సర్కారుకు మొట్టికాయ

సర్కారుకు మొట్టికాయ


► స్కావెంజర్ల కాలనీ ఖాళీ చేయించవద్దని  కోర్టు ఆదేశాలు

►  కార్పొరేషన్‌ అధికారుల చర్యలపై ఆగ్రహం

►  సుమోటోగా స్పందించడం ఇదే తొలిసారి

► తీర్పుతో బాధిత స్కావెంజర్లకు ఊరట




తిరుపతి తుడా: తిరుపతి స్కావెంజర్స్‌ కాలనీని తొలగించి బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాలనుకున్న ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా కోర్టు స్పందనతో స్కావెంజర్లకు ఉపశమనం లభించింది. 90 శాతం ఎస్సీ, ఎస్టీలు వుండే కాలనీని ఖాళీ చేయించవద్దని తిరుపతి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెంటివ్‌ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిం ది.  రెండు రోజులుగా తిరుపతి నగర పాలక సంస్థ అ«ధికారులు కాలనీలోని ఇళ్లను ఖాళీ చేయించేందుకు భారీగా పోలీసు బలగాలతో  వచ్చి అలజడి సృష్టించారు. గిరిజన మహిళలు తమ ఇళ్లు ఖాళీ చేయించవద్దని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.


దీనిపై కోర్టు సుమోటోగా స్వీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా సుమోటోగా స్వీకరించి స్పందించడం రాష్ట్రంలోనే తొలిసారి అని తెలిసింది. వారిచేత మాన్యువల్‌గా స్కావెంజర్‌ విధులు నిర్వర్తించడం కూడా నేరమని పేర్కొం ది. స్కావెంజర్ల కోసం ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏకమై కాలనీ వాసులకు అండగా నిలిచారు. రెండు రోజులుగా  తిండి, నిద్రాహారాలు మాని కాలనీ వాసులు రోడ్డెక్కారు. కార్పొరేషన్‌ సిబ్బంది కొన్ని ఇళ్లను తొలగించగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.


గురువారం తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్‌ కోర్టు జడ్జి రాంగోపాల్‌  జారీచేసిన ఉత్తర్వులు కాలనీవాసులకు ఆనందాన్ని పంచాయి. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే అట్రాసిటీ చట్టం కింద కమిషనర్, సంబంధిత ఉద్యోగులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఇళ్లు ఖాళీ చేయించవద్దని, కాలనీవాసులకు అండగా నిలవాలని హెచ్చరికలు జారీ చేసింది. బహుళ అంతస్తుల భవనానికి తెరలేపిన ప్రభుత్వానికి, అధికారులకు కోర్టు తీర్పుతో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top