'దీక్ష విరమణ ముద్రగడ వ్యక్తిగత విషయం'

'దీక్ష విరమణ ముద్రగడ వ్యక్తిగత విషయం' - Sakshi


కిర్లంపూడి : దీక్ష విరమణ అనేది కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వ్యక్తిగత విషయమని టీడీపీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బోండా ఉమా, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు స్పష్టం చేశారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసంలో జరిగిన చర్చల అనంతరం టీడీపీ నేతలు విలేకర్లతో మాట్లాడుతూ.... ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముద్రగడ తమను కోరారని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన రిజర్వేషన్లు నెరవేర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయనకు స్పష్టం చేసినట్లు వారు పేర్కొన్నారు.




కాపు రిజర్వేషన్ల సమస్య వేగంగా పరిష్కారం అవుతుందని... అందుకు సహకరించాలని ముద్రగడకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ప్రభుత్వ దూతలుగా తాము ఇక్కడికి రాలేదని వారు తెలిపారు. కేవలం ముద్రగడ పద్మనాభంతో ఉన్న పరిచయంతోనే ఆయనతో భేటీ అయినట్లు చెప్పారు.  అయితే ఇది వ్యక్తిగత ఉద్యమం కాదని.... ప్రజాఉద్యమమని ముద్రగడ స్పష్టం చేశారన్నారు.  ప్రశాంతమైన తూ గో .జిల్లాలో ముద్రగడ ఏర్పాటు చేసిన గర్జన ఎన్ని మలుపులు తిరిగిందో అందరం చూశామని.... ఈ ఘటనలపై ముద్రగడ్డ కూడా తన ఆవేదన వ్యక్తం చేశారన్నారు. మేనిఫెస్టోలో హామీలు అమలు చేస్తు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే రిజర్వేషన్ అంశం సున్నితమైనదని... ఈ అంశం మరింత జఠిలమైయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.



ఇతర జిల్లాలకు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు సహకరించాలని పద్మనాభాన్ని కోరాం. తాను ఏమీ కొత్తగా కోరడం లేదన్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లండని తమని ముద్రగడ కోరారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఆయన చెప్పిన విషయం ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ముద్రగడ తెలిపారని టీడీపీ నేతలు చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top