'ఉగ్ర' అలజడి


హైదరాబాద్‌లో విధ్యంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు ‘అనంత’కు వచ్చి వెళ్లారనే సమాచారంతో జిల్లా ప్రజలు ఉలికిపాటుకు గురవు తున్నారు. ఇద్దరు ఉగ్రవాదులు రెండు నెలల కిందట అనంతపురం వచ్చి ఓ లాడ్జీలో బస చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు తేల్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.


కర్ణాటక సరిహద్దుగా ఉండటం, ఏయూటీ చీఫ్ ఆర్మర్‌ది కర్ణాటకలోని భత్కల్ ప్రాంతం కావడంతో ఇక్కడి నుంచి కూడా కార్యకలాపాలు సాగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి విదేశీయులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఉగ్ర కదలికలు పోలీసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

 

  అనంతపురం : ఉగ్రవాదుల కార్యకలాపాలు ‘అనంత’కు కూడా పాకినట్లు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) విచారణలో తేలడంతో జిల్లాలో అలజడి మొదలైంది. హైదరాబాదులో విధ్వంసానికి కుట్రపన్ని దొరికిపోయిన  ఏయూటీ మాడ్యూల్(ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్) చీఫ్ ఇబ్రహీం యజ్దానీ ఎన్‌ఐఏ విచారణలో పలు అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతని ఆదేశాల మేరకు ఇద్దరు ఉగ్రవాదులు 2 నెలల కిందట ఇక్కడికి వచ్చి ఓ లాడ్జీలో ఐదు రోజులు బస చేశారు.

 

 సిరియాలోని ఏయూటీ చీఫ్ షఫీ ఆర్మర్ సూచన మేరకే వీరిని ఇబ్రహీం అనంతపురానికి పంపారు. ఆర్మర్ ఆన్‌లైన్ ద్వారా ఇబ్రహీంను సంప్రదించాడు. ఇద్దరు వ్యక్తుల్ని అనంతపురం పంపాలని, తదుపరి విషయం మళ్లీ చెబుతానని పేర్కొన్నాడు. ఆ మేరకు ఇద్దర్ని అనంతపురం పంపారు. ఐదురోజుల తర్వాత మళ్లీ ఆన్‌లైన్‌లోనే ఇబ్రహీంను ఆర్మర్ సంప్రదించి వారిని వెనక్కు పిలవాల్సిందిగా ఆదేశించారు. ఇద్దరు ఉగ్రవాదులు అనంతకు ఎందుకొచ్చారనే రహస్యం ఆర్మర్‌కు మాత్రమే తెలుసని ఇబ్రహీం ఎన్‌ఐఏ అధికారులకు చెప్పారు.  

 

 బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు పేలుడు పదార్థాలు!

 పేలుడు పదార్థాల కోసమే ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మర్ అనంతపురానికి పంపించి ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. హైదరాబాద్‌లో 2007, 2013లో పేలుళ్లకు పాల్పడిన  ‘ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాదులకు పేలుడు పదార్థమైన అమ్మోనియం నైట్రేట్ కర్ణాటకలోని మంగళూరు నుంచి అందింది. ఏయూటీ చీఫ్ షఫీ ఆర్మర్‌కు ఐఎం కేడర్‌తో సంబంధాలు ఉండటం, అతనిది భత్కల్ ప్రాంతం కావడంతో  పేలుడు పదార్థాల ‘మార్పిడి’ కోసమే అనంతపురాన్ని ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు.

 

 ‘అనంత’ పోలీసుల కలవరపాటు

 ఏయూటీ మాడ్యుల్ ఉగ్రవాదులు అనంతపురంలో బస చేసిన విషయం తెలిసి ఇటు ఏపీ నిఘా వర్గాలతో పాటు ‘అనంత’ పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాదులు అనంతపురాన్ని ఓ డెన్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఏడాది వ్యవధిలో వారు అనంతకు రావడం రెండోసారి కావడంతో పోలీసు, నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో సూర్యాపేట సమీపంలోని జానకీపురంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిమికి చెందిన అస్లం, ఇజాజ్ మృతి చెందారు.

 

 ఈ క్రమంలో ఏయూటీకి చెందిన అంజద్, మహబూబ్, సాలఖ్, జాకీర్‌లను ఒడిశా పోలీసులు రెండు నెలల క్రితం అరెస్టు చేశారు. వీరి విచారణలోనూ అనంతపురం కోణం వెలుగులోకి వచ్చింది. తాము ఆ నగరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసించామని చెప్పారు. ఇప్పుడు ఏయూటీ హైదరాబాద్ మాడ్యుల్ సైతం అనంతపురం వెళ్లి వచ్చినట్లు బయటపడడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులకు స్థానికంగా ఎవరైనా సానుభూతిపరులు ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నాయి.

 

 

 ఆదమరిస్తే పెను ప్రమాదమే..

 ఉగ్రవాదులు ‘అనంత’కు వచ్చి వెళుతున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలడంతో ‘అనంత’ పోలీసులు ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా పెనుప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తికి నిత్యం విదేశీయులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ప్రమాదమూ లేకుండా పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top