ఉల్లి మంట తగ్గింపుపై మల్లగుల్లాలు


సాక్షి, హైదరాబాద్: అనూహ్యంగా పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెటింగ్ విభాగం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో గ్రేడ్ వన్ కిలో ఉల్లి ధర రూ.40 వరకు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడమే  ధరలు పెరగడానికి ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పట్లో మార్కెట్లోకి కొత్తగా ఉల్లి నిల్వలు వచ్చే అవకాశం లేకపోవడాన్ని వ్యాపారులు అవకాశంగా తీసుకుని నిల్వ చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర రెట్టింపు కావడంతో రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉల్లి ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది.


 


‘మన కూరగాయలు’ పథకంలో భాగంగా మార్కెటింగ్ విభాగం రైతుల నుంచి 9,500 క్వింటాళ్ల ఉల్లిని సేకరించింది. రాజధాని హైదరాబాద్‌లో 36 ఉల్లి విక్రయ కేంద్రాలతో పాటు తొమ్మిది రైతు బజార్ల పరిధిలోనూ తక్కువ ధరలకు ఉల్లిని విక్రయించాలని నిర్ణయించారు. ఫలక్‌నుమా, ఎర్రగడ్డ రైతు బజార్లలో యుద్ధ ప్రాతిపదికన ఉల్లి విక్రయకేంద్రాలు ఏర్పాటు చేశారు. నాణ్యతను బట్టి ఈ విక్రయ కేంద్రాల్లో కిలో ఉల్లి ధర రూ.22 నుంచి రూ.30 వరకు ఉంటుంది. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే కిలో ఉల్లికి కనీసం రూ.10 తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా సబ్సిడీ ధరలపై రెండు కిలోలు మాత్రమే ఇవ్వనున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఉల్లి సేకరించాలని భావించినా, రవాణా చార్జీలు తడిసి మోపడయ్యే అవకాశాలు ఉండడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్టు సమాచారం.

 

 జిల్లాల్లో సేకరణ బాధ్యత జేసీలకు...

 

 

 జిల్లా స్థాయిలో స్థానికంగానే ఉల్లిని సేకరించి లాభ నష్టాల ప్రమేయం లేకుండా విక్రయించే బాధ్యతను జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. అయితే ఇటు తెలంగాణతోపాటు, అటు ఏపీలోనూ ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడంతో స్థానికంగా సేకరించడం కష్టమేనని క్షేత్ర స్థాయి అధికారులు చెప్తున్నారు. ధరలను నియంత్రించేందుకు ఉల్లి మార్కెటింగ్‌లో కీలకమైన మలక్‌పేట మార్కెట్ వ్యాపారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మంత్రి హరీశ్‌రావు కూడా ధరలను వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోటీ విక్రయకేంద్రాలు పూర్తి అవసరాలు తీర్చలేకపోయినా ఉల్లి ధరలను అదుపు చేయడంలో ఉపకరిస్తాయని మార్కెటింగ్ అధికారులు భావిస్తున్నారు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top