తరగతి గదిలో సె(సొ)ల్లు కబుర్లు

తరగతి గదిలో సె(సొ)ల్లు కబుర్లు


నిబంధనలకు విరుద్ధంగా గురువుల తీరు

ఫోన్లు వాడకంతో బోధనకు ఇబ్బంది

నష్టపోతున్న విద్యార్థులు

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు


ఆదిలాబాద్‌టౌన్‌: తరగతి గదిలో కొంత మంది ఉపాధ్యాయులు సెల్‌ ఫోన్‌లలో సొల్లు కబుర్లతో బోధనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని సెల్‌ ఫోన్‌ కంపెనీలు ప్రత్యేక ఆఫర్‌లు ఇస్తుండడంతో గంటల తరబడి మాట్లాడుతూ.. చెవి నుంచి ఫోన్‌ తీయడం లేదని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటే ఉపాధ్యాయుల పనితీరుతో పాటు విద్యార్థులు శ్రద్ధగా చదవాల్సి ఉంటుంది. టీచర్లు సమయపాలన పాటించడం. సిలబస్‌ పూర్తి చేస్తే మెరుగైన ఫలితాలు సాధించడమేమి కష్టం కాదు. అయితే తరగతి గదిలో పాఠాలు బోధించే సమయంలో ఫోన్‌ మోగడంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల దృష్టి మళ్లుతోంది. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని చాలా మంది ఉపాధ్యాయులు తమ వెంట సెల్‌ఫోన్‌ తీసుకెళ్తున్నారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తరగతి గదిలో సెల్‌ఫోన్లు వాడవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు   ఆదేశాలు జారీ చేసినప్పటికి చాలా మంది ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు.



నియోజక వర్గంలో...

నియోజకవర్గంలో మొత్తం 302 పాఠశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్, మావల మండలంలో  ప్రాథమిక పాఠశాలలు 108, ప్రాథమికోన్నత పాఠశాలలు 22, ఉన్నత పాఠశాలలు 25  ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 18,451 మంది విద్యార్థులు ఉన్నారు. జైనథ్‌ మండలంలో 41 ప్రాథమిక పాఠశాలలు, 9 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 5,488 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బేల మండలంలో 66 ప్రాథమిక పాఠశాలలు, 12 ప్రాథమికోన్నత పాఠశాలలు, 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 5174 మంది చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో వెయ్యికి పైగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 90 శాతం మంది ఉపాధ్యాయులు స్మార్ట్‌ ఫోన్‌లు వాడుతున్నారు. కాగా ఇందులో దాదాపు అందరూ ఇంటర్‌నెట్‌ సేవలు వినియోగిస్తున్నారు.  నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు.



ఇంటర్‌నెట్‌ సేవలు వినియోగం...

ఇటీవల కాలంలో ఆధునిక సెల్‌ఫోన్ల ధరల తగ్గడంతో ప్రతి ఒక్కరూ వాటినే వాడుతున్నారు. నెట్‌వర్క్‌ కంపెనీలు తమ ఇంటర్‌నెట్‌ సేవలను తగ్గించడం, కొన్ని ఉచితంగా ఇవ్వడంతో మరింత ఫోన్ల వినియోగం పెరిగింది. వీటికి తోడు వాట్సాప్‌లు, ఫేస్‌బుక్, వాయిస్‌ కాల్స్, వీడియో కాల్స్‌ తదితర యాప్‌లు అందుబాటులోకి రావడంతో హద్దు అదుపు లేకుండా పోయింది. పాఠశాలల్లో కాస్త సమయం దొరికితే సెల్‌ఫోన్లలో నిమగ్నమయ్యే ఉపాధ్యాయులు చాలా మంది  ఉన్నారు.



సెల్‌ఫోన్‌ వినియోగిస్తే చర్యలు

తరగతి గదిలో పాఠాలు చెప్పకుండా సెల్‌ఫోన్‌లో మాట్లాడితే చర్యలు తప్పవు. ఈ విషయమై ప్రధానోధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ఫోన్‌ స్విచ్‌ఆప్‌ చేసి ప్రధానోపాధ్యాయునికి అందజేయాలి. ఈ విషయంలో హెచ్‌ఎంలు కఠినంగా వ్యవహరించాలి. – కె.లింగయ్య, డీఈవో, ఆదిలాబాద్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top