అధినేత గుర్తించని.. అలక సీరియల్‌

అధినేత గుర్తించని.. అలక సీరియల్‌ - Sakshi


మూడు వారాలవుతున్నా పట్టు వీడని బండారు

అది గుర్తింపు కోరే డ్రామానా.. ప్రజ్వరిల్లే బడబాగ్నా..

ఇటీవల సీఎం పర్యటనకూ డుమ్మా.. పార్టీ కార్యక్రమాలకూ అంతే..

ఏమాత్రం పట్టించుకోని టీడీపీ అధిష్టానం

కనీసం ఫోన్‌ కూడా చేయని అధినేత బాబు

ఎటు దారితీస్తుందోనని పార్టీ శ్రేణుల్లో చర్చ




‘కోపముంటే శిక్షించు.. లేదంటే మన్నించు.. అంతే కానీ మేమున్నామని గుర్తించు’.. ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలోని ఈ డైలాగ్‌ ఇప్పుడు మాజీ మంత్రి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి సరిగ్గా సరిపోతుంది. మంత్రి పదవి రాలేదని అలకబూని మూడు వారాలుగా సాగతీత డ్రామా నడిపిస్తున్నా.. బండారును పార్టీలో పట్టించుకునే వారే లేరు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు జిల్లా

పర్యటనకు వచ్చిన సందర్భంలోనైనా తమ నేతను అనునయిస్తారనుకున్న అనుచరుల ఆశలు అడియాసలే అయ్యాయి. ఫలితంగా అలక డ్రామా టీవీ సీరియల్‌ మాదిరిగా  కొనసాగుతోంది. ఇంతకూ బండారు ఏం ఆశిస్తున్నారు.. వచ్చే నెలలో నగరంలో జరిగే మహానాడుకైనా హాజరవుతారా.. గైర్హాజరైతే ఏమిటి పరిస్థితి.. ఆయనలోని అసమ్మతి బడబాగ్ని మరింత చెలరేగుతుందా.. కాలమనే నుసిపట్టి చల్లారిపోతుందా.. ఇప్పడీ ప్రశ్నలే ఆయన అనుచరులు.. టీడీపీ శ్రేణుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం






విశాఖపట్నం : మంత్రి పదవి రాలేదని అలకబూనిన టీడీపీ సీనియర్‌ నేత, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వ్యవహారం ఎటు తిరిగి.. ఎటు వెళుతుందోనని ఆ పార్టీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గతంలో ఓ దఫా మంత్రిగా కూడా పనిచేసిన బండారు మలి విడత విస్తరణలో మంత్రి పదవి ఆశించారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఆయన్ను ఏ దశలోనూ పరిగణనలోకి తీసుకోలేదనే చెప్పాలి. ఈ నెల రెండో తేదీన జరిగిన విస్తరణలో జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడులనే కొనసాగిస్తూ బాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దరిమిలా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తదితరులు అసంతృప్తి వ్యక్తం చేసినా ఒకటి రెండురోజులకే కుదురుకున్నారు. కానీ  సీనియర్‌ నేత బండారు మాత్రం తగ్గలేదు. మొదట్లో ఆయన అనుచరులు ధర్నాలు చేయడం, గన్‌మెన్‌ను వెనక్కి పంపి కొద్దిరోజులు బండారు అజ్ఢాతంలోకి వెళ్లడం.. తదితర పరిణామాలు చూసిన టీడీపీ నేతలు రోజులు గడిచే కొద్దీ వేడి తగ్గుతుందని ఆశించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావులు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో పరిస్థితి సద్దుమణుగుతుందని భావించారు. కానీ బండారు మాత్రం వ్యూహాత్మకంగా అసమ్మతిని వెళ్లగక్కుతూ ముందుకు సాగుతున్నారు.



కుమార్తె పెళ్లి తర్వాత తాడోపేడో

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో బండారు కుమార్తె వివా హం జూన్‌లో జరగనుంది. ఇటీవలే నిశ్చితార్ధ వేడుకలు జరిగాయి. ఈ నేపథ్యంలో జూన్‌ తర్వాతే బండారు తన అసంతృప్తిని బాహటంగా వ్యక్తం చేసి అమీతుమీ తేల్చుకుంటారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. తమ సామాజికవర్గానికే చెందిన అయ్యన్నను కొనసాగించడంతో బం డారుకు మంత్రి ఇవ్వలేకపోయామన్న అధిష్టానం వాదనను ఆయన మద్దతుదారులు కొట్టిపారేస్తున్నారు. అయ్యన్నకు దీటుగా తమ నేత పార్టీకి సేవలందిస్తున్నా పదవుల విషయంలో మాత్రం అన్యాయం జరుగుతోందని వాదిస్తున్నారు.



మహానాడు మెలిక

టీడీపీ అట్టహాసంగా నిర్వహించే మహానాడును ఈ ఏడాది విశాఖలో నిర్వహించాలని పార్టీ అధిష్టానం  నిర్ణయించింది. మే 27, 28, 29 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యా యి. ఏకంగా సీఎం కార్యక్రమానికే డుమ్మా కొట్టిన బండారు మహానాడుకైనా వస్తారా.. దానికి కూడా గైర్హాజరైతే పరిస్థితేమిటన్న చర్చలు పార్టీలో మొదలయ్యా యి. ఇదిలా ఉండగా, విస్తరణ జరిగి  మూడువారాలు దాటిపోయినా ఇంకా అసమ్మతి వ్యక్తం చేస్తున్న బండారు డిమాండ్‌ ఏమిటన్నది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. ఏదైనా కార్పొరేషన్‌ చైర్మన్‌ కోసమా... పోనీ స్థాయిని తగ్గిం చుకుని వుడా చైర్మన్‌ పదవైనా తీసుకుంటారా.. అసలు ఆయన ఏం ఆశించి అలక డ్రామా కొనసాగిస్తున్నారన్నది అర్థం కాకుండా ఉంది. ఏస్థాయిలో అల క ప్రదర్శిస్తున్నా..  అధినేత బాబు పట్టించుకోకపోవడంతో బం డారు అలక వ్యవహారం చివరికి ఎలా ముగుస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.



అధిష్టానం తీరుపై గుర్రు

పార్టీలు మారకుండా నిబద్ధతతో  పని చేస్తున్న తన పట్ల అధిష్టానం వ్యవహరించిన తీరుపై బండారు గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో సీనియర్‌ నేతగా తన పేరును కనీసం పరిశీలించకపోవడం, ఆ తర్వాతైనా ఎందుకు ఇవ్వలేకపోయామో సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు తెలు స్తోంది. ఇక పార్టీలు మారిన గంటా అండ్‌ కోను తన వద్దకు రాయబారం పంపడం.. ఆయన అనుచరుల్లో మరిం త ఆగ్రహావేశాలు పెంచాయని అంటున్నారు. అందుకే పట్టు వీడకుండా బండారు తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం జరిగిన సీఎం జిల్లా పర్యటనకు సైతం డుమ్మా కొట్టారు. మూడువారాలుగా అధికారిక కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top