితులు అదే గ్రామానికి చెందిన డీలర్‌ ఎస్‌కే షబ్బీర్‌(35), దూబగుంటకు చెందిన మున్నూరు మురళి(25)తో పాటు తన వద్ద పని చేసే ఎరుకమాటి వెంకట్రావును ఎక్కించుకున్నారు.



హైదరాబాద్‌లో పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామాలకు అదే కారులో శుక్రవారం రాత్రి పయనమయ్యారు. వెంకట్రాజుపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఒంగోలు హర్షిణీ కళాశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకునేందుకు ఆగే ప్రయత్నంలో ఉంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు.. ముందు ఆగి ఉన్న కాలేజీ బస్సును వేనుక నుంచి బలంగా ఢీకొట్టింది.  ప్రమాదంలో కారు డ్రైవ్‌ మురళి, షబ్బీర్, యోహాన్‌బాబుతో పాటు వెంకట్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. షబ్బీర్, యోహాన్‌బాబు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మురళి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెంకట్రావు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. 


తునాతునకలైన కారు

బస్సులో ఉన్న విద్యార్థులు, స్థానిక యువకులు రంగంలోకి దిగి ట్రాక్టర్‌లతో కారును బయటకు లాగారు. కారులో ఉన్న మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. స్నేహితులు ముగ్గురూ చనిపోవటంతో బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. వారు రోదిస్తున్న తీరు చూసి స్థానికుల కళ్లు చెమ్మగిల్లాయి. ఎస్సై దేవకుమార్‌తో కలిసి ఒంగోలు రూరల్‌ సీఐ మురళీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. షబ్బీర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మిగిలిన ఇద్దరికీ వివాహం కాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్‌ సీఐ మురళీకృష్ణ తెలిపారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top