కల్లు తాగిన కోతి నయం.. యువనేత ఆగడాలు!

కల్లు తాగిన కోతి నయం.. యువనేత ఆగడాలు! - Sakshi


సెల్ఫీల పేరుతో అమ్మాయిల ఫొటోలు

ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అచ్చెన్న, లోకేష్‌ల పేరుతో బెదిరింపులు




శ్రీకాకుళం: కల్లు తాగిన కోతి ఏమి చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే.. అంతకన్నా దారుణంగా తయారయ్యారు ఇక్కడ కొంతమంది ‘మహానుభావులు’. మద్యం సేవించి సెల్ఫీల పేరుతో అమ్మాయిలను ఫొటోలు తీసి, ఆపై హెచ్చరికలు.. ఇదేమిటని ప్రశ్నించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు బెదిరింపులు. ఇన్ని ఘనకార్యాలు చేసింది ఎవరో కాదు.. గతంలో రౌడీషీటర్‌గా పోలీస్‌ రికార్డుల్లోకి ఎక్కిన, ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ యువనేత!! సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.



శ్రీకాకుళం పట్టణంలోని ఎస్‌వీసీ థియేటర్‌ దగ్గర అధికార పార్టీకి చెందిన ఓ యువ నేత, అతని మిత్రుడు పూటుగా మద్యం సేవించి ఉన్నారు. ఇంతలో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన బస్సు నుంచి ఐదుగురు విద్యార్థినులు అక్కడ దిగారు. ఇంతలో ఆ యువనేత, అతని మిత్రుడు కలసి సెల్ఫీల పేరుతో ఆ విద్యార్థినుల ముందు నుంచి ఫొటోలను తీయడం ప్రారంభించారు. ఇది గమనించిన విద్యార్థినులు వారిని నిలదీశారు. దీంతో ఆ మందుబాబులిద్దరూ.. ‘మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం. మీ దిక్కున్నవారితో చెప్పుకోండం’టూ బెదిరింపులకు దిగారు.



విద్యార్థినులు ఈ విషయాన్ని సమీపంలో ఉన్న ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారి తల్లిదండ్రులకూ జరిగిన విషయాన్ని చెప్పారు. అమ్మాయిలను ఎందుకు ఏడిపిస్తున్నారని.. ఆ యువకులను ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ప్రశ్నించారు. దీంతో ఆ యువనేత.. ‘నేనవరో తెలుసా? నా వెనుక మంత్రి అచ్చెన్న, మంత్రి లోకేష్‌ ఉన్నారు. ట్రాఫిక్‌లో ఎలా ఉద్యోగం చేస్తావో నేనూ చూస్తా. నీ ఉద్యోగం ఊడబీకుతా. నీకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయ్యిందం’టూ ఆ కానిస్టేబుల్‌ను బెదిరించసాగాడు. జరిగిన విషయాన్ని ట్రాఫిక్‌ ఎస్సై దృష్టికి ఆ కానిస్టేబుల్‌ తీసుకెళ్లాడు. అప్పటికే డయల్‌ 100కు కూడా సమాచారం వెళ్లింది. దీంతో అధికార పార్టీకి చెందిన ఆ యువనేతను, అతని మిత్రుడిని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



స్టేషన్‌ వద్ద హైడ్రామా?

జరిగిన విషయాన్ని బాధిత కుటుంబసభ్యులు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సోమవారం రాత్రి వెళ్లారు. అయితే ఇది మొదటి తప్పుగా భావించి, చూసీచూడనట్లు వదిలేయాలని, కేసు పెడితే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వారిని కొంతమంది భయబ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది.



ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తాం..

ఈ ఘటనపై బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. అయితే బాధితుల నుంచి ఎటువంటి ఫిర్యాదూ తమకు రాలేదన్నారు. యువకులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపతున్నామని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top