నేర పరిశోధనలో జాగిలాల పాత్ర అపూర్వం

నేర పరిశోధనలో జాగిలాల పాత్ర అపూర్వం

ఏలూరు అర్బన్‌ :  నేర పరిశోధనలో పోలీసు జాగిలాల పాత్ర అపూర్వమని ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ అన్నారు. తాజాగా శిక్షణ ముగించుకున్న (స్నిఫర్‌ డాగ్‌) పోలీసు జాగిలం‘ సింబా’ మంగళవారం డాగ్‌ స్క్వాడ్‌లోకి చేరేందుకు నగరానికి వచ్చిన సందర్భంగా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ డాగ్‌ కెన్నెల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనుష్యులతో పోల్చుకుంటే జంతువులలో గ్రాహ్యశక్తి అధికమన్నారు. జాగిలాల సాయంతో గతంలో ఎన్నో కీలక కేసులను పరిష్కరించగలిగామన్నారు. సింబా చేరికతో జిల్లా డాగ్‌స్క్వాడ్‌ మరింత బలోపేతం కానుందన్నారు. సింబా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిలిజెన్స్‌ విభాగం కెనైన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో 8 నెలల పాటు ఎక్స్‌ప్లోజివ్‌ డిటెక‌్షన్‌లో శిక్షణ పొంది ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగిన పాసింగ్‌ పెరేడ్‌ అనంతరం ఏలూరు స్క్వాడ్‌లో చేరిందని తెలిపారు.

డాగ్‌ కెన్నెల్‌లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం

డాగ్‌ కెన్నెల్‌ను ఎస్పీ సందర్శించిన సందర్భంలో ఏఆర్‌ డీఎస్పీ ఎన్‌.చంద్రశేఖర్‌ కెన్నెల్‌లో ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. నూతనంగా చేరిన సింబాతో కలుపుకుని ప్రస్తుతం కేంద్రంలో 6 స్నిఫర్‌ డాగ్‌లు ఉన్నాయన్నారు. అయితే కేంద్రంలో నాలుగు కెన్నెల్స్‌ మాత్రమే ఉండడం ఇబ్బందిగా ఉందన్నారు. వేసవి కాలం వేడి కారణంగా డాగ్స్‌ ఇబ్బందిపడుతున్నాయని విన్నవించారు. స్పందించిన ఎస్పీ ఆరు కూలర్‌లు, ఒక ఫ్రిజ్‌ మంజూరు చేశారు. మరో నాలుగు కెన్నెల్స్‌ నిర్మించేందుకు ఎస్టిమేషన్‌ తయారు చేసి పంపితే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు, ట్రైనీ ఎస్పీ ఆరిఫ్‌ అఫీజ్, ఓఎస్‌డీ బి.రామకృష్ణ, డాగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జి ఎస్సై జి.జీవనరావు, హ్యాండ్లర్‌ సీహెచ్‌ మహేంద్ర పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top