విఠపు హ్యాట్రిక్‌

విఠపు హ్యాట్రిక్‌ - Sakshi


టీచర్ల ఎంఎల్‌సీగా పీడీఎఫ్‌ అభ్యర్థి గెలుపు  మండలిలో మూడోసారి విజయం

 వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు   

ఉపాధ్యాయ ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు

కొనసాగుతున్న పట్టభద్రుల ఓట్ల లెక్కింపు 

అర్ధరాత్రి దాటినా తేలని ఫలితం




తూర్పు రాయలసీమ శాసన మండలి ఉపాధ్యాయ బరిలో అధికార టీడీపీకి మళ్లీ భంగపాటు ఎదురైంది. చిత్తూరు.. నెల్లూరు..ప్రకాశం జిల్లాల నియోజకవర్గంలో వరుస పరాజయాలను మూటగట్టుకుంది. శాసన మండలి పునరుద్ధరణ (2007)తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ  విజయం నమోదు చేసుకోలేకపోయింది. తాజాగా ఈనెల 9న టీచర్ల నియోజకవర్గానికి పోలింగ్‌ జరిగిన నేపథ్యంలో చిత్తూరులో సోమవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థి ..సిట్టింగ్‌ ఎంఎల్‌సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆధిక్యత చాటుకున్నారు. మూడోసారి గెలిచి మండలిలో హ్యాట్రిక్‌ సాధించారు. ఈయన సమీప టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడిని స్పష్టమైన మెజారిటీతో ఓడించారు. పీడీఎఫ్‌ అభ్యర్థులిద్దరికీ  వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించింది. మరోపక్క పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్‌ పక్షాన యండవల్లి శ్రీనివాసులు రెడ్డి బరిలో నిలిచారు. సోమవారం అర్ధరాత్రి దాటినా ఫలితం వెలువడలేదు. ఓట్లను కట్టలు కట్టేందుకే సాయంత్రం వరకూ సమయం పట్టింది. ఈ ఫలితం మంగళవారం వెలువడే అవకాశముందని భావిస్తున్నారు.   



చిత్తూరు, సాక్షి: రాయలసీమ తూర్పు విభాగం (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) నియోజకవర్గ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా పీడీఎఫ్‌ (ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌) అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం ఘనవిజయం సా«ధించారు. తమ సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి అయిన వాసుదేవనాయుడిపై 3553 ఓట్ల మెజారిటీతో  ఆయన గెలుపొందారు. ఇది ఆయనకు  హ్యాట్రిక్‌ విజయం కావడం గమనార్హం. విఠపుకు యూటీఎఫ్, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాలతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా మద్దతు పలకడంతో విజయం సునాయాసమైంది. ఉపాధ్యాయ సంఘాల్లో, వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు వెల్లివిరిశాయి. అయితే గెలుపు ఖాయమనుకున్న తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో ఘోర పరాజయం ఎదురుకావడంతో టీడీపీ శ్రేణులు భంగపాటుకు గురయ్యాయి. ఈ గెలుపు ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.



ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 17,652 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెల్లని ఓట్లు 535 కాగా.. మిగిలిన  17,015 ఓట్లను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత కింద 50 శాతానికి పైబడి ఒక ఓటుతో మెజారిటీ సాధించాలంటే 8,508 కోటా ఓట్లు ఒకే అభ్యర్థికి రావాల్సి ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత రౌండ్‌లో విఠపు బాలసుబ్రమణ్యానికి 7,812 ఓట్లు రాగా, ఆనందనాయుడికి 526, టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడుకు 4,522, మాదాల వెంకటకృష్ణయ్య 3,428, రమణయ్య 281, చదలవాడ సుచరిత 251, ఎ.సుబ్రమణ్యం 185, వెంకట సుధాకర్‌రెడ్డి 33, మిట్టారామిరెడ్డి 27 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆధిక్యత సాధించిన విఠపు బాలసుబ్రమణ్యానికి కోటా ఓట్ల కంటే 696 ఓట్లు తగ్గాయి.



దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ప్రక్రియలో విఠపు బాలసుబ్రమణ్యానికి 1,627, వాసుదేవనాయుడుకు 1,364 ఓట్లు వచ్చాయి. ఈ రెండో ప్రాధాన్యత లెక్కింపులో చివరి స్థానంలో ఉన్న ఆరుగురు అభ్యర్థులు ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో విఠపు బాలసుబ్రమణ్యంకు మొత్తం 9,439 ఓట్లు రాగా వాసుదేవనాయుడుకు 5,886 ఓట్లు వచ్చాయి. దీంతో విఠపు 3,553 ఓట్లతో గెలుపొందారు.





ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం

టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తా. నాపై నమ్మకముంచి గెలిపించిన ఉపాధ్యాయులకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు కృతజ్ఞతలు. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో గెలుపొందడం ఆనందంగా ఉంది. ధన రాజకీయాలు చేస్తున్న టీడీపీకి ఇది చెంపపెట్టు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న నిరంకుశ విధానాలకు ఇకనైనా స్వస్తి పలకాలి.           

–విఠపు బాలసుబ్రహ్మణ్యం

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top