చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ మృతి


మృతిపై వ్యక్తమవుతున్న అనుమానాలు  

విజయనగరం క్రైం: విజయనగరం సబ్ జైలుకు చెందిన రిమాండ్ ఖైదీ అనారోగ్యంతో మృతి చెందాడు.  వన్‌టౌన్ పోలీసులు, కుటుంబ సభ్యుల  కథనం ప్రకారం.. తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన ఆలుగుబిల్లి సూర్యనారాయణ (40) సుమారు 20 సంవత్సరాల కిందట పొట్టకూటికోసం  విజయనగరం మండలం వేణుగోపాలపురం గ్రామానికి వలసవచ్చాడు.  అక్కడే భార్య మంగ, కుమార్తె అనసూయ (12)తో కలిసి నివాసం ఉంటున్నారు.



ఈ నెల 18న సూర్యనారాయణ మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు నిందితుడ్ని మరుచటి రోజు కోర్టుకు అప్పగించారు. విచారణ చేపట్టిన జడ్జి సూర్యనారాయణకు రూ. 1000 జరిమాన, ఐదు రోజుల జైలుశిక్ష విధించారు. ఈ మేరకు సూర్యనారాయణను విజయనగరం సబ్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే 20వ తేదీ సాయంత్రం సూర్యనారాయణ వాంతులు చేసుకోవడంతో జైలు అధికారులు అంబులెన్స్‌లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.



వెంటనే భార్య మంగ ఆస్పత్రికి చేరుకుని భర్తకు సపర్యలు చేసి ఆదివారం ఉదయం ఇంటికి వెళ్లింది. అదే రోజు సాయంత్రానికి సూర్యనారాయణ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషయూన్ని జైలు సూపరింటిండెంట్ ఎన్. గణేష్ స్థానిక పోలీసులకు తెలియజేయడంతో  వన్‌టౌన్ సీఐ వీవీ అప్పారావు, ఎస్సై కృష్ణవర్మ, ఏఎస్సై పీఎస్ అప్పలనాయుడు, తదితరులు సోమవారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని మృతదేహానికి  శవపంచానామా చేసి పోర్టుమార్టం నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ రాజేష్  జిల్లా కేంద్రాస్పత్రికి వచ్చి పరిశీలించారు. అరుుతే మృతుడి ముక్కు వద్ద రక్తం కారిన మరకలు ఉండడంతో బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వన్‌టౌన్ సీఐ అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

ఎందుకిలా ...


విజయనగరం క్రైం : జిల్లాలోని సబ్‌జైలుల్లో ఉన్న ఖైదీలు ఎక్కువగా అనారోగ్యంతో మృతి చెందుతున్నారు. శిక్ష పడిన వారు  తప్పు తెలుసుకుని పరివర్తన పొంది బయటకు రావాల్సి ఉండగా మృత్యువుతో నిర్జీవంగా బయటకొస్తున్నారు. జైలు అనగానే మానసికంగా కృంగిపోరుు అనారోగ్యాలకు గురికావడం, ఆత్మహత్యలకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. రెండేళ్లలో విజయనగరం సబ్ జైలులోనే నలుగురు ఖైదీలు మృతి చెందారు. అందులో ముగ్గురు అనారోగ్యం వల్ల కాగా ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. సబ్ జైలులో కేవలం నెల రోజుల పాటే ఖైదీలను ఉంచుతారు. గతంలో కంటే మెరుగైన పౌష్టికాహారం అందిస్తున్నారు. సిబ్బంది పర్యవేక్షణ కూడా బాగానే ఉన్నా ఇటువంటి సంఘటనలు జరుగుతుండడం శోచనీయం.  

 

అందుతున్న సేవలు

* సబ్‌జైలులో ఖైదీలకు వారానికి రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

* ఎటువంటి అనారోగ్యానికి గురైన వెంటనే జిల్లా కేంద్రాస్పత్రికి తరలిస్తారు.

* ప్రతి రోజూ ఉదయాన్నే యోగా చేరుుస్తారు.

* ఉదయాన్నే ఏడు గంటలకు అల్పాహారం

* ప్రతి నెలా  మొదటి ఆదివారం మటన్, మిగతా మూడు ఆదివారాలు చికెన్, ప్రతి మంగళవారం గుడ్డు పెడుతున్నారు.



విషాద సంఘటనలు..

* 2013 జనవరి 12న విజయనగరం సబ్ జైలులో జీవితకాలం శిక్ష పడిన రోజు రాత్రే జె.చంద్రరావు జైలు గదిలో తువ్వాలుతో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

* 2013 ఆగస్టు 3న ఎ.లక్ష్మణరావు  సబ్‌జైలులో అనారోగ్యం పాలవ్వడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్ను మూశాడు.

* 2014 జనవరి 31న చింతల చిన్నారావుకు సబ్ జైలులో గుండెపోటు వచ్చింది. జిల్లా కేంద్రాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.  

* 2016 మే 20న ఎ.సూర్యనారాయణ వాంతులు చేసుకోవడంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 22న మృతి చెందాడు.

 

యోగ క్షేమాలు తెలుసుకుంటున్నాం..

సబ్‌జైలులో ఉండే ఖైదీల యోగ, క్షేమాలను ప్రతిరోజూ తెలుసుకుంటాం. ఆరోగ్య సమస్యలు తలెత్తితే అంబులెన్స్‌లో ఆస్పత్రికి పంపిస్తుంటాం. జైలుకు వచ్చిన ఖైదీలకు ముందుగానే కౌన్సెలింగ్ నిర్వహించి మనోధైర్యం కల్పిస్తున్నాం.   

- ఎన్.గణేష్, విజయనగరం సబ్‌జైలు సూపరింటిండెంట్

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top