ఒక్క చాన్స్‌..!

ఒక్క చాన్స్‌..!


టీపీసీసీ అధ్యక్ష పీఠంపై జిల్లా నేతల కన్ను

మరోసారి చాన్స్‌ కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నాలు

తనకే కావాలని సన్నిహితుల వద్ద జానారెడ్డి చర్చ

అవకాశం కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌

జిల్లానుంచి హస్తిన స్థాయిలో నాయకుల లాబీయింగ్‌

మాకంటే మాకే ఇస్తారని బాహాటంగా ప్రచారం

 అధిష్టానం వద్ద ఎవరి ‘చేతి’గీత బాగుందోనని కార్యకర్తల్లో చర్చ


సాక్షి, నల్లగొండ :

 తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పీఠం సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎవరికి కట్టబెడతారు..? ఎన్నికల రథాన్ని నడిపించే సారథి ఎవరు..?, ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే ఉంటారా..? లేక జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీనియర్‌ నేత జానారెడ్డికి ఇస్తారా..?, తమకు ఇస్తే సత్తా చూపిస్తామంటున్న  కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అవకాశం ఇస్తారా..? ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ.. టీఆర్‌ఎస్‌కు దీటుగా ఉమ్మడి జిల్లాలో స్థానాలు సాధించడంతో రాష్ట్ర స్థాయిలోనే ఆ పార్టీకి జిల్లా కేంద్ర బిందువైంది.


దీంతో సార్వత్రిక సమయానికి జిల్లాకు చెందిన వారే పీసీసీ పీఠంపైన ఉంటారని చర్చ జరుగుతున్నా.. ఇందులో ఎవరిపై అధిష్టానం ఆప్యాయత చూపుతుందోనని ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఈ ముగ్గురు నేతలు మాత్రం ఎవరికివారు హస్తిన స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. ‘ఒక్కసారి’ అవకాశం ఇవ్వండి తామేంటో చూపిస్తామని ఢిల్లీలో పార్టీ పెద్దల ముందు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నట్లు తెలుస్తోంది.



2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా అన్ని జిల్లాలో టీఆర్‌ఎస్‌ గాలి వీచి ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. కానీ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఆ పార్టీ పాచిక అనుకున్నంతగా పారలేదు. ఆరు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడితే.. ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలోనే కాంగ్రెస్‌ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. నాడు ఎన్నికల సారథిగా ఉత్తమ్‌ ఉన్నా జిల్లాలో మాత్రం ఆపార్టీ ముఖ్య నేతలు ఉప్పు.. నిప్పుగానే ఉండి ఎవరికివారు తమ స్థానాల్లో విజయమైతే సాధించారు.


ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు టీఆర్‌ఎస్‌లోకి జంపయ్యారు. ఇక ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ వైపే వెళ్లడంతో ఉన్న నేతలు కుదిరితే సయోధ్య.. లేకపోతే దూరం అన్న చందంగా వ్యవహరిస్తూ తమ అనుచరగణంతో కార్యక్రమాలను చేస్తూ నెట్టకొస్తున్నారు. ఇటీవల రాజధానిలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఏఐసీసీ ముఖ్యనేత దిగ్విజయ్‌సింగ్‌ ‘ఎన్నికల వరకు ఉత్తమ్‌నే కెప్టెన్‌’ అని ప్రకటించారు. అయితే మారుతున్న పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీ నావాను తాము నడిపిస్తామని ఇటు జానా, అటు కోమటిరెడ్డి బ్రదర్స్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈ ఒక్కసారి తనకు ఛాన్స్‌ ఇవ్వాలని ఉత్తమ్‌ కూడా అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెట్టినట్లు ఆ పార్టీ ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు.



అధిష్టానం ఆప్యాయతతో ‘ఉత్తమే’అంటున్నా..?

రాహుల్‌గాంధీ కోటరీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆశీస్సులు దండిగా ఉన్నాయని, వచ్చే ఎన్నికలకు ఆయనే సారథి అని ఆయన అనుచర నేతల గణం ప్రచారం చేస్తోంది. అయితే ఈ మూడేళ్లలో వచ్చిన స్థానిక, ఇతర ఉప ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం, అందుకు నేతల పనితీరు ఎలా ఉందని ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు బేరీజు వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉత్తమ్‌ చేస్తున్న విమర్శలు.. ప్రజల స్పందనపై కూడా ఢిల్లీ స్థాయిలో విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది.



అంతేకాకుండా టీపీసీసీలోని నేతలతో కోఆర్డినేషన్, జిల్లా స్థాయి నేతల మనసులో ఎవరు ఉన్నారు?, ఎన్నికల సమయానికి ఉత్తమ్‌ కొనసాగిస్తే ఎలా ఉంటుంది..? ఎన్ని స్థానాలు సాధిస్తామన్న అంశాలతో ‘పనితీరు’పై సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ ముఖ్య నేతలు గుసగుసలాడుతున్నారు. మొత్తంగా ఎన్నికల సమయానికి ముందే ఉత్తమ్‌నే ఉంచాలా? లేక ఇంకా ఎవరికైనా ఈ పదవి కట్టబెట్టాలా? అన్నది ఆపార్టీ అధిష్టానం ఈ అం శాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.



అవకాశం కోసం జానా ఎదురుచూపులు..

గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండి, ఎమ్మెల్యేగా, సీనియర్‌ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఎమ్మెల్యే జనారెడ్డి కూడా టీపీసీసీ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. ఇటీవల తన సన్నిహితుల వద్ద ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. పీసీసీ పదవిలో ఎవ్వరుంటే.. సార్వత్రిక ఎన్నికల్లో వారి సారథ్యంలో పార్టీ విజయం సాధిస్తే.. వారినే ముఖ్యమంత్రిని చేయడం రాష్ట్రంలో పలుసార్లు అనుసరించి న ఆనవాయితీ.



ఇదే రీతిలో తన సారథ్యంలో విజయం సాధిస్తే ముఖ్యమంత్రిని అవుతానన్న ఆశ ఆయన మనసులో ఉంది. మంత్రి పదవులు అనుభవించి సీనియర్‌ నేతగా ఉన్న జానాకు సీఎం కావడం ఒక్కటే రాజకీయ కలగా మిగి లింది. అయితే పీసీసీ పదవి వస్తే.. పార్టీ అనూహ్య రీతిలో విజయం సాధిస్తే సీఎం కుర్చీ కల సాకారమవుతుందన్న భావనతో ఆయన కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు  వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఉత్తమ్‌ను మార్చాల్సి వస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు జానా దూకుడు సరిపోతుందా? అని అధిష్టానం ఆలోచనలో ఉంది.



పీసీసీ తమదేనని కోమటిరెడ్డి బ్రదర్స్‌..‘దూకుడు’  

టీపీసీసీ తమకు ఇస్తే సత్తా ఏంటో చూపిస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎప్పటి నుంచో అంటున్నారు.  ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒంటికాలుతో విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ప్రభుత్వ పథకాలపై ఫైర్‌ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ పీసీసీ తమకేనని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. అవకాశం ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ఇటీవల కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటన కూడా చేశారు. ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌.. సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరి సత్తా చాటారు.



  ఇదే దూకుడుతో పనిచేస్తామని, తమకు అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి బ్రదర్స్‌ కూడా ఢిల్లీలోని తమ అనుంగు పార్టీ పెద్దల ముందు ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లు తెలిసింది. అక్కడ తమకే  ఆశీస్సులున్నాయని, త్వరలో పీసీసీ పగ్గాలు తమకే వస్తాయని ‘బ్రదర్స్‌’ అక్క డా.. ఇక్కడా ప్ర చారం చేస్తూనే ఉన్నారు. సీనియర్లను కా దని ‘బ్రదర్స్‌’కు పగ్గాలు ఇస్తే.. పార్టీలో పరిస్థితులు ఎలా ఉంటాయని కూడా పార్టీ అధిష్టానం విశ్లేషిస్తోంది. ఈ పరి స్థితుల్లో ‘ఒక్కఛాన్స్‌‘ అంటూ టీపీసీసీ కోసం ఎదురుచూస్తున్న ఆశావాహ నేతలకు.. అధిష్టానం వద్ద ఎవరి ‘చేతి ’గీత బాగుందోనని పార్టీ నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది.



ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాహుల్‌గాంధీ కోటరీ ఆశీస్సులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల వరకు ఆయనే ర«థ సారథి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉత్తమ్‌ చేస్తున్న విమర్శలు అధిష్టానం గమనిస్తోంది..

– ఉత్తమ్‌ అనుచరుల ధీమా..



గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండి,  సీనియర్‌ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. మంత్రి పదవులు అనుభవించారు. అయితే పీసీసీ పదవి వస్తే.. పార్టీ అనూహ్య రీతిలో విజయం సాధిస్తుంది..

– జానా సన్నిహితుల ఆకాంక్ష



ఇటీవల జరిగిన ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌..  సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరి సత్తా చాటారు. ఇదే దూకుడుతో పనిచేస్తారు. అధిష్టానం ఆశీస్సులున్నాయి. త్వరలో పీసీసీ పగ్గాలు వస్తాయి.

 –కోమటిరెడ్డి బ్రదర్స్‌ అభిమానుల ధీమా..

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top