‘అనంత’ రైతు ఆత్మస్థైర్యం గొప్పది

‘అనంత’ రైతు ఆత్మస్థైర్యం గొప్పది

 – వాణిజ్య పంటల సాగులో జిల్లా ముందడుగు

– ప్రాంతీయ పరిశోధన, విస్తరణ మండలి సమావేశంలో వక్తలు

అనంతపురం సిటీ : వరుస కరువులతో విలవిలలాడుతున్న ‘అనంత’ రైతులు వాణిజ్య పంటల సాగుపై చూపుతున్న మక్కువ సాహసోపేతమైనదని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు కొనియాడారు. మంగళవారం జిల్లా పరిషత్‌ హాలులో డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రాంతీయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. అనంతపురం, కర్నూలు,  చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశానికి తిరుపతి చీనీ, నిమ్మ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటరమణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం (వెంకటరమణ గూడెం, పశ్చిమగోదావరి జిల్లా) విస్తరణ సంచాలకులు డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కే రెడ్డి, అనంతపురం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఖాజామొహిద్దీన్, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్బరాయుడు, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీఏ) శ్రీరామమూర్తి, ఉద్యాన పరిశోధన స్థానం (రేకులకుంట, అనంతపురం జిల్లా) ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ బి. శ్రీనివాసులు, ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, సెరికల్చర్‌ జేడీ అరుణకుమారి హాజరయ్యారు. ఈ సందర్భ౾ంగా వారు మాట్లాడుతూ  వాణిజ్య పంటల సాగులో అనంతపురం జిల్లా ముందడుగు వేస్తోందన్నారు. జిల్లాను కరువు కాటకాలు ఎంత వెంటాడినా రైతుల్లో ఏడాదికేడాది ఆత్మస్థైర్యం పెరుగుతోందన్నారు. సుమారు 30 ఏళ్ల క్రితమే ఈ ప్రాంత రైతులు నాగపూర్, గోవా తదితర ప్రాంతాల నుంచి పలు రకాల విత్తనాలను తీసుకొచ్చి పంటలు సాగు చేశారన్నారు. రైతులకు, శాస్ర్తవేత్తలు/ అధికారులకు  ఇంతటి అనుబంధం లేని రోజుల్లోనే ద్రాక్షను సాగు చేశారని గుర్తు చేశారు. ఒకప్పుడు  జిల్లా జామ తోటలకు ప్రసిద్ధి అని,  ప్రస్తుతం సాగు గణనీయంగా తగ్గడం ఆందోళనకరమని అన్నారు. జిల్లా రైతులు చేస్తున్న ప్రతి ప్రయోగంలోనూ ఎక్కడో ఒక చోట దెబ్బ తింటున్నారన్నారు. అరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి ఏదో ఒక చీడపీడ ఆశించి నష్టం జరుగుతోందన్నారు.  పంటల సాగులో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. వర్షాలు తగ్గినా పంటలు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. శాస్త్రవేత్తలు రైతులతో మమేకమయ్యేందుకు వేదికలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

 

హార్టికల్చర్‌ హబ్‌ చేయడం సులభమే

జిల్లాలో లక్షా 71 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయని, 33 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడులు వస్తున్నాయని వివరించారు. వాతావరణం అనుకూలిస్తే దిగుబడి ఇంకా పెరుగుతుందన్నారు.  కర్భూజా, దానిమ్మ, బొప్పాయి, చీనీ, మామిడిలో మేలురకపు ఉత్పత్తులు వస్తున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా అనంతపురం జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దడం సులువేనన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి కూడా రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన  స్టాళ్లను శాస్త్రవేత్తలు, నగరవాసులు, అధికారులు పరిశీలించారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top