రూ.9 కోట్లు ఇస్తేనే..


► చివర్లో వాయిదాపడ్డ టెండర్లు

► అయ్యో... రామ... కృష్ణా


దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు టీడీపీ నేతలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. కమీషన్ల గోల జిల్లాల సరిహద్దులు చెరిపేసి టెండరింగుల్లో మావాట ఎంతో తేల్చండంటూ గిరిగీసి అవినీతి పైత్యానికి మరింత పచ్చ రంగులద్దుతున్నారు. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ నిర్మాణం పనుల్లో 25 శాతం కమిషన్‌ ఇస్తేనే పనులంటూ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పుత్రరత్నం శివరామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్‌పై దౌర్జాన్యానికి దిగిన ఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో మరో ఎమ్మెల్యే ఉదంతం. వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ కూడా కోట్లలో బేరం పెట్టి ఏకంగా ఆడియో టేపుల్లోనే అడ్డంగా దొరికిపోయారు. తాజాగా ఈ జిల్లాలో అధికార పార్టీలో చక్రం తిప్పుతున్న ఓ మంత్రి తమ్ముడు ఏకంగా రూ.9 కోట్లు చేతిలో పడితేనే ప్రపంచబ్యాంకు పనులంటూ హుకుం జారీ చేసి ఓ హోటల్లో పంచాయతీ పెట్టాడు. టెండరింగ్‌ తిప్పాడు. నాయకుల ద్వయం ఒత్తిడికి లొంగకుండా  వచ్చే నెల పదో తేదీకి వాయిదా వేసేశారు. అయినా సరే వదలను బొమ్మాళీ అంటూ వెంటపడుతూనే ఉన్నారు. ఏమిటో ఈ ‘కృష్ణు’ల మాయంటూ జనం విస్తుబోతున్నారు. 

 

సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిధులు ఎక్కడివైనా... ఎవరు ఇచ్చినా మా కప్పం మాకు కట్టాల్సిందే.. అలా కడితేనే పనులు సాఫీగా చేసుకుంటారు... లేదంటే ఒక్క అడుగు పని కూడా చేయలేరు... చిన్న చిన్న కాంట్రాక్టర్లు బడా కాంట్రాక్టర్లతో కలిసి టెండర్లు వేద్దామంటే కుదరదు. మేం చెప్పినట్టే అంతా కూర్చుని లాటరీ ద్వారా ప్యాకేజీలను కేటాయిద్దాం...ప్రపంచ బ్యాంకు నిధులు తేవడంలో మా అన్న ఎంతో కష్టపడ్డారు.. ముందు 10 శాతం కప్పం రూ.9 కోట్లు మా చేతిలో పెట్టండి.. అదంతా అయ్యాకే టెండర్లు వేయండి... మా మాట కాదని ముందుకు వెళ్లి టెండర్లు వేస్తే ఒక్క పని కూడా చేయలేరు.



ఇదీ జిల్లాలో ఒక తెలుగు తమ్ముడు, కీలక మంత్రి సోదరుడు రూ.90 కోట్ల ప్రపంచ బ్యాంక్‌ పనులపై పెత్తనం కోసం చేసిన హంగామా. ఇక ఆ తొమ్మిది కోట్లు చేతిలోకొచ్చేస్తాయని ఆశగా నిరీక్షిస్తున్న సమయంలో అనుకోకుండా ‘డామిట్‌ కథ అడ్డం తిరిగింద’నే రీతిలో శుక్రవారం జరగాల్సిన ఆన్‌లైన్‌ టెండర్లు అక్టోబరు 10వ తేదీకి వాయిదా పడ్డాయి. ఇదీ టూకీగా జిల్లాలో హుదూద్‌ తుఫాన్‌తో దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ఇచ్చిన రూ.92 కోట్ల నిధుల పరిస్థితి. 

 

హుదూద్‌ తుపాన్‌తో దెబ్బతిన్న ప్రాంతాల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రూ.92 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధుల్లో సింహభాగం మూడొంతులు రూ.60 కోట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునికి దక్కాయి. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురానికి రూ.20 కోట్లు, టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ వర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురానికి రూ.12 కోట్లు కేటాయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే పనుల పర్యవేక్షణ బాధ్యత రోడ్లు, భవనాలశాఖది. ఈ పనులకు ఆర్‌అండ్‌బి ఇఎన్‌సీ ఆహ్వానించిన టెండర్లు తుది గడువు శుక్రవారం. టెండర్లు ప్రక్రియను తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న కీలక మంత్రికి వరుసకు సోదరుడైన తమ్ముడి వ్యూహం బెడిసికొట్టింది.

 

పంచాయతీ ఇలా...

తుని–కేఈ చిన్నయ్యపాలెం 24 కిలోమీటర్లు రూ.32 కోట్లు, తుని– కోటనందూరు 18 కిలోమీటర్లు రూ.18 కోట్లు, ఎ కొత్తపల్లి–కోదాడ ఆరు కిలోమీటర్లు రూ.8 కోట్లు, సర్పవరం–ఎఫ్‌కె పాలెం, ఎఫ్‌కె పాలెం–దివిలి రోడ్లు, వంతెనల ఆధునీకరణ పనులు ఇందులో ఉన్నాయి. ఐదు ప్యాకేజీలుగా ఉన్న ఈ పనుల కోసం ఇరుగు, పొరుగు జిల్లాల కాంట్రాక్టర్లు సిద్ధపడ్డారు. ఆ పనులకు టెండర్లు గడువు శుక్రవారం మ«ధ్యాహ్నం. పనులకు టెండర్లు ఆన్‌లైన్‌లో ఆహ్వానించారు. అయినా తెలుగుతమ్ముడు బరితెగించి రాజమహేంద్రవరంలోని హోటల్‌లో సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.92 కోట్లు తీసుకురావడంలో తన సోదరుని కష్టం ఎంతో ఉందని కాంట్రాక్టర్ల ముందుంచారు. కాంట్రాక్ట్‌ కావాలంటే ముందు 10 శాతం కప్పం రూ.9 కోట్లు కట్టాల్సిందేనని అక్కడ పంచాయతీ పెట్టారు.



ఇందుకు తునిలోని మూడు ప్యాకేజీలకు టెండర్లలో 15శాతం అదనంగా కోడ్‌చేసుకునే వెసులుబాటు కూడా తమ్ముడు కల్పించాడు. విశాఖపట్నం నుంచి ఇద్దరు, పశ్చిమగోదావరి నుంచి ఒకరు, రావులపాలెం నుంచి ఇద్దరు కాంట్రాక్టర్లు ఆ భేటీకి వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఒక మంత్రికి వరుసకు సోదరుడైన తెలుగు తమ్ముడు చక్రం తిప్పి లాటరీ వేయించేశారు. 10 శాతం ఇవ్వడం సాధ్యంకాదని, ప్రపంచ బ్యాంకు పనులు నాణ్యతలో రాజీ కుదరదన్న కాంట్రాక్టర్లు ఐదు శాతానికి ఒకే అన్నారు. మెజార్టీ నిధులు తునిలో ఉన్నాయి, 10 శాతం ఇవ్వకుంటే పనులు ఎలా చేస్తారో చూస్తామని తమదైన శైలిలో బెదిరింపులకు కూడా దిగారని తెలిసింది. మాట కాదని టెండర్లు వేసేందుకు సిద్ధమైన పలువురికి ఆ తమ్ముడి అనుచరగణం రెండు రోజులుగా ఫోన్‌లో బెదిరింపులతో దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు.

 

అధికారులకు తెలిసి వాయిదా

సాంకేతికంగా టెండర్ల నిబంధనలు అధిగమించడం కష్టమైన పని అని కొందరు, 10 శాతం కప్పం కట్టాలనే బెదిరింపుల విషయం ఆర్‌అండ్‌బి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో శుక్రవారం మ«ధ్యాహ్నం 3 గంటల సమయంలో టెండర్లు వాయిదా వేస్తున్నట్టు జిల్లాకు సమాచారం వచ్చింది. ఫలితంగా రెండు, మూడు రోజులుగా తమ్ముడు వేసిన పక్కా వ్యూహం కాస్తా బెడిసికొట్టింది. దీంతో అనుకున్నదొకటి అయినదొకటిగా మారి డామిట్‌ కథ అడ్డం తిరగడంతో అక్టోబరు 10 వరకు ఏమి చేస్తారో చూడాలి.   
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top