సారథుల అస్త్రసన్యాసం!

సారథుల అస్త్రసన్యాసం! - Sakshi


♦ పార్టీ అధ్యక్షుల ఫిరాయింపులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి

♦ ‘గుంటి’ నుంచి మొదలై ప్రకాష్ వరకు జంపు జిలానీలే

♦ జిల్లాలో పార్టీకి మిగిలింది ఇద్దరే శాసనసభ్యులు




సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీకి వాస్తుదోషం పట్టుకున్నట్టుంది. కార్యాలయాలను మార్చినా కాలం కలిసిరావడంలేదు. వరుస పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లా సారథులంతా మధ్యలోనే అస్త్రసన్యాసం చేస్తుండడం పచ్చపార్టీని కలవరపరుస్తోంది. గులాబీ దూకుడుకు పార్టీ అధ్యక్షులే గోడ దూకుతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన జిల్లాలో ఆ పార్టీ ప్రస్తుతం నామమాత్రంగా మిగిలిపోయింది.



2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బలంగా వీచిన టీఆర్‌ఎస్ పవనాలకు ఎదురొడ్డి ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో విజయం సాధించింది. సరిగ్గా అదే ఏడాదిన్నర తర్వాత ఆ పార్టీ ఉనికి కోసం పడరాని పాట్లు పడుతోంది. ప్రస్తుతం ఆర్.కృష్ణయ్య (ఎల్‌బీనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) మాత్రమే పార్టీలో మిగిలారు. వీరిలో గాంధీ కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుండగా. కృష్ణయ్య మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.


 ‘గుంటి’తో మొదలు..

జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన గుంటి జంగయ్య టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించగా, ఆ తర్వాత పగ్గాలు చే పట్టిన పట్నం మహేందర్‌రెడ్డి కూడా సాధారణ ఎన్నికలముందు గూలాబీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అనంతరం సార థ్య బాధ్యతలు స్వీకరించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గ్రహబలం బాగాలేదని పార్టీ కార్యాలయాన్ని కాస్తా ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు మార్చారు. అక్కడకు మార్చినా పార్టీ రాత మారలేదు. ఆయన కూడా అనూహ్యంగా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.


 దీంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పార్టీ అధ్యక్షుడిగా వచ్చారు. పార్టీ కార్యాలయానికి తాళం వేసిన ఆయన కార్యకలాపాలన్నీ సొంత నియోజకవర్గం నుంచే నడిపారు. ఆయన కూడా ఎక్కువ కాలం పార్టీలో ఇమడలేకపోయారు. గ్రేటర్ ఫలితాలతో నీరుగారిన ప్రకాశ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అధికారపార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో మరోసారి కొత్త సారథి వేటను టీడీపీ అధిష్టానం కొనసాగిస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top