ముగిసిన సభాపర్వం

ముగిసిన సభాపర్వం


♦ విపక్షాలు లేకుండానే మూడు రోజులు సాగిన అసెంబ్లీ, మండలి

♦ శాసనసభలో 30.06 గంటలు.. మండలిలో 26.23 గంటల చర్చ

♦ విపక్ష సభ్యుల మూకుమ్మడి సస్పెన్షన్

♦ ప్రతిపక్షాలు లేకుండానే సభ నిర్వహణ!

 

 సాక్షి, హైదరాబాద్: మునుపెన్నడూ లేని రీతిలో సంచలనం సృష్టించిన శాసనసభ, మండలి సమావేశాలు బుధవారం నుంచి నిరవధికంగా వాయిదాపడ్డాయి. గత నెల 23న మొదలై ఏడు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో చివరి మూడురోజులు విపక్షం లేకుండానే కొనసాగాయి. రైతుల ఆత్మహత్యలపై రెండు రోజుల పాటు చర్చ జరిగినా ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా నిలదీయడంలో విఫలమైన ప్రతిపక్షం... ఆ తరువాత మేల్కొన్నా ప్రయోజనం లేకుండా పోయింది. రుణమాఫీని ఏకమొత్తంగా చెల్లిం చాలంటూ సభను స్తంభింపజేసినా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. అంతేగాకుండా సభలో ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులందరినీ (ఎంఐఎం మినహా) సమావేశాల కాలంపాటు సస్పెండ్ చేసింది.



 మూకుమ్మడి సస్పెన్షన్‌తో అప్రతిష్ట

 ఎంఐఎం మినహా దాదాపు విపక్ష సభ్యులందరినీ బయటకు పంపించి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం సంచలనం సృష్టించింది. చివరకు అధికారపక్ష ఎమ్మెల్యేలు సైతం విపక్షం లేకుండా సభ జర గడంపై విస్మయం వ్యక్తం చేశారు. ‘మాకు మేమే మాట్లాడుకుంటే వచ్చేదేముంది. ప్రతిపక్షం నుంచి ప్రశ్నలు వస్తేనే కదా.. ప్రభుత్వం ఏం చేసిందో వివరంగా చెప్పుకొనే అవకాశం వచ్చేది. పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేయడం, పార్టీకి చెందిన మంత్రులే సమాధానం చెప్పడం.. ఇందులో మజా ఏముంది..’’ అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.



రైతుల సమస్యలపై కావాల్సినంత చర్చ జరిగినా... విపక్ష సభ్యులు కావాలనే మొండిపట్టు పట్టారని, ఇదంతా రాజకీయం కోసం చేశారని అధికార పక్షం తమ నిర్ణయాన్ని సమర్థించుకోజూసింది. అయితే అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతోందన్న వ్యాఖ్యలు వినిపించాయి. వాస్తవానికి బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 9వ తేదీ వరకు, చర్చ సరిపోలేదనుకుంటే 10వ తేదీన కూడా సభ జరపాలని నిర్ణయించారు. కానీ విపక్షాలు లేకుండా ఇన్ని రో జులపాటు సభ నిర్వహించడం సబబు కాదన్న అంతర్మథనం అధికార పక్షంలో జరిగినట్లు చెబుతున్నారు. అందువల్లే మూడు రోజుల ముందే ఇరు సభలను నిరవధికంగా వాయిదా వేశారని అంటున్నారు.



 ముప్పై గంటల పాటు సమావేశాలు

 తొలుత వర్షాకాల సమావేశాలను ఐదారు రోజులకు పరిమితం చేయాలని సర్కారు భావించినా... విపక్షాల కోరిక మేరకు పది పనిదినాలకు అంగీకరించింది. కానీ ఏడు రోజులకే నిరవధికంగా వాయిదా వేసింది. మొత్తంగా శాసనసభలో 30.06 గంటల పాటు చర్చ జరిగింది. ఇందులో టీఆర్‌ఎస్ 18.19 గంటలు, కాంగ్రెస్ 3.56 గంటలు, టీడీపీ 2.07 గంటలు, ఎంఐఎం 2.30 గంటలు, బీజేపీ 1.38 గంటలు, వైఎస్సార్‌సీపీ 42 నిమిషాలు, సీపీఐ 33 నిమిషాలు, సీపీఎం 21 నిమిషాల పాటు చర్చలో పాల్గొన్నాయి.



19 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అనుబంధంగా వచ్చిన 70 ప్రశ్నలకు జవాబిచ్చారు. మరో 14 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఈసారి మొత్తం 26 మంది సభ్యులకే ప్రసంగించే అవకాశం దక్కింది. రెండు బిల్లులను ప్రవేశపెట్టగా ఐదు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇక శాసన మండలిలో 26.23 గంటల పాటు చర్చ జరిగింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top