అర్చకులూ.. ప్రభుత్వ ఉద్యోగులే..!

అర్చకులూ.. ప్రభుత్వ ఉద్యోగులే..! - Sakshi


జీఓ విడుదల చేసిన సీఎం కేసీఆర్‌

వారంపాటు చేసిన సమ్మెకు సత్ఫలితం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 614మందికి లబ్ధి




అలంపూర్‌రూరల్‌ : దేవాదాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ›ప్రభుత్వం ద్వారా వేతనాలు చెల్లించాలని గతవారం రోజులుగా చేస్తున్న సమ్మె విజయవంతమైంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ జీఓ 577ను విడుదల చేస్తూ ఆలయాల్లో పనిచేసే ప్రతి అర్చక ఉద్యోగులందరికీ 2015 పీఆర్సీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 646 ఆలయాలు ఉండగా.. 5625 మంది ఉద్యోగులు ఈ శాఖలో పూజారులుగా పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదాయం చేకూరే ఆలయాలు 49 ఉండగా.. ఒక మఠం కూడా రిజిస్టర్‌ కాబడి ఉంది.



ఇందులో 159మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండగా.. కన్సల్టెంట్, ఎన్‌ఎంఆర్, కాంట్రాక్టు ప్రాతిపదికన 460మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా ఈ జీఓ ద్వారా పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడటమేకాక 2015 పీఆర్సీ ప్రకారం వేతనాలు సైతం పెరగనున్నాయి. ఈ పెరిగిన వేతనాలు నవంబర్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుండగా డిసెంబర్‌ 1వ తేదీ నుంచి నగదు రూపంలో వారివారి ఖాతాల్లో జమకానుంది.



ఒకే జీఓలో మూడు వరాలు

దేవాదాయశాఖ పరిధిలో చారిత్రాత్మక ఘట్టంగా ఒకే జీఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మూడు వరాలు ప్రకటించింది. ఇందులో ఉద్యోగులందరినీ పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కాగా ప్రస్తుతమున్న 1805 దూప, దీప నైవేద్యాల కింద ఉన్న ఆలయాలతోపాటు అదనంగా మరొక 3వేల ఆలయాలకు ఈ పథకాన్ని అమలు చేయడం, దేవాదాయశాఖ ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేస్తూ ఉద్యోగుల వేతనాలను ట్రస్టు ద్వారా చెల్లించేలా ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం దేవాదాయశాఖ ఉద్యోగులకు రూ.150కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా చెల్లించనున్నారు.





మరో 300 ఆలయాలకు దూపదీప నైవేద్య పథకం

సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం ఉమ్మడి జిల్లాకు నూతనంగా మరో 300 ఆలయాలు, గ్రామీణ ప్రాంతాలకు దూప, దీప నైవేద్యం పథకం కింద ఎంపిక చేసింది. ఉమ్మడి జిల్లాలో 137ఆలయాలు ఉండగా అదనంగా 300 ఆలయాలు ఉమ్మడి జిల్లాకు కేటాయించడంపై రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆనంద్‌శర్మ హర్షం వ్యక్తం చేశారు.









జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు

ఎంతోకాలంగా ఆలయ అర్చకులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చేస్తున్న పోరాటాలకు ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడంతో దేవాదాయశాఖ పరిధిలోని అర్చకులంతా హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. దీంతో అర్చకులంతా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రభుత్వ యంత్రాంగం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.



ఈ జన్మకు ఇది చాలు..

22ఏళ్లుగా ఈ శాఖలో పనిచేస్తున్నా. రూ.850తో నా వేతనం మొదలైంది. చివరి కాలంలో కూడా ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తింపు పొందలేమోనని మదన పడేవాన్ని. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. ఇక ఈ జన్మకు ఇది చాలు. – శ్రీనివాసులు, జూనియర్‌ అసిస్టెంట్, జోగుళాంబ ఆలయం



అర్చక ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు

ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6వేల మంది అర్చక ఉ ద్యోగ కుటుంబాల్లో వెలుగు లు నిండా యి. దశాబ్ధాల కల సాకారం చేసినందుకు సీఎం కు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. మా ఉద్యమానికి సహకరించిన టీఎన్‌జీఓ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. – జైపాల్‌రెడ్డి, జిల్లా అర్చక ఉద్యోగ సంఘం అధ్యక్షుడు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top