పెరుగుతున్న గ్యాప్‌!

పెరుగుతున్న గ్యాప్‌!


జిల్లా తెలుగుదేశం పార్టీలో మళ్లీ సమీకరణాలు మారుతున్నాయా? రాష్ట్ర స్థాయిలో కీలక పదవులున్న మహిళా నేతల మధ్య అంతరం పెరుగుతోందా? ఇటీవలి సంఘటనలు ఈ సందేహాలను కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జన్మభూమి గ్రామసభలకు అందరూ హాజరు కావాల్సిందే! మరి ఎస్‌.కోట నియోజకవర్గంలో మాత్రం అలా జరగడం లేదు. ఇటీవల జరుగుతున్న కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతున్న తీరు చూస్తే వీరి మధ్య సయోధ్య చెడుతున్నట్టుందని వ్యాఖ్యానాలు జోరందుకుంటున్నాయి.



సాక్షి ప్రతినిధి, విజయనగరం:  శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇటీవల కొంత కాలంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభ హైమావతిలను దూరం పెడుతున్నారని బహిరంగంగానే గుసగుసలు వినపడుతున్నాయి. భవిష్యత్తు ఆలోచనతో ముందున్న ఎన్నికలకు పోటీ అవుతారేమోనన్న భయంతోనే అప్రమత్తత ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు జన్మభూమి గ్రామసభల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభ స్వాతిరాణికి ఆహ్వానం లేకపోవడం విశేషం. జిల్లా ప్రథమ మహిళ అయిన ఆమెకే ఆహ్వానం లేకుండా విస్మరించడం చిన్న విషయం కాదు. దీనిపై ముందస్తు ఆలోచనలున్నాయనీ అందుకే ఉద్దేశపూర్వకంగానే ఆమె శోభ కుటుంబాన్ని పార్టీ, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానాల్లేకుండా చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి నిదర్శనంగానే ఈ నెల 3న జెడ్పీచైర్‌ పర్సన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వేపాడ మండలం కొండగంగుబూడిలో జరిగిన జన్మభూమి గ్రామసభకు ఆమెకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమవుతోంది.



సొంత మండలానికే ఆహ్వానం కరువు

స్వాతిరాణి జెడ్పీటీసీగా గెలుపొందిన మండలంలో జరుగుతున్న, స్వయంగా హాజరు కావాల్సిన గ్రామసభకు ఆమెను ఆహ్వానించకపోవడం కాకతాళీయం కానేకాదనీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ గ్రామసభకు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కూడా హాజరయినా స్థానిక జెడ్పీటీసీ అయిన చైర్‌పర్సన్‌ను హాజరు కానీయలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పాటు ఎల్‌కోట మండలంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి కూడా ఈమెకు ఆహ్వానం లేదని తెలిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న జన్మభూమి గ్రామసభలకు ఆహ్వానాలు అందుకుంటున్న ఛైర్‌పర్సన్‌... కోళ్ల లలిత కుమారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వేపాడ, ఎల్‌.కోట ప్రాంతాల్లోని జన్మభూమి గ్రామసభలకు మాత్రం ఆహ్వానం అందుకోలేకపోయారు. దీనికి కోళ్ల లలిత కుమారి అభద్రతా భావమే కారణమని తెలుస్తున్నది.



ఎమ్మెల్యేగా పోటీకొస్తారనేనా...

భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్‌ను కానీ వీరిలో ఎవరయినా ఆశిస్తారేమోనని అప్పుడు తనకు ప్రాధాన్యం తగ్గినా తగ్గవచ్చనీ ఎందుకయినా మంచిదని ముందుగానే వీరిని నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నారేమోనని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితి కేడర్‌ను కవలర పెడుతోంది. ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. జెడ్పీ ద్వారా పలు కార్యక్రమాలు, అభివృద్ధి పనులకోసం చైర్‌పర్సన్‌ను కలవాలి. మరో పక్క నియోజకవర్గ స్థాయిలో పనులకు ఎమ్మెల్యే అవసరముంటుంది. మరి వీరి మధ్య అంతరంతో తామెలా నడచుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నట్టు భోగట్టా!

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top