విపక్షాల బంద్ సంపూర్ణ విఫలం

విపక్షాల బంద్ సంపూర్ణ విఫలం


మంత్రులు పోచారం, జూపల్లి ఎద్దేవా

 సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలు శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వలేదని రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని ఎండగట్టారు. రైతుల మద్దతు లేకపోవడంతో విపక్షాల బంద్ సంపూర్ణంగా విఫలమైందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఓ వైపు ప్రశంసలు లభిస్తుండగా, మరోవైపు విపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పోచారం అన్నారు.



రాష్ట్రంలో రూ.15వేల కోట్ల పంట రుణాలకు గాను ఇప్పటికే రూ.8,836 కోట్లు చెల్లించామని, మిగతా మొత్తాన్ని కూడా వడ్డీతో సహా వీలైనంత త్వరగా సర్దుబాటు చేసి బ్యాంకర్లకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.24వేల కోట్ల పంట రుణాలకు గాను కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. ఏపీలో రుణమాఫీపై కాంగ్రెస్, టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.



 ఉనికిని కాపాడుకునేందుకే..: జూపల్లి

 రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో పాలించిన పార్టీలు ప్రాజెక్టులు నిర్మించి వుంటే ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యేదే కాదన్నారు. విపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.

 

వారికి సిద్ధాంతముందా: తలసాని


 సాక్షి, హైదరాబాద్: ‘విపక్షాలన్నీ గంపగుత్తగా చేపట్టిన రాష్ట్ర బంద్ అట్టర్ ప్లాపయ్యింది. సెలవు రోజున ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళనకు పిలుపు ఇచ్చినా వాళ్లకు పెద్దగా ప్రయోజనమేమీ రాలేదు’ అని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పొద్దునలేస్తే ఒకరినొకరు దూషించుకునే పార్టీలన్నీ ఒకటై ఆందోళన చేశాయంటే, ఆ పార్టీలకు ఒక సిద్ధాంతమంటూ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అక్కడక్కడా కొంతమంది ఆందోళనలకు దిగినట్లు తెలిసిందని, కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు బంద్ ఎందుకంటూ ఆందోళనకారులపై తిరగబడ్డారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు ప్రజల నుంచిగానీ, రైతుల నుంచిగానీ ఎటువంటి స్పందనా రాలేదన్నారు.



 రేస్‌కోర్స్‌పై సర్కారు అజమాయిషీ!

 మలక్‌పేట్ రేస్‌కోర్స్‌పై తమ శాఖ అధికారులు దాడి చే సి అక్రమాలను వెలుగులోకి తెచ్చారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్న ఈ కేంద్రం గ్యాంబ్లింగ్ సెంటర్‌గా మారిందన్నారు. రేస్‌కోర్స్ సెంటర్‌ను టేకోవర్ చేసి ప్రభుత్వ అధీనంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నామన్నారు. అలాగే, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని, రేస్‌కోర్స్‌ను వేరొక ప్రాంతానికి తరలించే ఆలోచన కూడా సర్కారుకు ఉందన్నారు. రేస్‌కోర్స్ సెంటర్‌లో జరుగుతున్న అక్రమాలపై ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తామని, మనీల్యాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

 

ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేకనే బంద్

 టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కర్నె, బోడకుంటి

 సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల్లో సుమారు 35 వేల మంది రైతుల ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ రైతులకు అండగా ఉంటామని ప్రకటించడం హాస్యాస్పదమని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, బోడకుంటి వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు. వీరు శనివారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ రైతులపై కపట ప్రేమ నటిస్తూ బంద్‌కు పిలుపునిచ్చాయని కర్నె విమర్శించారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోతే రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపేస్తామంటూ కేంద్ర  మాజీ మంత్రి బలరాం నాయక్ చేసిన వ్యాఖ్యల వెనుక చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్ కుట్ర ఉందని బోడకుంటి ఆరోపించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top