హోదాపై వైఖరి ప్రకటించకుంటే బాబు ద్రోహే


-  పదేళ్ల హోదా వాగ్దానం ఏమైంది

- చంద్రబాబు పై నిప్పులు చెరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు



విజయవాడ బ్యూరో :


కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిందని, ఇంత జరిగినా బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న చంద్రబాబు తన వైఖరి ప్రకటించకుంటే రాష్ట్ర ప్రజల దృష్టిలో ద్రోహిగానే మిగిలిపోతాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ధ్వజమెత్తారు. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వాస్తవాలను ప్రజలకు చెప్పి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం పచ్చి అవకాశవాదమే అవుతుందన్నారు.


 


కార్మికులు, ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేయడం, వామపక్షాల గొంతు నొక్కడం మినహా రెండేళ్లలో రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీలేదని ధ్వజమెత్తారు.






పార్లమెంటు సాక్షిగా విభజన సమయంలో ఏపీకి హోదాతోపాటు వెనుకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజీలు, పోలవరం, లోటు బడ్జెట్ భర్తీ వంటి అనేక హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. తమను గెలిపిస్తే విభజన హామీలు అమలు చేస్తామని, ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాగ్దానాలు చేసి ఇప్పుడు హోదా పై మాట మార్చారని అన్నారు.






 అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం వేసి రాష్ట్రానికి విభజన హామీలు సాధించేలా చొరవ తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర ప్రజల దృష్టిలో చంద్రబాబు నమ్మక ద్రోహిగానే ముద్రవేసుకుంటారని దుయ్యబట్టారు. మీడియా సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకుడు వి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top