మమ్మల్ని బతకనివ్వరు బాబోయ్‌..

మమ్మల్ని బతకనివ్వరు బాబోయ్‌.. - Sakshi


‘మమ్మల్ని బతకనివ్వరు బాబోయ్‌.. చంపేత్తారు నాయనో.. వారి నుంచి మా పేణాలు కాపాడండి’ ఇది ఓ మహిళ ఆర్తనాదం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకుతో కుటుంబాన్ని వెళ్లదీస్తున్న ఓ అతివ కన్నీటి వేదన. శనివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా నిప్పురవ్వలు మీద పడ్డాయి. కళ్లు తెరిచి చూస్తే.. ఇల్లు కాలిపోతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెంటనే తల్లీపిల్లలు బయటకు పరుగులు తీశారు. ఆస్తి నష్టం తప్పకపోయినా.. స్థానికుల సహాయంతో చివరకు సజీవంగా బయటపడ్డారు. గుండెలు కదిలించే ఈ దారుణ సంఘటన పాయకరావుపేట మండలం కొర్లయ్యపేటలో జరిగింది. పాత కక్షలతో టీడీపీ నాయకుడు ఈ ఘోరానికి ఒడిగట్టాడని బాధితురాలు ఆరోపిస్తోంది.



నక్కపల్లి (పాయకరావుపేట) : ఇల్లు దగ్ధమైంది.. బూడిద మిగిలింది.. లక్షలాది రూపాయల విలువైన గహోపకరణాలు మంటలపాలయ్యాయి.. కళ్ల ముందే ఈ దారుణం జరగడంతో చూసి తట్టుకోలేక షాక్‌కు గురయింది. కుటుంబ సభ్యులు సపర్యలు చేయడంతో తేరుకున్న ఆమె అర్ధరాత్రి సమయంలో జరిగిన సంఘటనను పోలీసులకు కళ్లకు కట్టినట్లు వివరించింది. భర్త చనిపోవడంతో కొర్లయ్యపేట గ్రామానికి చెందిన పేర్ల అమ్మాజీ ముగ్గురు పిల్లలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. ఆమె కథనం ప్రకారం.. శనివారం అర్ధరాత్రి నిద్రిస్తుండగా నిప్పురవ్వలు మీద పడడంతో హఠాత్తుగా మెలకువ వచ్చింది. మంటలు చూసి భయంతో ముగ్గురు పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీసింది. కేకలు వేయడంతో చుట్టపక్కలవారు వచ్చి సాయం చేసేలోగా సర్వం కాలిబూడిదయింది. పాత కక్షలతో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు మోసా సతీష్‌ ప్రోద్బలంతో కొంతమంది వ్యక్తులు తన ఇంటిని పెట్రోలుతో తగులబెట్టారని, తమను సజీవ దహనం చేయాలని యత్నించారని ఆమె ఆరోపిస్తోంది.  



నెల రోజుల క్రితం..  

బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా జన్మభూమి కమిటీ సభ్యుడు మోసా సతీష్‌ అనుచరుడు చొక్కా వీరబాబు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని,  ప్రతిఘటించి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టానని అమ్మాజీ తెలిపారు. ఇది నెల రోజుల క్రితం జరిగిందని, చివాట్లు పెట్టించడాన్ని జీర్ణించుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.  పదిహేను రోజుల క్రితం ఇలాగే దాడి చేస్తే ఎదుర్కొన్నామని, పోలీసులకు ఫిర్యాదు చేశామని కేసులు కూడా నమోదు చేశారంది. శుక్రవారం కూడా ఇల్లును ధ్వంసం చేయడానికి వస్తే ప్రతిఘటించామని తెలిపింది. శనివారం అర్ధరాత్రి సమయంలో వారు పాల్పడిన ఈ సంఘటనను తలచుకుంటే భయం వేస్తోందని, తన కుటుంబాన్ని సజీవ దహనం చే యాలన్న పన్నాగంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారంటూ ఆ మె పోలీసులకు, విలేకర్లకు వివరించింది. సతీష్, అతని అనుచరులు సూరాడ రమణ, ఎం.శ్రీను, గంటా సుబ్బారావు, గోపి, చొక్కా వీరబాబు పాల్పడ్డారని ఆరోపించింది.  



తన సోదరుడి ఉద్యమాలు తట్టుకోలేకే..

ఈ ప్రమాదంలో నిప్పురవ్వలు మీదపడకపోతే నిద్ర మత్తులోనే సజీవ దహనమయ్యేవారమని.. కలపంతా పూర్తిగా కాలిపోయి మీదపడి బూడిదయ్యేవారమని బాధితురాలు అమ్మాజీ బోరున విలపించింది. స్థానిక ఎమ్మెల్యే అండదండలు చూసుకునే సతీష్‌ తదితరులు తమపై ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను జాతీయ మత్స్యకారుల సంఘ జిల్లా అధ్యక్షుడు మోసా అప్పలరాజుకు సోదరినని, అధికార పార్టీ నాయకుల ఆగడాలను, మత్స్యకారులపై జరుగుతున్న దా డులను అరికట్టేందుకు కృషి చేస్తున్నాడని ఈ కారణంగానే తనపై కక్షకట్టి ఏదోలా అంతమొందించాలని చూస్తున్నారంటూ తెలిపింది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేయకపోతే పాయకరావుపేట పోలీస్‌స్టేషన్‌ ముందు తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొంది. ఈ ఘటనలో అమ్మాజీ ఇంట్లో రూ.60 వేల నగదు, బీరువా, దుస్తులు, రూ.30 వేల విలువైన ఎల్‌ఈడీ టీవీ, పదివేల విలువైన హోం ధియేటర్, వంట సామగ్రితోపాటు తాటాకు ఇల్లు పూర్తిగా మాడి మసయింది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పాయకరావుపేట ఎస్‌ఐలు సత్యనారాయణ, బాబూరావు, నక్కపల్లి ఎస్‌ఐ రామకృష్ణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ను, క్లూస్‌ టీంను రప్పించి విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.



గ్రామంలో  భయం భయం...

ఆర్నెల్ల క్రితం ఇదే పంచాయతీ పరిధిలో పాల్మన్‌పేటలో మత్స్యకారులకు చెందిన 70 కుటుంబాలపై టీడీపీకి చెందిన వారు దాడులకు తెగబడి దొరికినవారిని దొరికినట్లుగా చితక బాదారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీకి చెందిన పాల్మన్‌పేట సర్పంచ్, ఎంపీటీసీల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. వారినే టార్గెట్‌ చేసుకుని ఈ దాడులు జరిగాయి. సుమారు 15 రోజులపాటు గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. దాడులకు పాల్పడిన వారిలో సుమారు 40 మంది వరకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనను ఇంకా మరువకముందే ఇదే పంచాయతీలో శివారుగా ఉన్న కొర్లయ్యపేటలో తాజాగా ఈ ఘటన జరగడంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఏ పరిస్థితికి దారి తీస్తుందోనని భయపడుతున్నారు.



ఎమ్మెల్యే అండ చూసుకునే..

స్థానిక ఎమ్మెల్యే అనిత అండదండలు చూసుకుని టీడీపీ నాయకులు ఇలా దమనకాండకు పాల్పడుతున్నారని బాధితురాలి సోదరుడు మోసా అప్పలరాజు ఆరోపించారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ దాడులకు పాల్పడిన సతీష్‌ తదితరులను పార్టీ నుంచి బహిష్కరించాలని, జన్మభూమి కమిటీ సభ్యుడిగా తొలగించాలన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు న్యాయం జరగకపోతే తన సోదరి, పిల్లలు పోలీస్‌స్టేషన్‌ వద్దే ఆత్మహత్య చేసుకుంటారన్నారు. ఎప్పటికైనా వీరి వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. గ్రామంలో ఏ చిన్న తగాదా జరిగిన పొరుగు జిల్లా నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు వచ్చి దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు.

– మోసా అప్పలరాజు,

జాతీయ మత్స్యకార సంఘ జిల్లా అధ్యక్షుడు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top