ఆయనంతే..!

ఆయనంతే..!


ఎక్కడున్నా చుట్టుముట్టుతున్న వివాదాలు

గతంలో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా మారని తీరు

పెన్షనర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు

గుమస్తాల పాస్‌ ఆర్డర్‌ లేకుండానే ఎస్‌టిఓ సంతకాలు


సాక్షి, కడప :

సిద్దవటం సబ్‌ ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న బీఎన్‌ విజయ్‌కుమార్‌ పనితీరుపై తరుచూ విమర్శలు వస్తున్నాయి. కొత్త పెన్షన్ల విషయంలో మామూళ్లు ముట్టజెప్పందే పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చేయి తడిపితే ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కకు నెట్టి ఫైళ్లు చకాచకా సిద్ధం చేస్తారనే పేరుంది. గతంలో ఆయన పనిచేసిన చాలాచోట్ల వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ చర్యలు సైతం ఎదుర్కోవాల్సి వచ్చినా నేటికీ ఆయన తీరు మారలేదని తెలుస్తోంది.



ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తులకు ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తోంది. మంజూరైనవి అకౌంటెంట్‌ జనరల్, ఎల్‌ఎఫ్‌ల నుంచి జిల్లా ఖజానా కార్యాలయాలకు వస్తే వాటిని సంబంధిత సబ్‌ ట్రెజరీలకు పంపుతారు. అక్కడ పేమెంట్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త పెన్షన్‌ దారులు తన వద్దకు వచ్చారంటే ఎస్‌టీఓకు చాలా ఆనందం. తొలుత పలు సాకులతో  వారిని తిప్పుకుంటారని తెలుస్తోంది. తర్వాత బేరసారాలు జరుపుతారని, తాను అడిగింది ముట్టజెబితేగానీ ఫైలు ముందుకు కదలనీయడని విమర్శలు ఉన్నాయి.



బిల్లులపై నేరుగా సంతకాలు

పెన్షనర్ల బిల్లులపై జూనియర్‌ అసిస్టెంట్‌ లేదా సీనియర్‌ అసిస్టెంట్‌ పాస్‌ ఆర్డర్‌ వేయాల్సి ఉంటుంది.  తర్వాతే ఎస్‌టీఓ దానిని పరిశీలించి సక్రమంగా ఉంటే సంతకం చేయాలి. అయితే కొత్త పెన్షన్ల విషయంలో గుమాస్తాలతో సంబంధం లేకుండా ఆయనే సైడ్‌ ఇన్సిల్, సంతకం చేసేస్తున్నారు. అంటే కొత్త పెన్షన్‌దారు నుంచి రాబట్టే మామూళ్లు తనకు మాత్రమే దక్కాలన్న దురాశతో   ఇలా నిబంధనలను కూడా పాటించడం లేదని ఆ శాఖ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. గతంలో బద్వేలు ఇన్‌చార్జి ఎస్‌టీఓగా పనిచేసిన ఓ వ్యక్తి గుమాస్తా పాస్‌ ఆర్డర్‌ లేకుండానే బిల్లులు చేసినందుకు ఉన్నతాధికారులు ఆయనకు రెండు ఇంక్రిమెంట్లు కట్‌ చేశారు. కాగా, సిద్దవటం ఎస్‌టీఓ విషయంలో మాత్రం పై అధికారులు ఎందుకు చూసీచూడనట్లు వ్యవహారిస్తున్నారనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి సక్రమంగా రాకపోవడం, వచ్చినా జిల్లా ఆపీసులో పని పేరుతో మధ్యాహ్నం వరకే ఉండి వెళ్లిపోతుంటారని అంటున్నారు. ఇందువల్ల సబ్‌ ట్రెజరీకి వచ్చే వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు.



వివాదాలకు కేంద్ర బిందువు

ఆయన ఎక్కడ పనిచేసినా వివాదాస్పదమైన వ్యక్తిగానే గుర్తింపు పొందారు. కడప సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబం«ధించిన పెన్షన్, గ్రాట్యూటీ, కమ్యూటేషన్‌ బిల్లుల విషయంలో మామూళ్లు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు  ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై అప్పటి ఎస్పీ వై.నాగిరెడ్డి 2007 డిసెంబరు 8వ తేదీన కలెక్టర్‌  కృష్ణబాబుకు నివేదిక కూడా పంపారు. దీనిపై స్పందించిన కృష్ణబాబు విచారణ నిర్వహించాలంటూ అదేనెల 29వ తేదీన ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా కారుణ్య నియామకం కింద వినోద్‌కుమార్‌ అనే వ్యక్తిని జమ్మలమడుగు సబ్‌ ట్రెజరీలో షరాప్‌గా నియమించిన విషయంలో ఆయన శ్రీముఖం అందుకున్నారు. ఈ సంఘటనలో ఆయన సీనియర్‌ అకౌంటెంట్‌ నుంచి జూనియర్‌ అకౌంటెంట్‌గా రివర్షన్‌ పొంది ముద్దనూరుకు బదిలీ అయ్యారు. ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్, మరికొంతమంది ఉద్యోగులపై అకారణంగా నిందలు మోపుతూ 2008 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన అనంతరం 2014 మార్చి 11వ తేదీ ఆయనకు ఒక ఇంక్రిమెంటు కట్‌ చేశారు. ఇలా పనిచేసిన ప్రతిచోట పలు అభియోగాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన తీరులో నేటికీ మార్పు రాకపోవడం పట్ల ట్రెజరీ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు.



నేను డబ్బులు తీసుకోవడం లేదు... అంతా అవాస్తవం

సిద్దవటం ట్రెజరీలో ఎస్టీఓ విజయ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’ ప్రతినిధి ఫోన్‌లో వివరణ కోరగా, కేవలం ప్రజలకు ఇబ్బందులు లేకుండా వేగంగా పనులు జరగాలన్న ఉద్దేశంతోనే మిగతా కిందిస్థాయి ఉద్యోగులు లేనపుడు తాను బిల్లుల్లో పలుచోట్ల సైడ్‌ ఇన్సిల్, సంతకాలు చేయాల్సి వచ్చిందని తెలియజేశారు. కేవలం కొంతమంది సరిపోని వారు చేస్తున్న వ్యవహారం తప్ప మరేమీ లేదన్నారు. సిబ్బంది సెలవులో ఉన్నప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాను సంతకాలు చేసి పంపించానన్నారు. అందులోనూ సిబ్బంది కొరత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. తాను ఎప్పుడూ విధులకు ఎగ్గొట్టనని,  ఆఫీసులో ఒక్కోసారి ఇంటర్నెట్‌ పనిచేయకపోవడం, కరెంటు లేకపోవడం తదితర సమస్యలతో కడప ఆఫీసుకు వెళ్లి పని చేసుకుని రావాల్సి వస్తుందని, ఈ నెపాన్ని చూసి ఆఫీసుకు ఎగనామం పెడుతున్నానని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. తాను ఎవరినీ డబ్బులు డిమాండ్‌ చేయలేదని, అలాంటి వారు ఎవరైనా ఉంటే తీసుకు రావాలని తెలిపారు. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top