గెలుపుపై ఎవరి లెక్కలు వారివి

గెలుపుపై ఎవరి లెక్కలు వారివి - Sakshi


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీల భవితవ్యం మరికొద్ది సేపట్లో తేలనుంది. అధికార టీఆర్‌ఎస్ తమ అభ్యర్థి విజయంపై పూర్తి భరోసా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు సైతం తమదే గెలుపు అన్న ధీమాతో ఉన్నారు. హోరాహోరీగా సాగిన ప్రచారంలో విపక్ష పార్టీలన్నీ అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శల దాడి చే శాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేక ఓటుతో తామే గెలుస్తామన్న అంచనాలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. మరోవైపు 17 నెలల పాలన లో తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని గులాబీ శిబిరం భావిస్తోంది.



 టీఆర్‌ఎస్ లెక్కలివీ..

 వరంగల్ లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అయిదు చోట్ల, టీడీపీ రెండు చోట్ల విజయం సాధించాయి. పరకాల టీడీపీ ఎమ్మెల్యే గులాబీ శిబిరంలో చేరడంతో అదనంగా తమకో అసెంబ్లీ సెగ్మెంటు కలిసొచ్చిందన్న లెక్కల్లో టీఆర్‌ఎస్ ఉంది. మొత్తం పోలైన ఓట్లలో తమ అభ్యర్థికి, విపక్షాల అభ్యర్థికి ఏయే సెగ్మెంట్లో ఎన్నెన్ని ఓట్లు పోల్ అయి ఉంటాయో టీఆర్‌ఎస్ లెక్కలు గట్టింది. వాటి ఆధారంగా టీఆర్‌ఎస్ తమ అభ్యర్థి మెజారిటీపై ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు.



బీజేపీ నమ్మకం కోల్పోయిందా?

 ప్రభుత్వ పని తీరుకు, 17 నెలల టీఆర్‌ఎస్ పాలనకు రెఫరెండమని ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ-టీడీపీ కూటమి పోలింగ్ తర్వాత పరోక్షంగా తమ ఓటమిని ఒప్పుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాను ఓడిపోయినా, వరంగల్ ప్రజలకు అందుబాటులో ఉంటానని బీజేపీ అభ్యర్థి డాక్టర్ దేవయ్య చేసిన ప్రకటనపై టీడీపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. ఫలితాలు వెలువడక ముందే ఓటమిని అంగీకరించినట్లు అయ్యిందని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడంతో తాము బలపరిచిన బీజేపీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వస్తాయన్న అంచనాలో టీడీపీ ఉంది.



 ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్ ఆశలు

 నామినేషన్ల ఆఖరి రోజు అభ్యర్థిని అనివార్యంగా మార్చుకోవాల్సి వచ్చిన కాంగ్రెస్... తమ అభ్యర్థి విజయంపై విశ్వాసాన్ని ప్రకటిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత తమకు ఓట్లు గుమ్మరిస్తుందన్నది వీరి ఆశ. స్థానికేతర అభ్యర్థి కావడం, ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా స్థానిక నాయకత్వం పెద్దగా స్పందించకపోవడం, ప్రచారం సమయంలోనే స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్‌చార్జి పార్టీ మారడం వంటి అంశాలు కాంగ్రెస్ ప్రతికూలమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top