ఆందోళన బాట

ఆందోళన బాట - Sakshi


► జీఎస్టీని వ్యతిరేకిస్తూమూడు రోజుల బంద్‌

► టెక్స్‌టైల్స్, ఫర్నిచర్స్‌ అసోసియేషన్‌ల నిర్ణయం

► లైసెన్సు నమోదుకూ నిరాకరిస్తున్న వ్యాపారులు




కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించిన జీఎస్టీని వస్త్ర, ఫర్నిచర్‌ వ్యాపార వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.అసలు పన్ను పరిధిలోకి రాని టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీలో ఐదు శాతం పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పన్ను విధానంలో ఫర్నిచర్‌పై 14.5 శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. ఇకపై జీఎస్టీలో ఈ పన్ను రేటు 28 శాతానికి పెరగనుంది.



సాక్షి, నిజామాబాద్‌ : ఒకే దేశం.. ఒకే పన్ను.. నినాదంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించిన జీఎస్టీపై కొన్ని వ్యాపార వర్గాలు ఆందోళన బాట పడుతున్నాయి. వచ్చేనెల 1 నుంచి అమలు కానున్న ఈ నూతన పన్ను విధానంతో  కోలుకోలేని విధంగా నష్టపోతామని ఆయా వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు పన్ను పరిధిలోకి రాని టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీలో ఐదు శాతం పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలోని టెక్స్‌టైల్స్‌ వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.


ఇప్పటి వరకు తమ సరుకులపై ఎలాంటి పన్నులు లేవని, ఇప్పుడు కొత్తగా జీఎస్టీలో ఐదు శాతం పన్ను విధిస్తే ఇబ్బందులకు గురవుతామని ఆ వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో సుమారు మూడు వేల వరకు వస్త్ర దుకాణాలున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఈ వస్త్రవ్యాపారంపై ఉపాధి పొందుతున్నారు. ఈ నూతన పన్ను విధానం ఈ వ్యాపార వర్గంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. ప్రస్తుతం గార్మెంట్, ఓజరీ, రెడీమేడ్‌ వస్త్రాలపై ఐదు నుంచి 12 శాతం వరకు వ్యాట్‌ రూపంలో ప్రభుత్వం పన్ను వసూలు చేస్తోంది. కానీ టెక్స్‌టైల్స్‌పై ఎలాంటి పన్నులేదు. కానీ ఇప్పుడు జీఎస్టీలో ఈ టెక్స్‌టైల్స్‌పై ఐదు శాతం చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ వ్యాపార వర్గాలు ఆందోళన బాట పట్టాయి.



మూడు రోజులు బట్టల దుకాణాలు బంద్‌..

టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్త్రవ్యాపారులు 72 గంటల పాటు బంద్‌ పాటించాలని నిర్ణయించారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో బట్టల దుకాణాలను మూసివేసి నిరసన తెలపాలని భావిస్తున్నారు. అఖిల భారత వస్త్ర సమాఖ్య పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్రవ్యాపారి కన్న ‘సాక్షి’తో పేర్కొన్నారు.



బంద్‌కు ఫర్నిచర్స్‌ అసోసియేషన్‌ పిలుపు

నూతన పన్ను విధానం జీఎస్టీ ఫర్నిచర్‌ వ్యాపార రంగంపై కూడా ప్రభావం పడుతోందని ఆ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుత పన్ను విధానంలో ఫర్నిచర్‌పై 14.5 శాతం చొప్పున వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. ఇకపై జీఎస్టీలో ఈ పన్ను రేటు 28 శాతానికి పెరగనుంది. ఈ నిర్ణయంతో ఫర్నిచర్‌ వ్యాపారం ఇబ్బందిగా మారుతుందని ఆ వ్యాపార వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.


జిల్లాలో సుమారు రెండు వందలకుపైగా ఫర్నిచర్‌ దుకాణాలున్నాయి. పెరగనున్న ఈ పన్నుతో వినియోగదారులపై అదనపు భారం పడుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 28 వరకు ఫర్నిచర్‌ దుకాణాలు బంద్‌ పాటిస్తున్నట్లు ఛాంబర్‌ ఆఫ్‌ ఫర్నిచర్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.



రిజిస్ట్రేషన్‌కు..

నూతన పన్ను విధానం అమలులో భాగంగా ప్రభుత్వం జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు ఇప్పటికే శ్రీకారం చుట్టిన విషయం విధితమే. ప్రస్తుతం వ్యాట్, సీఎస్టీ లైసెన్సులున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇకపై జీఎస్టీలోకి మారాల్సి (మైగ్రేషన్‌) ఉంటుంది. అలాగే కొత్త సంస్థలు కూడా జీఎస్టీలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఇప్పటి వరకు ఎలాంటి పన్ను పరిధిలో లేని వస్త్ర వ్యాపారులు ఇప్పుడు జీఎస్టీలో పన్ను పరిధిలోకి వస్తున్నారు. అయితే ఈ వ్యాపారులు ఇప్పటి వరకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top