వరద దౌర్జన్యం

వరద దౌర్జన్యం - Sakshi


► పోలీసు అధికారుల సమక్షంలో టీడీపీ నేతల దురుసుతనం

► ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే అర్ధంతర అరెస్టులు

► ఎన్నికల అధికారి చేతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం

► అధికారపార్టీ నేతల కనుసైగల మేరకే చైర్మన్‌ ఎన్నిక వాయిదా




ప్రజాస్వామ్యం మరోమారు మంటగలిసింది. అండగా నిలవాల్సిన యంత్రాంగం ఏకపక్షంగా నిలిచింది.  ఏకంగా పోలీసు అధికారులే గొడవకు ఆస్కారం ఇవ్వగా, ఆ కారణంగా ఎన్నిక వాయిదా వేశారు. నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు అన్నట్లుగా తెరవెనుక డైరెక్షన్‌ అధికార యంత్రాంగం అమలు చేసింది. వెరసి ప్రొద్దుటూరు చైర్మన్‌  ఎన్నిక వాయిదా పడింది.



సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు పట్టణ ప్రజానీకం తాగునీటికి అవస్థలు పడుతున్నారు.  తక్షణమే సమస్య పరిష్కరించండి, ప్రజల తాగునీటి కష్టాలకంటే ప్రాణాలు లెక్కకాదంటూ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆమరణదీక్షకు సన్నద్ధమయ్యారు. అనుమతులు లేవంటూ పోలీసు అధికారులు అర్ధంతర అరెస్టుకు తెరలేపారు. తాగునీటి సమస్య కోసం శాంతియుతంగా ఆందోళన చేయాలని భావించినా   అడ్డుకున్నారు. అదేవిధంగా గండికోట నిర్వాసితులకు పరిహారం దక్కలేదని, వారంతా ఏకమై ఆందోళన చేసేందుకు సిద్ధమైతే, ఆ కార్యక్రమానికి హాజరవుతారనే ఉద్దేశంతో ప్రొద్దుటూరు పోలీసులు పలుమార్లు మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ కె జయశ్రీని హౌస్‌ అరెస్టు చేశారు. ఆందోళనలతో అలజడి నెలకొంటుందని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ, నిబద్ధత కల్గిన ప్రొద్దుటూరు పోలీసు అధికారులు 40మంది సభ్యులు ఎన్నుకునే చైర్మన్‌ ఎన్నికను చేపట్టలేకపోయారని పలువురు పేర్కొంటున్నారు. సభ్యులను తప్ప...ఇతరుల ప్రవేశాన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం వందల సంఖ్యలో అనుమతించడంతో ఘర్షణ తలెత్తిందని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకపోయినా ఏకంగా కౌన్సిల్‌హాల్‌లోకి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రవేశించారు.  పోలీసు అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోవడంతో,  తర్వాత మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వందల సంఖ్యలో అనుచరగణాన్ని వెంటబెట్టుకొని వచ్చారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆమేరకే టీడీపీ నేతలు ఒక్కమారుగా చెలరేగిపోయి విధ్వంసం సృష్టించారని విశ్లేషకులు భావిస్తున్నారు.



తిరగబడిన టీడీపీ వ్యూహం...: ప్రొద్దుటూరు మున్సిపాలిటిలో తెలుగుదేశం వ్యూహాం తిరగబడింది.ఛేర్మెన్‌ గురివిరెడ్డిని తప్పించి ఆ స్థానంలో ఆసం రఘురామిరెడ్డి చేయాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తలచారు. రఘురామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పలువురు టీడీపీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఫిరాయింపు కౌన్సిలర్లు సైతం ఈ పరిణామాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఈక్రమంలో కౌన్సిలర్‌ ముక్తియార్‌ను చైర్మన్‌ చేయాలని భావించారు. వీరికి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు జతకట్టారు. వైఎస్సార్‌సీపీ ఫిరాయింపు కౌన్సిలర్ల తోపాటు వరద వర్గీయులను వ్యతిరేకిస్తున్న 6 మంది టీడీపీ కౌన్సిలర్లు జట్టుగా క్యాంపునకు వెళ్లారు.  15మంది సభ్యులు చైర్మన్‌ ఎన్నికకు తరలివచ్చారు. వీరికి తోడుగా 10మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు నిలవడంతో కోరం ఏర్పడింది. చైర్మన్‌ ఎన్నికలో వ్యూహం తిరగబడడంతో ఎలాగైనా వాయిదా వేయాలనే తలంపుతో టీడీపీ నేతలు రభస సృష్టించారు. అనుకున్నదే తడువుగా టీడీపీ నేతలకు అటు పోలీసు, ఇటు రెవెన్యూ అధికారులు వత్తాసుగా నిలచి వాయిదా వేశారు.



తెరవెనుక డైరెక్షన్‌ మేరకే...: మున్సిఫల్‌ చైర్మన్‌ ఎన్నిక విషయమై మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రొద్దుటూరులో తిష్టవేసి పర్యవేక్షించసాగారు. స్వయంగా కౌన్సిలర్‌ ముక్తియార్‌కు లేఖరాశారు. దీనిని  మాజీ చైర్మన్‌ గురివిరెడ్డి ద్వారా కౌన్సిల్‌హాల్‌లో అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో తెరవెనుక మంత్రాంగం నిర్వహించి చైర్మన్‌ ఎన్నిక వాయిదా వేయాలని కనుసైగల మేరకు వ్యవహారాన్ని అధికారులు చక్కబెట్టారని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో ఘర్షణ సాకుగా చూపి ఎన్నికల అధికారి జమ్మలమడు గు ఆర్డీఓ వినాయకం వాయిదా వేశారు. కాగా 40 మంది సభ్యులచే చైర్మన్‌ ఎన్నిక చేపట్టలేని దుస్థితిలో జిల్లా యంత్రాం గం ఉండిపోవడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆదివారమైనా చైర్మన్‌ ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top