అంతు చిక్కని ‘అనంత’ టూర్!


రెండు నెలల క్రితం అనంతపురం వెళ్లి వచ్చిన ఇద్దరు ముష్కరులు

ఓ లాడ్జిలో ఐదు రోజుల పాటు అక్కడే మకాం

ద్విచక్రవాహనంపై నాందేడ్ వెళ్లి తుపాకుల కొనుగోలు

హవాలా మార్గం ద్వారా అజ్మీర్‌కు నగదు

రంగంలోకి దిగిన ఏపీ అధికారులు


 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో విధ్వం సానికి కుట్ర పన్నిన ఏయూటీ ముష్కరులు ఏపీకి వెళ్లడం మిస్టరీగా మారింది. ఈ ఉగ్రవాదుల్లో ఇద్దరు అనంతపురం వెళ్లి వచ్చారని తేలినా.. ఎందుకు వెళ్లారన్నది అంతు చిక్కట్లేదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మాడ్యుల్ చీఫ్ ఇబ్రహీం యజ్దానీ ఆదేశాల మేరకు ఇద్దరు ముష్కరులు 2 నెలల క్రితం అనంతపురం వెళ్లి  అక్కడ ఓ లాడ్జిలో 5రోజులు బసచేసి వచ్చారు. ఆన్‌లైన్ ద్వారా తనను సంప్రదించిన షఫీ ఆర్మర్ ఇద్దరు వ్యక్తుల్ని అనంతపురం పంపాలని, తదుపరి విషయం మళ్లీ చెప్తానని స్పష్టం చేసినట్లు ఇబ్రహీం విచారణలో బయటపెట్టాడు. అతడు చెప్పిన ప్రకారం ఇద్దర్నీ పంపానని, ఐదు రోజుల తర్వాత మళ్లీ తనను ఆన్‌లైన్‌లోనే సంప్రదించిన ఆర్మర్ వారిని వెనక్కు పిలవాల్సిందిగా ఆదేశించడంతో అలా చేశానని చెప్పుకొచ్చాడు. అనంతపురంలో దాగి ఉన్న రహస్యం కేవలం ఆర్మర్‌కు మాత్రమే తెలుసని ఎన్‌ఐఏ అధికారులకు చెప్పాడు.



ద్విచక్ర వాహనంపై వెళ్లి..

ఈ ముఠాకు చెందిన ముష్కరులు రెండు కంట్రీమేడ్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, తూటాలను మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి కొనుగోలు చేశారు. ఇందుకు ఫహద్‌తో పాటు మరో ఉగ్రవాది హైదరాబాద్ నుంచి దాదాపు 280 కి.మీ. దూరంలో ఉన్న నాందేడ్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తుపాకులు, తూటాలు తీసుకుని ద్విచక్ర వాహనం పైనే తిరిగి వచ్చారు. మరోవైపు ఇబ్రహీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.15 లక్షల్ని షఫీ ఆర్మర్.. దుబాయ్‌లో ఉన్న యూసుఫ్ లేదా మరో సానుభూతిపరుడి ద్వారా హవాలా మార్గంలో పంపాడని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఈ మాడ్యూల్‌కు చెందిన ఓ ముష్కరుడు గతనెలలో రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్లి వచ్చినట్లు సాంకేతిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అక్కడి హవాలా ఏజెంట్ ద్వారా ఈ నగదు అందినట్లు ఎన్‌ఐఏ అంచనా వేస్తోంది. ముష్కరుల్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత అనంతపురం టూర్‌తో పాటు అజ్మీర్ అంశాలను ఖరారు చేసుకోవడంతో పాటు నాందేడ్‌లో ఆయుధాలు విక్రయించిన వ్యక్తిని గుర్తించడానికి వారికి ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్లాలని అధికారులు నిర్ణయించారు.



పేలుడు పదార్థాలు అందించడానికేనా?

 ఈ ముష్కరుల్ని ఆర్మర్ అనంతపురం పంపిం చింది పేలుడు పదార్థాలు అందించడానికా? అనే అనుమానాన్ని నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో 2007, 2013ల్లో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ముష్కరులకు... పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ కర్ణాటకలోని మంగుళూరు నుంచే అందింది. ఏయూటీ చీఫ్ షఫీ ఆర్మర్‌కు ఐఎం క్యాడర్‌తో సంబంధాలు ఉండ టం, అతడిదీ కర్ణాటకలోని భత్కల్ ప్రాంతం కావడంతో పేలుడు పదార్థాల ‘మార్పిడి’ కోసమే అనంతపురాన్ని ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. అక్కడకు కర్ణాకటకు చెందిన వ్యక్తి ద్వారా ఎక్స్‌ప్లోజివ్స్ పంపాలని భావించి ఉంటాడని, అయితే చివరి నిమిషంలో అది విరమించుకుని ఉంటాడని విశ్లేషిస్తున్నారు.

 

 రంగంలోకి ఏపీ టీమ్స్

 ఏయూటీ మాడ్యుల్ అనంతపురంలో బస చేసిన విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. పూర్వాపరాలు పరిశీలించేందుకు రంగంలోకి దిగాయి. గడిచిన ఏడాది కాలంలో ఉగ్రవాదులు అనంతపురం ప్రాంతాన్ని డెన్‌గా వినియోగించుకున్నట్లు బయటపడటం ఇది రెండోసారి కావడంతో ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో సూర్యాపేట సమీపంలోని జానకీపురంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిమికి చెందిన అస్లం, ఎజాజ్ మరణించారు.


ఇదే మాడ్యుల్‌కు చెందిన అంజద్, మహబూబ్, సాలఖ్, జకీర్‌లను ఒడిశా పోలీసులు రెండు నెలల క్రితం అరెస్టు చేశారు. వీరి విచారణలోనూ అనంతపురం కోణం వెలుగులోకి వచ్చింది. తాము ఆ పట్టణంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసించామని చెప్పారు. ఇప్పుడు ఏయూటీ హైదరాబాద్ మాడ్యూల్ సైతం అనంతపురం వెళ్లి వచ్చినట్లు బయటపడటంతో ఏపీ నిఘా వర్గాలు అప్రతమత్తమయ్యాయ. ముష్కరులకు ఎవరైనా స్థానిక సానుభూతిపరులు ఉన్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top