టీచర్‌ గైర్హాజరిపై ఎమ్మెల్యే ఆగ్రహం

విద్యార్థులను ప్రశ్నిస్తున్న పుష్పశ్రీవాణి

ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేస్తానని వెల్లడి

 

జియ్యమ్మవలస : ఏజెన్సీలోని గిరిజన విద్యాప్రమాణాలు మెరుగుపడకపోవడానికి ఉపాధ్యాయుల ఉదాసీనతే కారణమని కురుపాం శాసనసభ్యురాలు పాముల పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీకే జమ్ము ప్రాథమిక పాఠశాలను ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11 గంటలకే పాఠశాల మూసి ఉండటం, విద్యార్థులు బయట ఆడటం చూసి ఉపాధ్యాయులు లేరా అని అడిగారు. మాస్టారు కురుపాం వెళ్లిపోయారని పిల్లలు సమాధానం ఇవ్వగా టీచరు లేని చదువులు ఏం చదువులని, ప్రభుత్వం వేలకు వేలు జీతాలు ఇస్తుంటే పిల్లలను గాలికి వదిలేయడం తగదని వ్యాఖ్యానించారు.

 

ఇలాంటి ఉపాధ్యాయుల పనితీరు మారాలని లేకుంటే ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కొందరు టీచర్లు గైర్హాజరవుతున్నారనీ, ఐటీడీఏ పీవో వారిపై దష్టిసారించాలని కోరారు. దీనిపై  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పువ్వల లక్ష్మణరావును ప్రశ్నించగా స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం ఆదినారాయణకు హాఫ్‌డే లీవ్‌ అని తెలిపాననీ, లిఖిత పూర్వకంగా ఇవ్వలేదని తెలిపారు. స్కూల్‌కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ మాత్రం లిఖితపూర్వకంగానే సెలవు చీటీ ఇచ్చారనీ, పొంతనలేని సమాధానం చెప్పడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top