లెక్కచెప్పండి..?

లెక్కచెప్పండి..? - Sakshi


పంచాయతీ ఎన్నికల్లో  వ్యయం చూపని అభ్యర్థులు

ఎన్నికల కమిషన్‌ సీరియస్‌

జిల్లాలో 2,951మందికి షోకాజ్‌ నోటీసులు

రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశం

లేకుంటే భవిష్యత్‌లో పోటీకి అనర్హులే...


సారంగాపూర్‌(జగిత్యాల): జూలై 2013లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి వ్యయాలకు సంబంధించిన లెక్కలు చూపని వారిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ అయింది. ఈమేరకు అభ్యర్థులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందిన 20 రోజుల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎదుట స్వయంగా హాజరై ఎన్నికల వ్యయవివరాలు అందించాలని ఆదేశించింది.ఇప్పటివరకు వివరాలు అందించడంలో ఎందుకు జాప్యం జరిగిందనే విషయంపైనా రాతపూర్వకంగా సంజాయిషీ సమర్పించాలని పేర్కొంది.




ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలువురు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలు అందజేయడంలో విఫలమయ్యారని అప్పటి జిల్లా కలెక్టర్‌ ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించారు. ఈమేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నోటీస్‌నంబర్‌316/55 సెక్షన్‌–పీఆర్‌–2017 (2785) ద్వారా ఎన్నికల వ్యయం సమర్పించని వారి వివరాలు, నిబంధనలను విడుదల చేసింది. ఎన్నికల నియమావళి, పంచాయతీరాజ్‌ సెక్షన్‌ 230–డి తెలంగాణ పంచాయతీరాజ్‌ యాక్ట్‌ చట్టం 1994 ప్రకారం నోటీసులు అందిన 20 రోజుల్లో ఎన్నికల్లో వ్యయవివరాలు అందించకపోతే రానున్న మూడు సంవత్సరాల్లో అభ్యర్థులు స్థానిక సంస్థల్లో పోటీచేయడానికి అర్హత ఉండదని పేర్కొంది.



లెక్కలు చూపనివారు.. 2,951మంది

జగిత్యాల జిల్లా పరిధిలో 2013–14 గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసి ఖర్చు వివరాలను అందజేయని వారు 2,951 మంది ఉన్నారు. ఇందులో విజయం పొందినవారు, ఓడిపోయినవారూ ఉన్నారు.  సారంగాపూర్, బీర్‌పూర్‌ మండలాల్లో సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీచేసిన వారిలో 328 మంది అభ్యర్థులు ఎన్నికల లెక్కల వివరాలు సమర్పించలేదు. జగిత్యాలలో 18మంది, కొడిమ్యాల 317, మల్యాల 245, మెట్‌పల్లి 151, రాయికల్‌ 468, ధర్మపురి 323, మల్లాపూర్‌ 252, కోరుట్ల 164, పెగడపల్లి 369, వెల్గటూర్‌ 316 మంది అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చుచేసిన వివరాలను రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్‌ను స్వయంగా కలిసి సంజాయిషీ ఇచ్చి, వివరాలు అందజేయాలని ఆదేశించారు.



ఎంపీడీవో కార్యాలయాలకు నోటీసులు

జిల్లాలో ఎన్నికల వ్యయం సమర్పించని అభ్యర్థులకు ఎంపిడీవో కార్యాలయాల ద్వారా నోటీసులు అందజేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారు ఈ విషయంపై హైరానా పడిపోతున్నారు. వచ్చేఎన్నికల్లో పోటీచేయాలని ఉత్సాహం ఉన్న వారు లెక్కలు తయారుచేయడంలో నిమగ్నమయ్యారు. ఈ విషయంపై డీపీవో రాజన్న వివరణ ఇస్తూ..వారం రోజుల్లో వివరాలు అందించాలని సూచించారు.                                                                                                 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top