బరితెగింపు

బరితెగింపు - Sakshi

  • మేయర్‌ అండతో రెచ్చిపోయిన టీడీపీ సభ్యులు

  • వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ పుణ్యశీలపై అనుచిత వ్యాఖ్యలు

  • తప్పుచేయకున్నా క్షమాపణ చెప్పాలని మేయర్‌ హుకుం

  • నిరాకరించిన పుణ్యశీలపై సస్పెన్షన్‌ వేటు

  • సభను బహిష్కరించిన వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు

  • గందరగోళంగా విజయవాడ కౌన్సిల్‌ సమావేశం

  • విజయవాడ సెంట్రల్‌ : నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం రసాభాసగా మారింది. మేయర్‌ కోనేరు శ్రీధర్‌ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం శనివారం జరిగింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మేయర్‌ సభలో ప్రవేశపెట్టారు. ఎలాంటి భారాలూ మోపకుండా సంక్షేమానికి పెద్దపీట వేశామని ప్రసంగపాఠం వినిపించారు. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం చేశామని కమిషనర్‌ జి.వీరపాండియన్‌  పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ బి.ఎన్‌.పుణ్యశీల మాట్లాడుతూ 1981 నుంచి ఇప్పటి వరకు ఇంత అధ్వానమైన రీతిలో ఏ మేయరూ బడ్జెట్‌ రూపొం దించలేదని విమర్శించారు.



    స్టాండింగ్‌ కమిటీలో ఒకసారి ఆమోదించిన బడ్జెట్‌ను తప్పుల పేరుతో మరోమారు ఆమోదించడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై స్పందించిన మేయర్‌ ‘నువ్వు కొత్త కాబట్టి చరిత్ర తెలియదు. గతంలో కౌన్సిల్‌ను ఆపేసి బడ్జెట్‌ తప్పుల్ని సరిదిద్దిన సందర్భాలు ఉన్నాయి. స్టాం డింగ్‌ కమిటీలో ఎన్నిసార్లయినా ఆమోదించుకుంటాం. కౌన్సిల్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మీద మాత్రమే మాట్లాడాలి’ అం టూ బదులిచ్చారు. బడ్జెట్‌ పుస్తకంలో 9, 10, 121, 122పేజీలు రెండుసార్లు అచ్చు వేశారని, దీనివల్ల బడ్జెట్‌ స్వరూపమే మారిపోతుందని, సుమారు రూ.67 లక్షల తేడావస్తోందని పుణ్యశీల సభ దృష్టికి తెచ్చారు. టీడీపీ సభ్యుడు జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ ప్రతిపక్షం కొండను తవ్వి ఎలుకను పట్టిందని, రెండుసార్లు పొరపాటున అచ్చేస్తే తప్పేంటన్నారు.



    రెచ్చిపోయారు..

    బడ్జెట్‌ తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారు? అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు? అంటూ మేయర్‌ను పుణ్యశీల నిలదీశారు. వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్‌ పి.సుభాషిణి జోక్యం చేసుకొని ‘మాట్లాడింది చాల్లే కూర్చోవమ్మా’ అంటూ పుణ్యశీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. టీడీపీ సభ్యులు నజీర్‌ హుస్సేన్, జాస్తి సాంబ శివరావు, చెన్నుపాటి గాంధీ, గుర్రం కనకదుర్గ, కంచర్ల శేషారాణి, కోఆప్షన్‌ సభ్యురాలు చెన్నుపాటి ఉషారాణి మూకుమ్మడిగా పుణ్యశీలపై మాటల యుద్ధానికి తెగబడ్డారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దు అంటూ సుభాషిణిని పుణ్యశీల దూషించారంటూ  నిందమోపి క్షమాపణ చెప్పాలని గలాటా సృష్టించారు. తాను తప్పుగా మాట్లాడలేదని పుణ్యశీల స్పష్టం చేశారు. రికార్డులను పరిశీలించాల్సిందిగా టీడీపీ సభ్యుడు ఎదుపాటి రామయ్య డిమాండ్‌ చేశారు.  రికార్డుల్లో తాను తప్పుగామాట్లాడినట్లు ఉంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమేనని పుణ్యశీల సవాల్‌ విసిరారు.



    నువ్వు అన్నావ్‌. నేను విన్నా..

    సభ్యుల మాటలు రికార్డు కాలేదని అధికారుల ద్వారా తెలుసుకున్న మేయర్‌ శ్రీధర్‌ నాలిక్కరుచుకున్నారు. ‘పిచ్చిపిచ్చివేషాలు వేయొద్దంటూ నువ్వు అన్నావ్‌. నేను విన్నా. మర్యాదగా క్షమాపణ చెప్పు. లేదంటే సస్పెండ్‌ చేస్తా’ అంటూ గద్దిం చారు. పుణశీలకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ సభ్యులు అవుతు శ్రీశైలజ, జమలపూర్ణమ్మ, ఆసిఫ్, బుల్లావిజయ్, బొప్పన భవకుమార్, దామోదర్‌ నిలిచారు. టీడీపీ, వైఎస్సార్‌ సీపీ సభ్యుల విమర్శలతో సభ దద్దరిల్లింది. మేయర్‌పై విమర్శలు చేస్తావా? అంటూ టీడీపీ కౌన్సి లర్‌ కంచర్ల శేషారాణి వేలు చూపుతూ పుణ్యశీలవైపు దూసుకొచ్చారు. టీడీపీ సభ్యులను కట్టడి చేయని మేయర్‌ పుణ్యశీలను సస్పెండ్‌ చేశారు. దీంతో వైఎస్సార్‌ సీపీ సభ్యులు 11 మంది వాకౌట్‌ చేశారు. ప్రతి పక్షంతో అగౌరవంగా ప్రవర్తించడం తగదని సీపీఎం ఫ్లోర్‌లీడర్‌ గాదె ఆదిలక్ష్మి హితవుపలకగా, బడ్జెట్‌పైనే మాట్లాడు, వేరే విషయాలొద్దంటూ మేయర్‌ ఆమెకు వార్నింగ్‌ ఇచ్చారు.  



    రాక్షసపాలన సాగిస్తున్నారు

    టీడీపీపై పుణ్యశీల ధ్వజం

    టీడీపీ పాలకులు కౌన్సిల్‌లో రాక్షస పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ బి.ఎన్‌.పుణ్యశీల ధ్వజమెత్తారు. సస్పెన్షన్‌ అనంతరం పార్టీ కార్పొరేటర్లతో కల్సి ఆమె కౌన్సిల్‌ బయట బైఠాయించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ నైతిక విలువ లేకుండా పార్టీ మారిన సుభాషిణిని అడ్డం పెట్టుకొని మేయర్‌ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.  ఇది ముమ్మాటికీ భారాల బడ్జెట్టే అని స్పష్టం చేశారు. తాను తప్పుగా మాట్లాడానని నిందమోపిన టీడీపీ సభ్యులు రికార్డుల్ని ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. మేయర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.



    కంచర్ల శేషారాణి తనను అగౌరపర్చేలా మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జాతీయ మహిళా పార్లమెంట్‌ నిర్వహించామని గొప్పలు చెప్పుకొనే టీడీపీ ప్రజాప్రతినిధులు పార్టీలోని మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు. వైఎస్సార్‌ సీపీ తూర్పు నియోజకవర్గ  కన్వీనర్, కార్పొరేటర్‌ బొప్పన భవకుమార్‌ మాట్లాడుతూ మేయర్‌ వైఖరి సిగ్గుచేటన్నారు. ఏకపక్షంగా సభ నిర్వహించడం తగదన్నారు. వైఎస్సార్‌ సీపీ పశ్చిమ నియోజకవర్గ కన్వీన్‌ షేక్‌ ఆసిఫ్, కార్పొరేటర్లు అవుతు శ్రీ శైలజ, జమలపూర్ణమ్మ, పాలఝాన్సీలక్ష్మి, షేక్‌ బీజాన్‌బీ, బి.సంధ్యారాణి, కరీమున్నీసా, బుల్లా విజయ్, కె.దామోదర్, ఎం.శివ

    శంకర్‌ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top