అది హత్యే!

అది హత్యే! - Sakshi


శాంతిభద్రతల విభాగానికి వీరభద్రం కేసు బదలాయింపు  



నెల్లూరు (క్రైమ్‌) : సమాచార హక్కు రక్షణ సమాఖ్య జిల్లా కన్వీనర్‌ పుత్తా వీరభద్రయ్య (46)ది  హత్యేనని రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో ఈ కేసును విచారణ నిమిత్తం  రైల్వే పోలీసులు శాంతిభద్రతల విభాగానికి బదిలీ చేయనున్నట్లు సమాచారం.  నెల్లూరు ఉస్మాన్‌సాబ్‌పేటకు చెందిన పుత్తా వీరభద్రయ్య జనవరి ఆఖరిలో ఆంధ్ర సమాచార హక్కు రక్షణ సమాఖ్య జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి పలుశాఖల్లో అవినీతి, అక్రమాలను బయట పెట్టేందుకు చర్యలు చేపట్టారు. రెడ్‌క్రాస్‌ రక్తనిధితో పాటు క్యాన్సర్‌ ఆస్పత్రుల్లో జరిగిన అవినీతిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. దానిపై కలెక్టర్‌ విచారణ నిర్వహిస్తున్నారు.



ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ తెల్లవారు జామున నెల్లూరు మాగుంట లేఅవుట్‌ సమీపంలోని రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. తొలుత ప్రమాదంగా అందరూ భావించినప్పటికీ మృతుడి గొంతును కోసి ఉండటం, తలకు తీవ్రగాయాలై ఉండటాన్ని గమనించి ఇది హత్యగా అనుమానించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు దుండగులు యత్నించారని అక్కడి పరిస్థితులను బట్టి భావించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించిన వైద్య సిబ్బంది సైతం అది హత్యేనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. భద్రయ్య హత్యపై రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు సైతం స్వయంగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రైల్వేపోలీసులు ఈ కేసును గుంతకల్‌ రైల్వే ఎస్పీ కార్యాలయానికి పంపారు. రైల్వే ఎస్పీ సుబ్బారావు కేసు పరిశీలన అనంతరం నెల్లూరు శాంతిభద్రతల విభాగానికి కేసు బదిలీ చేసే అవకాశం ఉంది. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top