టీడీపీ బాహాబాహీ

టీడీపీ బాహాబాహీ

  •   టీడీపీలో ఆగని రచ్చ

  •   మంత్రి రావెల సమక్షంలో తమ్ముళ్ల తన్నులాట

  •   చీరాల టీడీపీ కార్యకర్తలపై జులుం

  •   రావెల అనుచరులు, పోలీసులు చితక్కొట్టారంటున్న సునీత వర్గం

  •   సునీత వర్గీయులను పలకరించని మంత్రి

  •   మంత్రి కారును అడ్డుకున్న కార్యకర్తలు

  •   చీరాల టీడీపీ మండల ఉపాధ్యక్షుడికి తీవ్ర గాయాలు

  •   రోడ్డుపై బైఠాయించిన సునీత వర్గం

  •   సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా బాహాబాహీ

  • ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు ఏ సమయంలో ముహూర్తం పెట్టారో తెలియదు గానీ.. జిల్లా టీడీపీలో ఈ వ్యవహారం పూటకో రచ్చగా మారుతోంది. ఆదిలో మాటల యుద్ధంతో మొదలైన వర్గవిభేదాలు.. భౌతికదాడులతో పతాకస్థాయికి చేరాయి. కరణం వర్సెస్‌ గొట్టిపాటితో మొదలైన ఈ రగడ, ముత్తుముల–అన్నా రాంబాబుల వర్గాల గొడవతో తీవ్ర రూపం దాల్చింది. తాజాగా ఈ పచ్చ రచ్చ చీరాలకు పాకింది. పాత టీడీపీ నేత పోతుల సునీత కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి వర్గాల మధ్య వర్గవిభేదాలు తీవ్రరూపం దాల్చాయి. సోమవారం ఒంగోలులో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం సందర్బంగా జిల్లా కేంద్రం రణరంగంగా మారింది.

     

    సాక్షి ప్రతినిధి, ఒంగోలు :

    ఒంగోలు నగరం కర్నూల్‌ రోడ్డులోని పాలకేంద్రంలో సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ అధ్యక్షతన  జిల్లా పార్టీ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు  హాజరయ్యారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులను, నియోజకవర్గ ఇన్‌చార్‌్జలను, ఎమ్మెల్యేలను లోనికి పిలిపించిన నేతలు వారితో నియోజకవర్గంలోని పరిస్థితులపై సమీక్షించారు. ఈ సమావేశంలో చీరాలకు చెందిన పోతుల సునీత వర్గం పాత టీడీపీ వర్గాన్ని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచికి ఎలా ప్రాధాన్యతనిస్తారంటూ మంత్రి రావెల కిషోర్‌బాబు నిలదీసే ప్రయత్నం చేసింది. సునీత వర్గం వాదనను వినేందుకు మంత్రి ససేమెరా అనడంతో గొడవ తీవ్ర రూపం దాల్చింది. సునీత వర్గీయులు మంత్రి రావెల కిషోర్‌బాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. చీరాల గొడవ సంగతి తేల్చాలంటూ మంత్రిని నిలదీశారు. దీంతో మంత్రి కాన్వాయ్‌లోని అనుచరులతో పాటు పోలీసులు కలిసి సునీత అనుచరులను చితక్కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. కాళ్లతో తన్నారు.కిందపడిన వారిని తొక్కారు. దీంతో ఒక్కసారిగా రావె ల అనుచరులు, పోలీసులు దాడికి దిగడంతో సునీత వర్గం తీవ్రంగా గాయపడింది. చీరాల రూరల్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాంబాబుతో పాటు పలువురు  గాయపడ్డారు. అతనితో పాటు వెంట ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులకు సైతం స్వల్పగాయాలయ్యాయి.గాయపడ్డ వారిని మంత్రి అనుచరులు,పోలీసులు లాగి పక్కన పడేశారు. 

    దాడికి నిరసనగా రోడ్డుపై బైఠాయింపు..

    అనంతరం సునీత వర్గీయులు ఒంగోలు, కర్నూలు ప్రధాన రహదారిపై బైఠాయించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రావెల అనుచరులే తమపై దాడి చేశారంటూ ఆరోపించారు. మంత్రిని తక్షణమే భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అనంతరం పోలీసులు వచ్చి వారిని రోడ్డుపై నుంచి పక్కకు తప్పించారు. పాత టీడీపీ కార్యకర్తలపై సాక్షాత్తు మంత్రి అనుచరులే దాడికి దిగడంతో సునీత వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, అమీతుమీ తేల్చుకుంటామని వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయకమిటీ సమావేశంలో టీడీపీ నేతలపై మంత్రి అనుచరులు, పోలీసులు దాడికి దిగడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

    మంత్రి రావెల గూండాలే దాడి చేశారు..

    నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకే వెళ్తే... మంత్రి రావెల కిషోర్‌బాబు అనుచరులు తమపై దాడికి దిగి గాయపరిచారని చీరాలకు చెందిన పోతుల సునీత అనుచరుడు రాంబాబు ‘సాక్షి’కిS తెలిపారు. నియోజకవర్గంలో అధికార పార్టీలో సమస్యలు విన్నవించేందుకు సమన్వయకమిటీ సమావేశానికి వెళ్లామన్నారు. సమావేశం ప్రారంభంలో మంత్రిని కలిసి సమస్యలు చెబుతామంటే సమావేశం అనంతరం చెప్పాలంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల సూచించారని, దీంతో మంత్రి కోసం సాయంత్రం వరకు వేచి ఉన్నామన్నారు. ఆయన వెళ్లేటప్పుడు నియోజకవర్గ సమస్యలు చెప్పుకుందామని కారు వద్దకు వెళితే మంత్రి కారు నిలపకుండా వెళ్లే ప్రయత్నం చేశారన్నారు. వినతిపత్రం అయినా తీసుకోవాలంటూ కారు దగ్గరకు వెళ్లగానే వెనుక కారులో ఉన్న మంత్రి అనుచరులు ఒక్కసారిగా తమపై దాడికి దిగారన్నారు. తమతో పాటు పలువురు గాయపడ్డారని, మంత్రి గుండాలను వెంటేసుకొని తిరుగుతూ జిల్లాలో అధికార పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని రాంబాబు ఆరోపించారు. మంత్రి రావెల వెంటనే భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top