ఇసుక అక్రమ మైనింగ్ అడ్డుకోండి


 శ్రీకాకుళం పాతబస్టాండ్ : గార మండలం శ్రీకూర్మం పంచాయతీ సతివాడ పరిధిలోని టీజీఐ కర్మాగార యాజమాన్యం సముద్ర తీరంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక మైనింగ్‌ను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకూర్మం సర్పంచ్ రామశేషు, వందల సంఖ్యలో గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహంకు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీనరసింహం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. జేసీ-2 పి.రజనీకాంతారావు, డ్వామా పీడీ కూర్మనాథ్, డీఆర్‌డీఏ పీడీ కిశోర్‌కుమార్, సీపీఓ శివరామనాయకర్, వ్యవసాయ శాఖ జేడీ రామారావు, డీఈఓ దేవానందరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆదిత్యలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటేశ్వర్లు, వయోజన వద్య డీడీ కృష్ణారావు, డీఎస్‌ఓ వి.సుబ్రహ్మణ్యం తదితర జిల్లా అధికారులు హాజరయ్యారు.

 

 వింతరోగం నుంచి ఆదుకోండి..

 వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన లచ్చుబుక్త సాయికుమార్ (16), వర ప్రసాద్ (11) తీవ్రమైన చర్మవాధులతో బాధపడుతున్నారు. ఎందరు వైద్యులకు చూపించినా.. వ్యాధిని నిర్దారించడం లేదని వారి తల్లిండ్రులు గోపి, కుమారి కలెక్టర్ వద్ద వాపోయారు. మెరుగైన వైద్యం అందించాలని, పింఛన్ మంజూరు చేయాలని వారు గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ను విన్నవించారు.

 

 చేనేత రుణాలు మాఫీ చేయాలి


 ప్రభుత్వ హామీ మేరకు చేనేత రుణాలు మాఫీ చేయాలని ఎల్‌ఎన్‌పేట మండలం భోగలింగేశ్వర చేనేత సంఘం సభ్యులు కోరారు. సంఘంలో వంద మంది సభ్యులు ఉండగా, 2014లో ఒకొక్కరు *25 వేల వంతున రుణం పొందారని, నేటికీ రుణమాఫీ చేయలేదని సంఘ సభ్యులు కె.లక్ష్మీకాంతం, చిట్టమ్మ, ఈశ్వరమ్మ, పార్వతి, సావిత్రి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

 

 మొగదాలపాడును  రెవెన్యూ గ్రామంగా గుర్తించాలి

 గార మండలం మొగదాలపాడును రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని గ్రామంకి చెందిన పి.అప్పలస్వామి, అప్పన్న, పి.కృష్ణ, జి.వెంటస్వామి, సీహెచ్ సూర్యనారాయణ తదితరులు కోరారు. ఈ గ్రామం ప్రస్తుతం వత్సవలన పంచాయతీలో ఉందని వివరించారు.  

 

 పరిహారం చెల్లించండి

 వంశధార ప్రాజెక్టు పరిధిలోని పాత హిరమండలం హరిజన వీధి, కొత్తగౌడవీధి, కోణంగి వీధి, కుమ్మరి వీధి, నాయుడు వీధులను నిర్వాసిత ప్రాంతాలుగా గుర్తించి పరిహారం చెల్లించాలని సర్పంచ్ సూర్యకుమారి, ఎ.అబ్బాయి, కె.మల్లేశ్వరరావు, ఎం.మురళి, పి.నారాయణరావు, కె.లచ్చన్న తదితరులు కలెక్టర్‌ను కోరారు. ఈ ప్రాంతం మీదుగా వంశధార కుడి కాలువ వెళ్లడంతో సుమారు 600 కుటుంబాలకు నష్టం వాటిల్లుతుందని వివరించారు.

 

 హిందీ పండితులకు న్యాయం చేయాలి

 2002-డీఎస్సీలో హిందీ పండితులుగా ఎంపికైన అభ్యర్థులకు కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టులు ఇవ్వాలని హిందీ పండితులు జె.ఉమామహేశ్వరరావు, బి.మోహనరావు, ఎం.వెంకటరమణ కలెక్టర్‌ను కలిసి విన్నవించారు.

 

 రిమ్స్ సెక్యూరిటీలకు జితాలు చెల్లించాలి

 అవుట్ సోర్సింగ్ విధానంలో రిమ్స్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు జీతాల బకాయిలు చెల్లించాలని ఆ సంఘ నాయకులు కె.శ్రీనివాసరావు, ఎ.సూర్యనారాయణ, ఆర్. భీమశంకర్, లక్ష్మణరావు తదితరులు కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలు పెంచాలని కోరారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top