పదిశాతం పెరిగిన బస్సు చార్జీలు

పదిశాతం పెరిగిన బస్సు చార్జీలు


ప్రయాణికులపై ఏడాదికి రూ.18 కోట్ల భారం


మెదక్:  ప్రభుత్వం ఇటీవల పెంచిన ఆర్టీసీ చార్జీలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్ల లోపు రూ.1లు అదనంగా  వసూలు చేస్తే, ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్, సూపర్ లగ్జరీలు పదిశాతం అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.18కోట్ల అదనపు భారం పడుతుంది. జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, నారాయణఖేడ్, గజ్వేల్, జహీరాబాద్ డిపోల్లో మొత్తం 618 బస్సులు ఉన్నాయి. గతకొంతకాలంగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది.  గత రెండేళ్లుగా కరువు కాటకాలతోపాటు కార్మికులకు పెంచిన వేతన సవరణతో గత ఏడాది జిల్లాలో ఆర్టీసీకి రూ.10కోట్ల నష్టాల్లోకి కూరుకు పోయింది.


రాష్ట్ర వ్యాప్తంగా ఈ నష్టం వందల కోట్లు . కాగా ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలు ఈనెల 27వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఆర్డీనరీ, పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్లలోపు రూ.1చార్జీ పెరగా, ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్, సూపర్ లగ్జరీలకు మాత్రం ఓవరాల్‌గా పదిశాతం అదనపు చార్జీలు పెంచారు. దీంతో జిల్లా ప్రయాణికులపై నెలకు రూ.1.5కోట్లు,  ఏడాదికి రూ.18కోట్లు అదనపు భారం పడుతుంది. గతంలో మెదక్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వెళ్లేందుకు లగ్జరీ బస్సు చార్జీ రూ.561 ఉండగా, ప్రస్తుతం రూ.612లకు పెరిగింది. ఈ లెక్కన ఒకవ్యక్తికి రూ.51లు పెరిగాయి.


అలాగే కాకినాడకు గతంలో రూ.588లుండగా, ప్రస్తుతం రూ.646లకు పెరిగింది. ఈలెక్కన ఒక్కో వ్యక్తిపై రూ.58లను అదనంగా వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌కు కిలో రూ.8పైసలు, డిలక్స్‌కు రూ.9పైసలు, సూపర్‌లగ్జరీ రూ.11పైసలు, ఇంద్రలో రూ.14పైసలు, గరుడలో రూ.16పైసల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈలెక్కన ఓవరాల్‌గా బస్సు చార్జీలు 10 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. పెరిగిన బస్సుచార్జీలతో బస్సు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అన్నీ ధరలు పెరుగుతున్నాయి..

రాష్ట్రంలో నిత్యావసర ధరలతోపాటు డీజిల్, పెట్రోల్, కరెంట్, బస్సుచార్జీలు పెరిగాయి. అసలే కరువుతో కొట్టుమిట్టాడుతుంటే...పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. బస్సుల్లో ప్రయాణం చేయాలంటేనే భయమేస్తోంది.  -సంతోష్, ప్రయాణికుడు,  కరీంనగర్.


మోయలేనిభారం..

పేద, సామాన్య ప్రజలు మోయలేని భారాన్ని ప్రభుత్వం మోపుతోంది. బస్సుచార్జీలు నామమాత్రమేనంటూ 10 శాతం పెంచారు. ఇక కరెంట్ చార్జీలు ఏమేరకు పెరుగుతాయనే ఆందోళన నెలకొంది. ధరల పెరుగులతో పేదప్రజలు మరింత పేదలుగానే మారుతున్నారు.  -దుర్గారెడ్డి, ప్రయాణికుడు, చిట్కుల్

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top