లక్ష్యం చేరని దళితబస్తీ

లక్ష్యం చేరని దళితబస్తీ - Sakshi


∙ గుర్తించిన కుటుంబాలు 33,640

∙ లబ్ధిదారులు 617  ∙1657 ఎకరాలు పంపిణీ

∙ నేడు మరో 190 మందికి భూ పట్టాలు




ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లాలో దళితబస్తీ పథకం అమలు నత్తనడకన సాగుతోంది. సాగు భూమి లేని అర్హులైన ఎస్సీ నిరుపేదలకు భూమి పంపిణీ చేసి వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద మూడెకరాల భూమి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 33,640 మంది భూమిలేని దళిత కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు జిల్లాలో 617 మంది లబ్ధిదారులకు 1,657 ఎకరాల భూమి పంపిణీ చేశారు. ఇందుకు రూ.67.18 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. సాగుకు యోగ్యమైన భూములను అధికారులు పరిశీలించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.



నేడు మంత్రి చేతుల మీదుగా పట్టాల పంపిణీ..

జిల్లా వ్యాప్తంగా దళితబస్తీ పథకంలో ఎంపిక చేసిన 190 మంది లబ్ధిదారులకు స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా భూ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఇదివరకు కూలీలుగా ఉన్న నిరుపేద ఎస్సీ లబ్ధిదారులు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో రైతులుగా మారనున్నారు. లబ్ధిదారులకు ప్రభత్వం పెట్టుబడులను సైతం అందజేసి ఆదుకుంటోంది.



ప్రైవేటు భూముల ధరలకు రెక్కలు..

దళితబస్తీ పథకం కింద ఎకరం, అర ఎకరం భూమి ఉన్న దళితులకు మొదటి ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూములు లేకపోవడం, ప్రైవేట్‌ భూములకు రెక్కలు రావడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. అయినప్పటికీ దళితబస్తీ భూ పంపిణీలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. భూములు విక్రయించాలనుకునే రైతులు దరఖాస్తు చేసుకున్న అనంతరం అధికారులు ఆ భూములను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నారు. ఆ భూములు కొనుగోలు చేసిన తర్వాత అర్హులైన లబ్ధిదారులను మూడెకరాల చొప్పున పంపిణీ చేస్తున్నారు.



దళారుల దందా..

దళితబస్తీ పథకంలో వ్యవసాయ భూమిని విక్రయించేందుకు దరఖాస్తు చేసుకున్న రైతుతోపాటు ఎంపికైన ఎస్సీ నిరుపేద లబ్ధిదారులకు మధ్య కొందరు దళారులుగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు  దళారుల అవతారమెత్తి పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అలా చేయని పక్షంలో లబ్ధిదారుల పేర్లను జాబితాలో నుంచి తొలగిస్తామని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక వారి మాటలను విని లబ్ధిదారులు భూమి పట్టా చేతికందక ముందే వారి డిమాండ్లకు తలొగ్గి అప్పు వారి పర్సంటేజీలను అందజేస్తున్నట్లు సమాచారం. ఓ వైపు ప్రభుత్వం నిరుపేదలైన ఎస్సీ లబ్ధిదారులను ఆర్థికంగా ఆదుకునేందుకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంటే, కొందరు దళారులు లబ్ధిదారులతోపాటు భూమి విక్రయిస్తున్న వారి నుంచీ పర్సంటేజీలు తీసుకోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top