స్కెచ్చేస్తున్నారు..

స్కెచ్చేస్తున్నారు.. - Sakshi


► నాడు జెడ్పీ స్థలం.. నేడు ఎన్‌ఎస్‌పీ వంతు

► రూ.25 కోట్ల స్థలానికి టెండర్‌

► 1.92 ఎకరాల స్థలంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు యత్నం

► స్థలం ఇవ్వాలంటూ ఎన్‌ఎస్‌పీఉన్నతాధికారులపై ఒత్తిడి

► 99 ఏళ్ల లీజు పేరుతో స్థలం కబ్జాకు రంగం సిద్ధం

► ఇరిగేషన్‌ మంత్రి, లోకేష్‌లకు వినతి

► పావులు కదుపుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు

► ఎన్‌ఎస్‌పి కార్యాలయానికి సరైన భవనం లేని వైనం

► అయినా పట్టించుకోని అధికారులు




టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం పేరుతో విలువైన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు చెందిన స్థలాన్ని సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసింది. 99 సంవత్సరాల లీజు పేరుతో పాతిక కోట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక వైపు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి సరైన సొంత కార్యాలయం కూడా లేదు. కానీ వారి స్థలాన్ని అధికార పార్టీ సొంతం చేసుకునేందుకు సిద్ధమవ్వడంపై స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.





సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరం నడిబొడ్డున నెల్లూరు–కర్నూలు హైవే పక్కన సర్వే నెం.88లో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పి) 1.92 ఎకరాలు స్థలం ఉంది. ఈ స్థలానికి తూర్పు వైపున ఇరిగేషన్‌ ప్రాజెక్టు సీఈ కార్యాలయం, పడమర వైపున నాగార్జున యూనివర్సిటీ, దక్షిణం వైపున కర్నూలు–నెల్లూరు హైవే ఉంది.ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం ఈ స్థలం విలువ రూ.25 కోట్లకుపైమాటే. ఖాళీగా ఉన్న స్థలంపై జిల్లా అధికార పార్టీ నేత కన్నుపడింది. టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం పేరుతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యా రు.99 సంవత్సరాల లీజు కింద తొలుత స్థలాన్ని సొంత ం చేసుకునేందుకు ప్రతిపాదించారు.ఒక ఎకరం స్థలానికి నెలకు రూ.1,000 చొప్పున 1.92 ఎకరాల స్థలానికి నెలకు రూ.1800 లీజు కింద చెల్లించే పద్ధతిలో ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ఎన్‌ఎస్‌పి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వాలంటూ ఇప్పటికే ఇరిగేషన్‌ ఎస్‌ఈ, సీఈలపై అధికార పార్టీ నేత ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. మీరిక్కడే పని చేయాలంటే... మీ స్థలాన్ని పార్టీ కార్యాలయానికి ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నట్లు ప్రచారం ఉంది.


అప్పగింతకు పావులు కదుపుతున్న అధికారులు..

ఎన్‌ఎస్‌పి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించేలా అనుమతులు మంజూరు చేయాలంటూ అధికార పార్టీ జిల్లా నేత తొలుత ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమకు విన్నవించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని చినబాబు లోకేష్‌ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయానికి స్థలమివ్వాలన్న నిబంధనలను అడ్డుపెట్టుకొని క్యాబినెట్‌ తీర్మానం ద్వారా ఎన్‌ఎస్‌పి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి అప్పగించేందుకు అధికార పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఒంగోలులో ఎన్‌ఎస్‌పికి సరైన సొంత భవనం కూడా లేదు. ఉన్న భవనాలు చిన్నపాటి వర్షం కురిసిన జలమయమవుతున్నాయి. అధికారులు వర్షాకాలంలో వాటిలో కూర్చొని పని చేసే పరిస్థితి కూడా లేదు. కార్యాలయం ఎదురుగానే ఉన్న రెండెకరాల స్థలంలో సొంత భవనాలు నిర్మించుకోవాలన్న ప్రతిపాదన కూడా ఎన్‌ఎస్‌పి సిద్ధం చేసుకుంది. అయితే విలువైన స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయం పేరుతో సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ సిద్ధం కావడంపై ఎన్‌ఎస్‌పి కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతల కొమ్ముకాస్తూ స్థలాన్ని అప్పగించేందుకు సిద్ధమయ్యారని అదే శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులు విమర్శలు గుప్పించటం గమనార్హం.



సొంత పార్టీలోనే వ్యతిరేకత..

నగరంలో విలువైన స్థలాలు ఒక వైపు కబ్జాకు గురవుతుంటే.. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి మాత్రం మొన్న జడ్పీ స్థలం.. నేడు ఎన్‌ఎస్‌పి స్థలం అంటూ ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావడంపై అధికార టీడీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయానికి చెందిన విలువైన స్థలాలు కాకుండా కొందరు అధికార పార్టీ నేతలు కబ్జా చేసిన విలువైన కార్పొరేషన్‌ స్థలాల్లో పార్టీ కార్యాలయం నిర్మించాలంటూ మరికొందరు నేతలు విమర్శలు గుప్పిస్తుండటం గమనార్హం.



తిప్పికొట్టిన జడ్పీ చైర్మన్‌..

తొలుత నగరంలోని సౌత్‌ బైపాస్‌ రోడ్డులో సర్వే నెం.66/1బి, 67/1లో ఉన్న రూ.50 కోట్ల విలువైన 1.60 ఎకరాల జడ్పీ స్థలంలో జిల్లా టీడీపీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్ధమయ్యారు. ఈ మేరకు జడ్పీ తీర్మానం చేయాలంటూ చైర్మన్‌ ఈదర హరిబాబుతో పాటు సభ్యులపైనా ఒత్తిడి తెచ్చారు. సంతకాల సేకరణకు దిగి బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉంచిన స్థలాన్ని పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారంటూ గొడవకు దిగారు. దీంతో వెనక్కితగ్గిన దామచర్ల ప్రతిపాదనను ఎట్టకేలకు విరమించుకున్నారు. అయితే తాజాగా ఎన్‌ఎస్‌పి స్థలాన్ని పార్టీ కార్యాలయంకంటూ దామచర్ల కొత్త ప్రతిపాదన తెరపైకి తేవడంపై స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top