ఏమిటీ దుబారా?


► నవనిర్మాణ దీక్ష పేరుతో రూ.‘కోట్లు’ కుమ్మరింపు

► ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం




సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికలోటుతో సతమతమవుతోందని చెప్పే ప్రభుత్వం అనవసరంగా రూ.కోట్లాది రూపాయలను దుబారాగా ఖర్చు చేస్తోంది. మూడేళ్ల పాలనలో సాధించింది శూన్యమైనా గొప్పల కోసం, కాకి లెక్కలు చెప్పు కునేందుకు నవ నిర్మాణదీక్ష పేరిట వారం రోజుల పాటు ప్రభుత్వం నానా హంగామా చేసింది. ఓ పక్క ఆర్థిక లోటంటూనే రూ.కోట్లు తగలేస్తున్నారు. ఈ దీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేస్తే అధికారులు మాత్రం రూ.2కోట్ల వరకు ఖర్చయ్యిందంటూ లెక్కలు చూపుతున్నారు. ప్రజాధనం దుబారాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.



రాష్ట్ర విభజన జరిగిన జూన్‌ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నవనిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది. ఏమాత్రం తగ్గకుండా హంగు ఆర్భాటంతో పూర్తి చేశారు. తొలిరోజు ప్రతిజ్ఞతో మొదలైన ఈ హంగామా 8వ తేదీ సంకల్ప సభ వరకు సాగింది. ప్రతీరోజూ శాఖల వారీగా సభలు నిర్వహించి కాకిలెక్కలతో లేనిగొప్పలు చెప్పుకున్నారు. గతేడాది చివరి రోజు మాత్రమే భోజనాలు ఏర్పాటు చేయగా ఈసారి ప్రతిరోజు నియోజకవర్గానికి వెయ్యి మందికి తక్కువ కాకుండా భోజనాలు ఏర్పాటు చేశామని, విశాఖపట్నంలో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమంలో సుమారు 2 వేల మందికి ప్రతిరోజు భోజనా లు ఏర్పాటు చేసినట్టు అధికారులు లెక్కలు చూపించేవారు.



ప్రతీరోజూ జనసమీకరణ చేయలేక అధికారులు నానాయాతన పడ్డారు. సొమ్ము ఇవాళ కాకపోతే రేపైనా వస్తుందనే ఆశతో కొంతమంది అధికారులు అప్పోసప్పో చేసి దీక్షల కోసం ఖర్చు పెట్టారు. మరి కొంతమంది అధికారులైతే కింద స్థాయి సిబ్బందిపై భారం మోపి దీక్షలు కాని చ్చారు. కొన్ని నియోజకవర్గాలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు, మరికొన్ని నియోజకవర్గాలకు రూ.ఆరు నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చయిదని  లెక్కలు చూపారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా రూ.2కోట్ల వరకు ఖర్చయినట్టుగా చెబుతున్నారు. సిటీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన దీక్షలకయ్యే ఖర్చును జీవీఎంసీ భరించింది. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు.



ఖర్చు మొత్తాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గ పరిధిలోని మూడు లేదా నాలుగు మండలాలకు సమానంగా కేటాయించి ఆయా మొత్తాలను స్థానిక మండలాధికారులు భరించేలా స్థానిక అధికార పార్టీ నేతలు ఆదేశాలిచ్చారు. ఇలా ఒక్కో మండలా నికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు భారం పడిం ది. కాగా రెండురోజుల క్రితం జిల్లాకు కోటి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు నిధులు కూడా జిల్లాకు జమయ్యాయి. అయితే అధికారులు పెట్టిన ఖర్చులతో సంబంధం లేకుండా ఒక్కో నియోజక వర్గానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశా రు. మిగిలిన 25 లక్షలను జిల్లా కేంద్రంలో ఖర్చు పెట్ట డంతో పాటు అరకులోయలో సీఎం పర్యటన ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చు కింద మినహాయించారు. వరుసగా ఎనిమిది రోజుల భోజనాలకే రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చయిందని, ఇతర ఖర్చులన్నీ కలిపితే రూ.15 లక్షల వరకు అయిందని, నియోజక వర్గానికి రూ.5 లక్షలు ఏ మూలకు సరిపోతుందని సంబంధిత అధికారులు ప్రశ్నిస్తున్నారు. కానీ నియోజక వర్గానికి 5 లక్షలకు మించి ఇచ్చే అవకాశం లేదని, ఆ మేరకు బిల్లులు కూడా సమర్పించాల్సి ఉంటుం దని జిల్లా ప్రణాళికాధికారి రామశాస్త్రి తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top