ముట్టడి.. కట్టడి

ముట్టడి.. కట్టడి - Sakshi


ఉపాధ్యాయుల ఆందోళన ఉద్రిక్తం

సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దసంఖ్యలో కలెక్టరేట్‌ ముట్టడి

ఉపాధ్యాయులు, పోలీసుల మధ్య తోపులాట

పోలీసుల చర్యను నిరసిస్తూ రాస్తారోకోకు యత్నం

బలవంతంగా అరెస్టుచేసి స్టేషన్‌కు  తరలింపు

ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట నిరసన

అరెస్టు చేసిన వారిని విడుదల చేయడంతో ఆందోళన విరమణ




ఒంగోలు టౌన్‌:

సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాక్టో, జాక్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బుధవారం నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి  ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ వద్దకు తరలిరావడంతో ఒకవైపు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి వారి వద్దకు వచ్చి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పి వెళ్లిన తరువాత ఉద్రిక్తతకు దారితీసింది. అప్పటికే ఔట్‌ గేటు వద్ద పోలీసులు గేట్లు వేయడంతో ఉపాధ్యాయులంతా వాటిని తోసుకొని కలెక్టరేట్‌లోని డీఈఓ కార్యాలయానికి వెళ్లాలని ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, పోలీసులకు కొద్దిసేపు తోపులాట జరిగింద



పోలీసుల చర్యను నిరసిస్తూ ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ ముందు రాస్తారోకో చేపట్టాలని నిర్ణయించారు. రాస్తారోకో కారణంగా ప్రజలు ఇబ్బంది పడతారని పోలీసు అధికారులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. వందలాది మంది ఉపాధ్యాయులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసు జీపుల్లో కనిపించిన వారిని కనిపించినట్లు ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించారు. పోలీసు జీపులు లేకపోవడంతో అదే సమయంలో అటుగా వచ్చిన ఆటోలను ఆపి అందులో ఉపాధ్యాయులను ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించారు. పోలీసుల చర్యలను మరోమారు నిరసిస్తూ స్థానిక చర్చి సెంటర్‌లో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు.


అనంతరం ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు ప్రదర్శనగా వెళ్లారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు చేరుకోవడంతో వారిని లోపలికి వెళ్లనీయకుండా గేట్లు వేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న పోలీసు అధికారులు, ఉపాధ్యాయుల మధ్య మరోమారు వాగ్వివాదం జరిగి ంది. వారి వాదనలు తారస్థాయికి చేరుకోవడంతో అక్కడకు చేరుకున్న టూటౌన్‌ సీఐ దేవప్రభాకర్‌ సర్దిచెప్పి వారిని శాంతింపచేశారు. అరెస్టు చేసిన వారిపై ఎలాంటి కేసులు కట్టకుండా విడుదల చేయడంతో ఉపాధ్యాయులు ఆందోళన విరమించారు. అంతకు ముందుగా ఉపాధ్యాయులను ఉద్దేశించి వివిధ సంఘాల నాయకులు మాట్లాడారు.



పాత పద్దతిలో కౌన్సిలింగ్‌ నిర్వహించకుంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతాం – పర్రె వెంకట్రావు

బదిలీలకు సంబంధించి ఏ ప్రభుత్వ శాఖకు లేని ప్రతిభా పాయింట్లను ఉపాధ్యాయులపై ప్రభుత్వం బలవంతంగా రుద్ది వారిని మానసికంగా వేధిస్తోందని ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ పర్రె వెంకట్రావు ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే 12 డిమాండ్లు తీసుకువెళితే వాటిని పరిష్కరించకపోవడంతో 30కి చేరుకున్నాయన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి ఒక్క సమస్యను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తోందని మండిపడ్డారు.



వెబ్‌ కౌన్సెలింగ్‌ను ఉపాధ్యాయులు కోరుకుంటున్నారంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. వెబ్‌ కౌన్సిలింగ్‌ను ఉపాధ్యాయులు కోరుకుంటే వందలాది మంది ఎందుకు రోడ్డెక్కుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యను పక్కనపెట్టి ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లను బలోపేతం చేసేందుకు పూనుకుంటుందని విమర్శించారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పాత పద్ధతిలో నిర్వహించకుంటే ఈనెల 23వ తేదీ సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని, అప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.



ఉపాధ్యాయులు కొట్టుకునే పరిస్థితి సృష్టిస్తోంది – సీహెచ్‌ మంజుల

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రతిభా పాయింట్లు ప్రవేశపెట్టడం వల్ల ఉపాధ్యాయులు కొట్టుకునే పరిస్థితిని ప్రభుత్వం సృష్టిస్తోందని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్‌ మంజుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిభా పాయింట్లు, వెబ్‌ కౌన్సెలింగ్‌ వల్ల కలిగే పరిణామాల గురించి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. ఒంటెత్తు పోకడలను ప్రదర్శిస్తోందన్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగా వేలాది మంది ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రతిభా పాయింట్లు ఒకరికి వస్తే, ఇంకొకరికి రావని, చివరకు పాఠశాలల మధ్య, ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. వెబ్‌ కౌన్సిలింగ్‌ వల్ల అన్యాయం జరుగుతోందన్నారు. రేషనలైజేషన్‌ పేరుతో అనేక పాఠశాలలను మూసివేసి పేద విద్యార్థులకు విద్య అందకుండా చేశారని, విద్యాసంవత్సరం ప్రారంభించిన తరువాత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  



 కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు కే శ్రీనివాసులు, పీ రమణారెడ్డి, ఏపీటీఎఫ్‌ నాయకులు గురునాథశర్మ, బీ రఘుబాబు, ఏపీటీఎఫ్‌ నాయకులు పీవీ సుమ్బారావు, కేవీజే కీర్తి, బీ అశోక్‌కుమార్, ఎస్‌టీయూ నాయకులు సీహెచ్‌ శ్రీనివాసులు, కే యర్రయ్య, పీఈటీఏ నాయకులు ఎన్‌ జయసింహారెడ్డి, కృష్ణ, ఆర్‌యూపీపీ నాయకులు రమేష్, బీ వెంకటేశ్వర్లు, హెచ్‌ఎంఏ నాయకులు సీహెచ్‌ గోపి, వై వెంకట్రావు, బీటీఏ నాయకులు ఓ శ్రీనివాసులు, సీహెచ్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌సీ ఎస్‌టీ నాయకులు జయకుమార్, పీఆర్‌టీయూ నాయకులు పీ శ్రీనివాసరావు, రాంభూపాల్‌రెడ్డి, ఏపీయూఎస్‌ నాయకులు సీహెచ్‌ లక్ష్మినారాయణ, కే మల్లిఖార్జునరావు, బీఈడీ నాయకులు సీహెచ్‌ సుబ్బారావు, రమణకుమార్, సాయి, బీటీఏ నాయకులు ఎం శరత్‌చంద్ర తదితరులు నాయకత్వం వహించారు. వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ నాయకుడు జీ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top