వదల బొమ్మాళీ... వదల

వదల బొమ్మాళీ... వదల - Sakshi


సీఐడీ, ఇంటెలిజెన్స్, ఏపీ ట్రాన్స్‌కో, విజిలెన్స్‌ విభాగాల్లో ఫెవికాల్‌ వీరులు

స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంలో హోదా మారినా అక్కడే తిష్ట

డిప్యుటేషన్‌ పేరుతో మాతృసంస్థకు డుమ్మా




కర్నూలు: జిల్లా  పోలీస్‌ కార్యాలయం పరిపాలనా విభాగంలో అధికారుల పనితీరు వివాదాస్పదంగా మారుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. పోలీసు శాఖ నుంచి సీఐడీ ఇంటెలిజెన్స్, ఏపీ ట్రాన్స్‌కో, విజిలెన్స్‌ విభాగాలకు డిప్యుటేషన్‌పై వెళ్లినవారు ఆఫీసర్లయితే రెండేళ్లు, సిబ్బంది అయితే మూడేళ్లకు పైబడి పని చేయకూడదన్న నిబంధన ఉంది. అయితే కొంతమంది పోలీసు సిబ్బంది మాతృ సంస్థకు డుమ్మా కొట్టి ఏళ్ల తరబడి లూప్‌లైన్లలో కొనసాగుతున్నారు.



లాంగ్‌ స్టాండింగ్‌ ఉద్యోగుల జాబితాను డీపీఓ సిబ్బంది బహిర్గతం చేయకుండా ఉండేందుకు ఫెవికాల్‌ వీరుల నుంచి ముడుపులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐ స్థాయి వరకు సిబ్బంది 15 ఏళ్లుగా లూప్‌ లైన్లలోనే కొనసాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. సీఐడీ విభాగంలో ఆరుగురు కానిస్టేబుళ్లు ఏళ్ల తరబడి అక్కడే తిష్ట వేశారు. శాంతిభద్రతల విభాగంలో పనిచేసేటప్పుడు కొందరిపై అనేక ఆరోపణలు రావడంతో డిప్యుటేషన్‌పై సీఐడీ విభాగానికి బదిలీ చేయించుకుని అక్కడే కొనసాగుతున్నారు. అధికారుల నివాస గృహాల నిర్మాణ పనుల్లో సహాయకులుగా పనిచేస్తూ ఆఫీసుకు కూడా ఎగనామం పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. శాంతిభద్రతల విభాగంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన సిబ్బంది లూప్‌లైన్‌ విభాగాలకు వెళ్తే కొంత విశ్రాంతి ఉంటుందన్న ఉద్దేశంతో డిప్యుటేషన్‌ ప్రక్రియను ఏర్పాటు చేశారు. అయితే ఫెవికాల్‌ వీరుల కారణంగా స్టేషన్‌లో పనిచేస్తున్న వారికి అవకాశం రావడం లేదని మదన పడుతున్నారు. జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది నిబంధనలు తుంగలో తొక్కడంతో తమకు అన్యాయం జరుగుతున్నదని స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.



అధికారుల సేవలో..

ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షించాల్సిన బాధ్యత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులపై ఉంది. అక్కడ కూడా ఇద్దరు కానిస్టేబుళ్లు ఏళ్ల తరబడి ఉన్నతాధికారుల సేవల్లో తరిస్తున్నారు. పోలీసు శాఖలో ఆర్డర్లీ వ్యవస్థ రద్దు అయిందని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ కర్నూలు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో మాత్రం కానిస్టేబుళ్లు అధికారుల సేవల్లో మునిగి తేలుతున్నారు. అవినీతి అక్రమాలపై నిఘా వేసి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చూడాల్సిన కొంతమంది అధికారులు కానిస్టేబుళ్లను వ్యక్తిగతంగా మామూళ్ల వసూలుకు వినియోగించుకుంటున్నట్లు సమాచా రం. కల్లూరు ఎస్టేట్‌ పారిశ్రామిక వాడగా అభి



వృ ద్ధి చెందుతున్న నేపథ్యంలో నాపరాళ్లు, ఆయిల్‌ పరిశ్రమలు, మా ర్బుల్‌ పరిశ్రమల నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో ముడుపులు వసూలు చేసే విషయంలో కానిస్టేబుళ్లు కీలకపాత్ర పోషిస్తున్నార న్న ఆరోపణలున్నాయి. కార్యాలయానికి డుమ్మా కొట్టి ఉన్నతాధికారుల సేవల్లో కానిస్టేబుళ్లు తరిస్తున్నట్లు ఆ విభాగంలో చర్చ జరుగుతోంది.



నేతలతో సన్నిహితం.. నివేదికలు తారుమారు

ఇంటెలిజెన్స్‌ విభాగంలో కూడా ఐదుగురు ఏళ్ల తరబడి అక్కడే తిష్ట వేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితులతో పాటు ఫ్యాక్షన్‌ హత్యలు, మత కలహాలు వంటి ముఖ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి ఇటు ఉన్నతాధికారులకు.. అటు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది. అయితే కొంతమంది సిబ్బంది విధులను తూతూమంత్రంగా నిర్వహిస్తూ అధికారుల వ్యక్తిగత పనుల్లో కొనసాగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో అక్రమాలను వెలికితీసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంది. అయితే కొంతమంది అధికార పార్టీ నాయకులతో ఉన్న సన్నిహితంతో తప్పుడు నివేదికలు పంపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మిగనూరులో గృహనిర్మాణాలకు సంబంధించి ఒక అధి కారిపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ముడుపులు దండుకుని తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు ప్రచారం ఉంది.



హోదా మారినా అక్కడే

ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగాలు పోలీసు శాఖకు రెండు కళ్లు లాంటివి. అయితే స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంలో కూడా కొంతమంది ఏళ్ల తరబడి అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. రఘురామయ్య, ఉమాపతి, రాజన్న, కాశయ్య, రంగయ్య, విజయమోహన్‌రెడ్డి తదితరులు ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందినప్పటికీ హెడ్‌ కానిస్టేబుళ్ల విధులు నిర్వహిస్తూ అక్కడే కొనసాగుతున్నారు. హోదా మారినా అక్కడే పోస్టింగ్‌ పొంది విధులు నిర్వహిస్తుండటం వివాదాస్పదంగా మారింది. ఏపీ ట్రాన్స్‌కోలో కూడా ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఒక ఎస్‌ఐ ఐదేళ్లకు పైబడి అక్కడే విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల సేవలో తరలిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.



అంతా గోప్యం:

కొన్నేళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన వారి సీనియారిటీ జాబితాను డీపీఓ సిబ్బంది బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యమేమిటన్న చర్చ జరుగుతోంది. స్టేషన్లలో కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐ వరకు విధులు నిర్వహిస్తున్న వారికి అవకాశమివ్వకుండా ఏళ్ల తరబడి వివిధ లూప్‌లైన్లలో సుమారు 50 మందికి పైగా ఉన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ గోపీనాథ్‌ జట్టీ అయినా దృష్టి సారించి జిల్లా పోలీసు కార్యాలయంలో పరిపాలన గాడిలో పెట్టాలని సిబ్బంది కోరుకుంటున్నారు.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top