చెప్పులతో కొట్టుకున్న ‘తమ్ముళ్లు’

చెప్పులతో కొట్టుకున్న ‘తమ్ముళ్లు’ - Sakshi


 అనంతపురం జిల్లా : కూడేరులోని బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన వేరుశనగ విత్తన పంపిణీ కేంద్రం వద్ద శుక్రవారం తెలుగు తమ్ముళ్లు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు బోర్ల సత్యనారాయణ, కొర్రకోడు కుంటెన్నలు చెప్పులతో కొట్టుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. స్థానికులు అందించిన వివరాల మేరకు నాగిరెడ్డిపల్లికి చెందిన  బోర్లు సత్యనారాయణ విత్తన ఏజెన్సీ నిర్వహణలో  సభ్యునిగా ఉన్నాడు.

 

 అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ  ఎంపీటీసీ భర్త ఎర్రిస్వామి విత్తన వేరుశనగ కాయలు ఇవ్వాలని సత్యనారాయణను కోరారు. సత్యనారాయణ ససేమిరా అన్నప్పటికి  మిగిలిన సభ్యుల అంగీకారం మేరకు పర్మిట్లు లేకనే మూడు బస్తాలు నేరుగా డబ్బులు చెల్లించి పొందాడు. ఈ సమయంలో సత్తిలాంటి వాళ్ళు ఉంటే  టీడీపీకి ఓట్లు పడవు అనడం ఆ విషయం సత్తికి తెలిసింది. అందులో భాగంగానే శుక్రవారం సత్యనారాయణ పంపిణీ కేంద్రం వద్ద ఉండగా ఎర్రిస్వామి మిత్రుడు కొర్రకోడూరుకు చెందిన కుంటెన్న వచ్చి గొడవ పడి చొక్కా పట్టుకున్నాడు.

 

  దీంతో సత్యనారాయణ చెప్పు తీసుకొని కొట్టాడు. కుంటెన్న కుమారుడు సత్యనారాయణపై చేయి చేసుకొని చెప్పుతో కొట్టాడు. అక్కడ ఉన్న రైతులు, పోలీసులు వారిని అక్కడ నుంచి పక్కకు పంపించారు. వారిరువురు ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. పర్మిట్లు లేకనే ఏజెన్సీ నిర్వాహకులు ఎలా విత్తన కాయలు పంపిణీ చేశారని రైతులు చర్చించుకుంటున్నారు. ఇలాగైతే అధికార పార్టీ నాయకులు సబ్సిడీ విత్తన కాయలను పక్కదారి పట్టించే అవకాశం ఉందని రైతుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top