టీచర్ల దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం !

టీచర్ల దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం !


– వెబ్‌ కౌన్సెలింగ్‌ రద్దు

– బదిలీల ప్రక్రియ వాయిదా?  




అనంతపురం ఎడ్యుకేషన్‌ : టీచర్ల దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. బదిలీలకు సంబంధించిన వివిధ పాయింట్ల అంశాల్లో సవరణలు చేసింది. అసంబద్ధంగా మారిన వెబ్‌కౌన్సెలింగ్, ప్రతిభ ఆధారిత పాయింట్లను తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల ఎంత మొత్తుకున్నా వినకుండా బదిలీలకు సంబంధించి మే 31న మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతిభ ఆధారిత, ప్రత్యేక పాయింట్లకు సంబంధించి సవరణలు చేయాలనే విజ్ఞప్తులను తోసిపుచ్చింది. పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా టీచర్లపై కనీస గౌరవం లేకుండా తాను అనుకున్నట్టే మార్గదర్శకాలు ప్రకటించిందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కెరు.



ఇందులో భాగంగా జాక్టో, ఫ్యాప్టో పిలుపు మేరకు ఈనెల 21న అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ లోకం కదంతొక్కాయి. తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించారు. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఆగమేఘాలపై రాత్రే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉపా«ధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. వెబ్‌కౌన్సెలింగ్, ప్రాధాన్యత పాయింట్ల విషయంలో  ప్రభుత్వం వెనక్కు తగ్గింది. వెబ్‌ కౌన్సెలింగ్‌ ఉండదని స్పష్టం చేశారు.



ఆయా జిల్లాల్లోనే మ్యానువల్‌గానే కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఫెర్ఫార్మెన్స్‌ పాయింట్లు 30 తక్కిన పాయింట్లన్నీ 70గా ఉంటాయి. ఎండీఎం పాయింట్లు పాఠశాలలో పని చేస్తున్న అందరి టీచర్లకూ వర్తిస్తాయి. విద్యార్థులు ఎన్‌రోల్‌మెంట్, ట్రాన్సిషన్‌ పాయింట్లను రద్దు చేశారు. పాఠశాలల కేటగిరి–1కు ఒక పాయింటు, 2కు రెండు, 3కు మూడు, 4కు ఐదు పాయింట్లు కేటాయించారు. సీసీఈ మార్కులు పదోతరగతికి వర్తించవు. పదో తరగతి ఫలితాల ఆధారంగా పాయింట్లుంటాయి. యూపీ స్కూళ్లలో పని చేస్తున్న ఎస్టీజీలకు, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న లాంగ్వెజ్‌ పండిట్లకు పాయింట్లు వర్తిస్తాయి. రేషనలైజేషన్‌ ప్రభావం టీచర్లకు మూడు పాయింట్లు కేటాయించారు. వీటన్నిటికీ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు.



బదిలీల ప్రక్రియ వాయిదా?

ఇదిలా ఉండగా ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ బూచీగా చూపుతూ టీచర్ల బదిలీలను వాయిదా వేసేందుకు యోచిస్తోంది. చాలామందికి పదోన్నతులు వస్తాయని ఈ క్రమంలో బదిలీల ప్రక్రియను వాయిదా వేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే బదిలీల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు. జిల్లాలో స్థానిక సైన్స్‌ సెంటర్‌లో జరుగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ శుక్రవారం జరగలేదు. జిల్లా వ్యాప్తంగా హెచ్‌ఎంలు వచ్చినా విద్యాశాఖ  సిబ్బంది వెరిఫికేషన్‌ ప్రక్రియను తాత్కాలింగా నిలిపేసినట్లు చెప్పి వెనక్కు పంపారు. దీన్నిబట్టి చూస్తుంటే జిల్లా విద్యాశాఖ అధికారులకు కౌన్సెలింగ్‌ వాయిదా స్పషం చేసినట్లు అర్థమవుతోంది.



షెడ్యూలు ప్రకారం కౌన్సెలింగ్‌ జరగాల్సిందే : ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం టీచర్ల బదిలీ కౌన్సెలింగ్‌ జరపాల్సిందేనని ఏపీటీఎఫ్‌ (1938) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కులశేఖర్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య డిమాండ్‌ చేశారు. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌కు రాష్ట్రపతి అమోదం తెలపడం శుభపరిణామమని అయితే పదోన్నతులు బూచీ చూపి బదిలీలు వాయిదా వేయడం సరికాదన్నారు. ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పని చేసి బదిలీలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వారు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top