నేత... మేత


అధికార పార్టీ ఎమ్మెల్యేకు అవినీతి మరక!

రూ.5 లక్షలు తీసుకున్నా ఉద్యోగం తిరిగి ఇప్పించలేదని ఆరోపణ

అధికార పార్టీ వర్గపోరులో తొలగింపు

ఫిర్యాదు చేసేందుకు పార్టీ కార్యాలయం వద్దకు వెళితే అడ్డుకున్న నేతలు

అనంతరం డిప్యూటీ సీఎంను కలిసి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేపై ఫిర్యాదు

ఆరా తీసిన అధిష్టానం?

 

కర్నూలు: అధికార పార్టీకి చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డికి అవినీతి మరక అంటుకుంది. ఉద్యోగం తిరిగి ఇప్పిస్తానంటూ తన నుంచి రూ.5 లక్షలు వసూలు చేసి.. ఇప్పటి వరకు న్యాయం చేయలేదని గతంలో ఏపీఓగా పనిచేసిన సీతమ్మ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కలిసి ఫిర్యాదు చేశారు.

 

అధికార పార్టీ నేతల వర్గపోరులో తనను ఉద్యోగం నుంచి ఎమ్మెల్యే తీసేయించారని.. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటే రూ.5 లక్షలు అడిగారన్నారు. అయితే, తీరా రూ.5లక్షలు ఇచ్చినప్పటికీ ఉద్యోగం మాత్రం తిరిగి ఇప్పించలేదని వాపోయారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనను వేడుకుంది.

 

మరోవైపు అంతకుముందు ఈ విషయంలో హైడ్రామా నడిచింది. టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ సీఎంను కలిసి విన్నవించేందుకు ఆమె ప్రయత్నించగా అక్కడి నుంచి ఆమెను అధికార పార్టీ నేతలు నెట్టేశారు. అనంతరం గెస్ట్‌హౌస్ వద్ద డిప్యూటీ సీఎంను కలిసి ఆమె తన గోడు వినిపించింది. మొత్తంగా ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే....  నందవరం మండలంలో ఉపాధి హామీ పథకం ఏపీఓగా సీతమ్మ పని చేస్తోంది.

 

అయితే, అధికార పార్టీకే చెందిన జెడ్పీ వైస్-చైర్‌పర్సన్ పుష్పావతమ్మకు అనుకూలంగా పనిచేస్తున్నారనే భావనతో అవినీతి ఆరోపణలు సాకుగా చూపి తనను ఎమ్మెల్యే డిసెంబర్ 31, 2014న సస్పెండ్ చేశారని బాధితురాలు చెబుతోంది. అనంతరం ఆగస్టు 18, 2015లో ఏకంగా తనను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేశారని వాపోయింది.


అయితే, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటే ఎమ్మెల్యేకు రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పీఏ సురేష్‌తో పాటు ఎంపీపీ నరసింహారెడ్డి తనను అడిగారని ఆమె ‘సాక్షి’కి వివరించింది. మొదట ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రూ. 2 లక్షలు ఇచ్చానని.. మిగిలిన రూ. 3లక్షలు ఎమ్మిగనూరులో ఇచ్చానని తెలిపారు. అయితే, డబ్బులు తీసుకున్నప్పటికీ ఉద్యోగం తిరిగి ఇప్పించలేదని.. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు.

 

 

ఎమ్మెల్యేనే ఉద్యోగం నుంచి తొలగించారు

నందవరంలో గతంలో ఏపీఓగా పనిచేస్తున్న సీతమ్మను ఉద్యోగం నుంచి ఎమ్మెల్యేనే సస్పెండ్ చేయించిన మాట వాస్తవం. కేవలం నాతో అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలతోనే ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే, ఉపాధి పనులు రైతులందరికీ జరిగాయి. ఇదే విషయాన్ని రైతులు కూడా చెప్పారు. అయితే ఆడిట్ వాళ్లపై కూడా ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి.. అవినీతి జరిగిందని రాయించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇప్పించకపోవడం దారుణం.

 - పుష్పావతమ్మ,

 నందవరం జెడ్పీటీసీ సభ్యురాలు

 

 వర్గ పోరుతో ఉద్యోగం ఊడింది

 వాస్తవానికి అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరుతోనే ఈ మొత్తం వ్యవహారంలో సదరు ఉద్యోగి ఉద్యోగం ఊడిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అటు బాధితురాలితో పాటు ఇటు అధికార పార్టీ నేత జెడ్పీ వైస్-చైర్‌పర్సన్ పుష్పావతమ్మ కూడా చెబుతుండటం గమనార్హం.


నందవరం జెడ్పీటీసీ సభ్యురాలు పుష్పావతమ్మకు, ఎమ్మెల్యేకు మధ్య ఉన్న వర్గపోరులో ఏపీఓ బలిపశువు అయినట్లు తెలుస్తోంది. కేవలం తన పనులు మాత్రమే చేస్తున్నారనే ఆరోపణలతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని పుష్పావతమ్మ కూడా చెబుతున్నారు. మొత్తంగా అధికార పార్టీలోని వర్గపోరులో కొద్దిరోజుల క్రితం ఏకంగా నంద్యాలలో మునిసిపల్ ఉద్యోగిపై దాడి జరగగా... తాజాగా ఉద్యోగం ఊడిన వ్యవహారం బయటపడటం చర్చనీయాంశమవుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top