రైతు కుటుంబాలకు ‘జాగృతి’ బాసట

రైతు కుటుంబాలకు ‘జాగృతి’ బాసట - Sakshi


♦ 389 కుటుంబాలకు నాలుగేళ్లపాటు నెలకు రూ.2,500 సాయం

♦ వచ్చే నెల 1 నుంచి ప్రతినెలా వారి ఖాతాల్లోకి నేరుగా..

♦ విరాళంగా కోటి రూపాయలు వచ్చింది

♦ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి

 

 సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడాన్ని తెలంగాణ ఆడబిడ్డగా బాధ్యత తీసుకుంటున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పారు. 389 రైతు కుటుంబాలకు ప్రతీ నెలా రూ.2,500 చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయమందిస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది జూన్ 2న తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, ఇందులో త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికల మేరకు 397 మందికి మాత్రమే ప్రభుత్వం సాయం అందించనుందన్నారు.



మిగిలిన 389 కుటుంబాలను జాగృతి ఆదుకుంటుందని కవిత తెలిపారు. ఇప్పటివరకు విరాళంగా కోటి రూపాయలు అందినట్లు చెప్పారు. జాగృతి ఖాతా నుంచి నేరుగా ఆ కుటుంబాల బ్యాంకు అకౌంట్‌లోకి డబ్బులు పంపుతామని, నవంబరు 1 నుంచి వారికి సాయం అందుతుందన్నారు. ప్రభుత్వ సాయం పొందిన కుటుంబాలను కూడా ఆదుకుంటామని, పిల్లల చదువుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతుల కోసం ప్రభుత్వం ఏం చేయలేదని ప్రతిపక్షాలు అంటున్నాయని, విద్యుత్, సాగునీటి కోసం చేసిన వేల కోట్ల రూపాయల ఖర్చు రైతుల కోసం కాదా అని ప్రశ్నించారు.



శనివారం నాటి ప్రతిపక్షాల బంద్ విఫలమైందని, టీడీపీ ఇచ్చిన బంద్‌లో కనీసం హెరిటేజ్ సంస్థ కూడా మూతపడలేదన్నారు. ఆయా పార్టీల తరపున రైతుల కోసం ఏం చేస్తారో చెప్పాలని, ముఖ్యంగా టీడీపీ ఏపీలో ఏం చేస్తుందో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఒకే దఫా రైతుల రుణాలను మాఫీ చేయడానికి ఆర్‌బీఐ నిబంధనలు ఒప్పుకోవడం లేదన్నారు. దేశం మొత్తం ఇప్పుడు రైతుల పక్షాన నిలవాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక పండుగగా బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు జాగృతి కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వమే అన్నీ చేయలేదని, పౌర సమాజం కూడా కొన్ని బాధ్యతలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.



 ప్రతిపక్షాల పులివేషాలు

 ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని, చివరకు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడిగా మారి కాంగ్రెస్‌ను టీడీపీకి తోక పార్టీగా మార్చారని కవిత దుయ్యబట్టారు. ప్రతిపక్షాలన్నీ కలసి పులి వేషాలు వేసుకున్నాయని, అంత మాత్రానా పులులు కారని ఎద్దేవా చేశారు. ఆశా వర్కర్ల సమస్యను కేంద్రం పరిష్కరించాల్సి ఉందని, ఇదేదో రాష్ట్ర సమస్య అన్నట్టు విపక్షాలు గొడవ చేస్తున్నాయని, ముఖ్యంగా ఎర్రజెండా పార్టీల లొల్లి ఎక్కువైందన్నారు. ఏపీలో ఆశావర్కర్లు ఎర్రజెండా పార్టీలకు ఎందుకు కనపడటం లేదో సమాధానం చెప్పాలన్నారు.



చంద్రబాబు ఆస్తుల ప్రకటనపైనా కవిత స్పందించారు. తాము ప్రతీ ఏడాది ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు లెక్కలు చెబుతున్నామని, ఎన్నికల సమయంలో అఫిడవిట్లో పేర్కొంటున్నామన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లూ తనను ఆంధ్రా హజారేలా భావించేవారని, ఇప్పుడు ఆంధ్రా ఆస్కార్ కూడా ఆయనకు వస్తుందనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాగా, కొందరు ఆశావర్కర్ల ప్రతినిధులు కవితను తెలంగాణ భవన్‌లో కలిశారు. వారి సమస్యలపై పార్లమెంటులో నిలదీస్తానని వారికి హామీ ఇచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top