ఫిరాయింపులపై టీడీపీ నాడు-నేడు

ఫిరాయింపులపై టీడీపీ నాడు-నేడు - Sakshi


నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా

ఫిరాయింపులకు ఎన్టీఆర్ బద్ధ వ్యతిరేకం

ఫిరాయింపులే చంద్రబాబు సిద్ధాంతం

నాడు రాజీనామాల తర్వాతనే పార్టీలోకి ప్రవేశం

నేడు ఫిరాయింపుదార్లకు సాదర స్వాగతం


 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు, ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు నక్కకూ నాకలోకానికీ ఉన్నంత స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఎన్టీఆర్ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించగా చంద్రబాబు పార్టీ ఫిరాయింపులే ఊపిరిగా, ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. అవినీతి అక్రమాలతో అడ్డగోలుగా సంపాదించిన లక్షల కోట్ల సొమ్మును ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు విరజిమ్ముతూ ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నారు.



1985 జనవరిలో లోక్‌సభలో పార్టీ ఫిరాయిపుల నిరోధం బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో ఎన్టీఆర్ ఆ బిల్లును పూర్తిగా సమర్ధించారు. ప్రతిపక్ష పార్టీలు సవరణ కోరడం కూడా సరికాదని, యథాతథంగా బిల్లు ఆమోదం పొందాలనేది తన వ్యక్తిగత ఆకాంక్షని అప్పట్లో  హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యక్తం చేశారు. రాజకీయాలు స్వచ్ఛంగా ఉండాలని, ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలన్నది తమ పార్టీ అభిమతమన్నారు. ఈ బిల్లు ఎంతో అవసరమని, ఇప్పటికే ఈ చట్టం చేయడంలో ఎంతో జాప్యం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఒక రాజకీయ పార్టీ నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తించిన సభ్యుడిని ఆ పార్టీ సభ్యత్వం నుంచి తొలగిస్తే అతని లోక్‌సభ, శాసనసభ సభ్యత్వం కూడా రద్దు చేయాలనే ప్రతిపాదనను ఆ బిల్లులో ఒక క్లాజుగా చేర్చారు. అయితే ఇది రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యానికి హానికరంగా పరిణమిస్తుందని, ఈ క్లాజును మార్చాలని కొన్ని ప్రతిపక్షాలు అప్పట్లో కోరాయి. కానీ ప్రతిపాదిత బిల్లుకు సవరణలు కూడా అనవసరమని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎన్టీఆర్ విస్పష్టంగా చెప్పారు.



సభ్యునిపై క్రమశిక్షణ చర్య తీసుకునేందుకు పార్టీ నాయకత్వానికి పూర్తి హక్కు ఉందని, అలా ఉండాలనేది తన అభిప్రాయమని కూడా స్పష్టంచేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన సభ్యున్ని పార్టీ నుంచి తొలగిస్తే ఆ పార్టీ గుర్తుతో గెలిచిన సభ్యుని సభ్యత్వం కూడా రద్దు కావాలన్నారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచి, ఆ పార్టీ నుంచి ఫిరాయించిన వారు శాసనసభ్యులుగానో, పార్లమెంటు సభ్యులుగానో కొనసాగడం ప్రజాస్వామ్యానికే అవమానమని కుండబద్దలు కొట్టారు. సభల వెలుపల కూడా సభ్యుల ప్రవర్తనను పరిగణలోకి తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆనాటి స్ఫూర్తికి భిన్నంగా ప్రస్తుత తెలుగుదేశం వ్యవహరిస్తుండటం గమనార్హం.



నాడు నాదెండ్ల, అశోక్ గజపతిరాజు, నల్లపురెడ్డి తదితరులు రాజీనామా చేశాకే...

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానంతరం 1982 మే 29న తిరుపతిలో రెండో మహానాడు జరిగింది. పార్టీలో  చేరాలనుకున్నవారు ఎవరైనా అప్పటివరకు ఉన్న ఏ స్థాయి పదవులనైనా వదులుకోవాలని, అలాగైతేనే సభ్యత్వం ఇవ్వాలనే తీర్మానం జరిగింది. ఎమ్మెల్యేలుగా ఉన్న గద్దె రత్తయ్య, ఆదెయ్య, నారాయణ ఈ తీర్మానాన్ని అంగీకరించలేమంటూ బాయ్‌కాట్ చేశారు.  దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్న వారిని ఎన్టీ రామారావు పార్టీ నుంచి తక్షణం బహిష్కరించారు. నాదెండ్ల భాస్కరరావు, నల్లపురెడ్డి శ్రీని వాసులురెడ్డి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీలో కొనసాగారు.



1978లో విజయనగరం నుంచి జనతా పార్టీ తరఫున గెలుపొందిన పూసపాటి అశోక్ గజపతిరాజు అదే ఏడాది సెప్టెంబరులో ఎన్టీ రామారావును కలిసి పార్టీలో చేరేందుకు అనుమతించాలని కోరగా రాజీనామా చేసిన తరువాత సంప్రదించాలని సూచించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అశోక్ గజపతిరాజు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారని టీడీపీ పార్టీ సీనియర్ నేతలు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం ఎవరిని పార్టీలో చేర్చుకుంటున్నారో, ఏ కారణంగా తీసుకుంటున్నారో తమకు కూడా తెలియడంలేదని సంబంధిత నియోజకవర్గ టీడీపీ  ముఖ్య నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో విలువలకు పట్టం కట్టగా ఇప్పుడు విలువల వలువలు వదిలేసినట్లుగా ఉందని టీడీపీ వ్యవస్థాపకుల్లోని నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top